Murali Krishna, News18, Kurnool
భారతీయ సనాతన ధర్మంలో భాగమైన యోగా (Yoga) నేడు విశ్వవ్యాప్తమైంది. మానసిక ప్రశాంతతకు, మోక్షమార్గానికి ధ్యానం దారి చూపితే.. శారీరక ఆరోగ్యానికి యోగా చక్కగా తోడ్పడుతుంది. కర్నూలు జిల్లా (Kurnool District) లో పలువురు బాలబాలికలు యోగాలో అద్భుత ప్రదర్శన చేస్తున్నారు. కర్నూలు అవుట్ డోర్ స్టేడియంలో నిర్వహించిన శిక్షణ శిబిరాల్లో బాలబాలికలు వేసిన యోగాసనాలు ఔరా అనిపించాయి. వ్యాయామ గురూజీ అవినాష్ ఆధ్వర్యంలో పలువురు బాలబాలికలు యోగాలో శిక్షణ తీసుకుంటున్నారు. ఈక్రమంలో జాతీయ స్థాయిలో జరగనున్న యోగా పోటీలకు కర్నూలు నుంచి పలువురు బాలబాలికలు హాజరుకానున్నారు. ఈసందర్భంగా వ్యాయామ గురువు అవినాష్ మాట్లాడుతూ హఠయోగములో భాగమైన యోగాసనాలు శరీరారోగ్యానికి, దేహధారుడ్యాన్ని పెంచుతాయని అన్నారు. బౌద్ధం, జైన మతం, సిక్కు మొదలైన ధార్మిక మతాలలోనూ, ఇతర ఆధ్యాత్మిక సాధనలలోను యోగా ప్రాధాన్యత కనిపిస్తుందని వివరించారు.
దైనందిన జీవితంలో ప్రతి ఒక్కరు యోగా సాధన చేస్తే మానసిక, శారీరక రుగ్మతలకు చెక్ పెట్టవచ్చని న్యాయవాది శ్రీధర్ రెడ్డి అన్నారు. కర్నూలులో స్థానిక ఔట్ డోర్ స్టేడియంలోనీ యోగా హాల్ నందు యోగా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర క్రీడాకారుల శిక్షణ శిబిరాన్ని ఇటీవల ముఖ్యఅతిథిగా పాల్గొని న్యాయవాది శ్రీధర్ రెడ్డి ప్రారంభించారు. ఈనెల 27 నుంచి 31 వరకు పంజాబ్ రాష్ట్రంలోని ఫిరోజ్‌పూర్‌లో జరగనున్న 47వ జాతీయ స్థాయి సబ్ జూనియర్ అండ్ జూనియర్స్ యోగా పోటీల్లో రాష్ట్రానికి చెందిన పలువురు బాలబాలికలు పాల్గొననున్నారు.
ఈ సందర్భంగా న్యాయవాది శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ.. యోగాతో దీర్ఘకాలిక వ్యాధులను అదుపు చేసుకునే అవకాశం ఉందన్నారు. ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం యోగాను క్రీడగా గుర్తించి గ్రూప్ -సి ద్వారా ఉద్యోగ అవకాశాలను కల్పించడం శుభ పరిణామమని అన్నారు. అనంతరం రాష్ట్ర యోగ సంఘం ప్రధాన కార్యదర్శి అవినాష్ శెట్టి మాట్లాడుతూ 25 రోజుల పాటు జరిగే ఈ శిక్షణ శిబిరంలో పాల్గొన్న క్రీడాకారులకు న్యాయవాది శ్రీధర్ రెడ్డి భోజన వసతితో పాటు పౌష్టికాహారాన్ని అందజేస్తున్నారని తెలిపారు. జాతీయ స్థాయి యోగా పోటీల్లో పాల్గొనే రాష్ట్ర జట్టుకు ట్రాక్ సూట్‌లను పంపిణీ చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Kurnool, Local News, Yoga