Murali Krishna, News18, Kurnool
ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో మనిషి నిత్యం ఏదో ఒక సమస్యతో బాధపడుతుంటారు. అందుకు కారణం..! తాగునీరు, పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు వంటివన్నీ కలుషితం కావటమే. రసాయనాల వల్ల పండే పంటలు అవన్నీ మనిషి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపెడుతున్నాయి. అయితే ఆర్గానిక్ పద్ధతుల్లో పంటలను పండిచుకుని తినేంత ఓపిక ఎవరుకుంటుంది. అందుకు పెద్ద మెుత్తంలో స్థలం కావాలి. సిటీల్లో అది అసాధ్యం. కానీ కర్నూలు (Kurnool) కు చెందిన ఓ మహిళ మాత్రం కేవలం 6వందల గజాల స్థలంలోనే అన్ని రకాల పంటలు పండిస్తూ ఇంటికి కావలసిన కూరగాయలను సమకూర్చుకుంటున్నారు.
ఇన్ని రకాల పంటలు పండిస్తున్న ఈ మహిళ పేరు కోటేశ్వరి. ఊరు కర్నూలు. గత కొన్ని ఏళ్లు బోటనీ లెక్చరర్ గా విధులు నిర్వర్తించేవారు. కరోనా కాలం నుంచి ఇంటి పట్టున ఉంటున్నారు. అయితే లెక్చరర్ గా విధులు నిర్వర్తించేటప్పుడు ఏదో సమయం గడిచిపోయేదని.. .కరోనా సమయంలో ఇంటి నుంచి బయటకి రాలేని పరిస్థితి. అప్పుడే పూర్తిగా లెక్చరర్ పనికి స్వస్తి చెప్పి... విన్నూత్నంగా ఆలోచించి.. టెర్రస్ గార్డన్ పెంచాలనుకున్నారు. ఇందుకు చాలా యూట్యూబ్ ఛానెల్స్ ను ఫాలో అయ్యారని చెబుతున్నారు కోటేశ్వరి.
అతి కొద్ది స్థలంలోనే రకరకాల పంటలను పండించుకోవటాన్నే టెర్రస్ పద్దతి అంటారు. ఇందుకు తక్కువ స్థలం, నీటిని, సరిపడా వెలుతూరు ఉంటే చాలు. ఇదే పద్దతిని అవలంభించారట కోటేశ్వరి. మెుదటగా నాలుగు రకాల ఆకుకూరలు టెర్రస్ పై పెంచగా.. అవి మంచి ఫలితాన్ని ఇవ్వటంతో మరిన్ని పూల మెుక్కలు, పండ్ల మెుక్కలు పెంచడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఆమె మిద్దెపై వందల రకాల మెుక్కలను పెంచుతున్నారు.
ఈ టెర్రస్ గార్ఢనింగ్లో కాకార, మిర్చి, టమాట, బీరకాయ, పొట్లకాయ, దొండకాయ, చిక్కుడు వంటి కూరగాయలతో పాటు దానిమ్మ, జామ పండ్లను కూడా పండిస్తున్నారు. ఆకుకూరలు గోంగూర, కరివేపాకు, కొత్తిమీర, పాలకూర, మెంతికూరను వంటి ఆకు కూరలు కూడా ఆమె గార్డెన్ లో పెరుగుతున్నాయి. రకరకాల పూల మెుక్కలు కూడా పెంచారు. ఇవన్నీ తనకు టెర్రస్ మీద ఉన్న 600 వందల గజాల స్థలంలోనే. వీటికి ఎటువంటి రసాయనాలు వాడరు. కేవలం కిచెన్ నుంచి వచ్చే వ్యర్థాలను, ఆవు పేడను మాత్రం ఉపయోగిస్తారంటున్నారు కోటేశ్వరి.
ఇదంతా తన భర్త, ఇద్దరు కుమారుల సాయంతోనే చేయగలుగుతున్నానని ఆమె చెప్పారు. టెర్రస్ గార్డెన్ పెంపకానికి కుండీలకు పెద్దగా డబ్బులు వెచ్చించాల్సిన పనిలేదని.. పాత బకెట్లు, ప్లా్స్టిక్ డబ్బాలు, బిందెల వంటివాటిలోనే పెంచుకోవచ్చని కోటేశ్వరి వివరించారు. ఆకాశన్నంటుతున్న కూరగాయ ధరలకు ఈ టెర్రస్ గార్డన్ ద్వారా చెక్ పెట్టొచ్చని కోటేశ్వరి తెలిపారు. తాము పండించిన కూరాగాయలతోనే ఇంట్లో వంట చేస్తున్నాని చెబుతున్నారు. మిద్దెపై కేవలం మొక్కల పెంపకమే కాకుండా.. పావురాలను పెంచుతున్నారు. పిచ్చుకలను ఆకర్షించేలా ఏర్పాట్లు చేశారు. ఇలా తన ఇంటిని ఓ నందనవనంలా మార్చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Kurnool, Local News