అనుమానం. ఇదొక్కటి చాలు జీవితాలు సర్వనాశనమవడానికి. ముఖ్యంగా భార్యాభర్తలు, బంధువులు, ఒకరినొకరు ఇష్టపడిన వారి మధ్య ఇలాంటి పదానికి చోటే ఉండకూడదు. అలాంటిది మొదలైతే మాత్రం ఆ స్టోరీకి క్లైమాక్స్ చాలా ఘోరంగా ఉంటుంది. సహజీవనం చేస్తున్న జంట మధ్య మొలిచిన అనుమానపు బీజం ఏకంగా హత్యకు దారి తీసింది. తనకు దక్కనిది ఎవరికీ దక్కకూడదనే భావన దారుణాలకు దారులు వేస్తోంది. భర్త జైలు పాలవడంతో ఆమె ఒంటరైంది. అదే సమయంలో పరాయి వ్యక్తితో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితయడమే కాకుండా సహజీవనం వరకు వెళ్లింది. ఐతే అనుమానం పెనుభూతమై ఒకరి ప్రాణాలు తీసింది. వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లా ఆలమూరుకు చెందిన ఈరమ్మకు తిరుపాల్ అనే వ్యక్తితో 20 ఏళ్ళ క్రితం వివాహం జరిగింది. వివాదాస్పద వ్యక్తిత్వమున్న తిరుపాల్.. కొన్నేళ్ల క్రితం ఓ కేసులో జైలుపాలయ్యాడు. దీంతో ఈరమ్మ ఒంటరి అయింది.
అదే సమయంలో పాణ్యం చెంచు కాలనీకి చెందిన శ్రీరాములతో ఈరమ్మకు పరిచయం ఏర్పడింది. శ్రీరాములు మొదటి భార్య చనిపోవడంతో ఒంటరిగా ఉంటున్నాడు. దీంతో ఇద్దరి మధ్య మొదలైన పరిచయం వివాహేతర సంబంధానికి.. ఆపై సహజీవనానికి దారి తీసింది. ఇద్దరూ నల్లమల అటవీ ప్రాంతంలో తేనే సేకరించి జీవినం సాగించేవారు. కొన్ని రోజులు హాయిగా సాగిన వీరి సహజీవనంలో అనుమానం తీవ్ర దుమారం రేపింది. ఈరమ్మ ఎవరితోనే సంబంధం పెట్టుకుందన్న అనుమానం శ్రీరాములులో కలిగింది. అనుమానం పెనుభూతమవడంతో ఆమెను హతమార్చాలని స్కెచ్ వేశాడు.
ప్రతిరోజూ మాదిరిగానే తేనే సేకరణ కోసం ఇద్దరూ అటవీ ప్రాంతంలోకి వెళ్లారు. ఇద్దరూ హాయిగా మాట్లాడుకుంటూనే అటవీప్రాంతంలోకి వెళ్లారు. ఇంతలో వేరొకరితో చనువుగా ఉన్నావు.., అతనితో ఎఫైర్ నడుస్తుందా అంటూ శ్రీరాములు కోపంగా ఈరమ్మను నిలదీశాడు. అందుకు శాంతంగా స్పందించిన ఈరమ్మ.., నాకు నువ్వుంటే చాలు అంటూ సమాధానమిచ్చింది. ఐతే అప్పటికే ఈరమ్మపై కక్ష పెంచుకున్న శ్రీరాములు ఆమె వినే పరిస్థితి కనపడలేదు. పదే పదే అదే ప్రస్తావన తెస్తూ ఆమెను విసిగించాడు. దీంతో అగ్రహానికి లోనైనా ఈరమ్మ శ్రీరాములుతో వాదనకు దిగింది. మాటలు పెరిగి దూషించుకునే స్థాయికి చేరుకుంది.
ఈ క్రమంలో తీవ్ర ఆగ్రహానికి లోనైనా శ్రీరాములు బలమైన కట్టెతో ఈరమ్మ తలపై గట్టిగా మోదాడు. తీవ్ర గాయాలపాలైన ఈరమ్మ రక్తపు మడుగులో ప్రాణాలు విడిచింది. స్థానికులిచ్చిన సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు హత్యకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. శ్రీరాములును అదుపులోకి తీసుకొని అతడిపై హత్యకేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Crime news, Extramarital affairs, Kurnool