Murali Krishna, News18, Kurnool
ఉమ్మడి కర్నూలు జిల్లా (Kurnool District) ఆత్మకూరు దోర్నాల అటవీ ప్రాంతంలో దుండగులు రెచ్చిపోతున్నారు. అడవి జంతువులను చంపి వాటి కళేబరాలను ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు వరుసగా జరుగుతుండటంతో అధికారులకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. గతనెల ఆత్మకూరు అడవి డివిజన్ వెలుగోడు రేంజి పరిధిలో గుండ్ల మల్లమ్మ వాగు సమీపంలో వేటగాళ్ల ఉచ్చులో చిక్కుకుని పెద్దపులి మరణించింది. మృతి చెందిన పెద్దపులి T48 F గా గుర్తించిన అధికారులు పులి వయసు 4 నుంచి 8 సంవత్సరాల మధ్యలో ఉండవచ్చని అంచనా వేశారు. ఈ సంఘటన జరిగిన ప్రాంతంలో వేటగాళ్లు వేసిన ఉచ్చును, పులిని చంపడానికి ఉపయోగించిన కొన్ని పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఇలా జిల్లాలో అనేక జంతువులు వేటగాళ్ల దెబ్బకు బలి అవుతుండడంతో అధికారులకు తనిఖీలను ముమ్మరం చేశారు. ఎక్కడికక్కడ ఆకస్మిక తనిఖీలు చేస్తూ నిందితులను పట్టుకునే పనిలో పడ్డారు. ఈ నేపథ్యంలోనే శ్రీశైలంలో జంతువుల అవయవాలకు సంబంధించి రహస్య అమ్మకాలు జరుగుతున్నట్లు పోలీసులకు, అటవీశాఖ అధికారులకు పక్కా సమాచారం అందింది.
శ్రీశైలంలోని షాపులపై అటవిశాఖ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. గత అర్ధరాత్రి నుంచి పలు షాపుల మీద అటవీశాఖ అధికారులు దాడులు నిర్వహించారు. అడవిలో స్వేచ్ఛగా తిరిగే జంతువులను వేటాడి వాటి శరీర భాగాలను అమ్ముతున్నారనే పక్కా సమాచారం తెలుసుకొని సెంట్రల్ ఫోర్స్ బృందం, మార్కాపురం DFO, ఆత్మకూరు DFOలు ఆకస్మిక దాడులు నిర్వహించారు.
శ్రీశైలంలో రుద్రాక్షలు విక్రయించే పలు దుకాణాలలో అటవీశాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. రుద్రాక్షలు విక్రయించే వ్యాపారుల వద్ద నుంచి పెద్ద మొత్తంలో ఉడుము శరీర భాగాలను అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే పులి గొర్లు, నెమలి ఈకలు, జింక కొమ్మలు ఇవ్వన్నీ స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. జ్యోతిష్య పండితులు కొందరు ఉడుము శరీర భాగాలు దేవుడి గదిలో ఉంటే మంచిదంటూ చెప్పడంతో దానికి డిమాండ్ పెరిగిందని అందుకే ఇలా అన్యాయంగా అడవుల్లో ఉన్న వీటిని చంపి వాటి కళేబరాలను అమ్ముతున్నట్లు డీఎఫ్‌ఓ సందీప్‌కుమార్ రెడ్డి తెలిపారు.
ఈ దాడుల్లో ముగ్గురు వ్యాపారస్తులను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులు దుర్గాప్రసాద్, గంప వేణు, జయచంద్ర గుప్తాగా గుర్తించారు. ముద్దాయిలపై చట్టపరంగా చర్యలు తీసుకోనున్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. ఈ అడవి జంతువుల శరీర భాగాలను పొరుగు రాష్ట్రాలైన బీహార్ ,ఉత్తరప్రదేశ్, నుంచి శ్రీశైలం వ్యాపారులకు స్పీడ్ పోస్ట్ ద్వారా వచ్చాయి అని అటవీశాఖ అధికారులు తెలిపారు. ఇంకా మిగతా షాపులను తనిఖీలు చేసి చట్టపరంగా చర్యలు తీసుకుంటామంటున్నారు అటవీశాఖ అధికారులు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Kurnool, Local News