Murali Krishna, News18, Kurnool
కర్నూలు జిల్లా (Kurnool District) వ్యాప్తంగా అన్నదాతలు ఆగమైపోతున్నారు. ఓకవైపు గత ఏడాది అధిక వర్షాలు మరోవైపు నకిలీ విత్తనాలు. ఇలా అన్నదాతలు నిలువునా బలైపోతున్నారు. పంట సాగు చేయడానికి కనీసం పెట్టిన పెట్టుబడి కూడా రాక అప్పులో కురుకుపోతున్నారు. పొలంలో పని చేయడానికి వచ్చిన వారికికూలీడబ్బులు చెల్లించలేక చమ్మగిల్లిపోతున్నారు. పనులు లేక కూలీలు సైతం వలస వెళ్లి పోతున్నారు. కర్నూలు జిల్లా ఆదోని ఎమ్మిగనూరు, పత్తికొండ తదితర ప్రాంతాలలో సుమారు 800 కుటుంబాలకు పైగా వలస వెళ్లారంటే పరిస్థితి ఎంత దారుణంగా మారిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చెమటోడ్చి పండించిన రైతన్నకు తినడానికి తిండి, గూడు కూడా మిగలలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి పరిస్థితికి ప్రధాన కారణం పండించిన పంటకు మార్కెట్లో సరైన గిట్టుబాటు ధర లేకపోవడం. మరోవైపు నకిలీ పత్తి విత్తనాలు ఎరువుల అధిక ధరలు అంటున్నారు రైతన్నలు.
కర్నూలు జిల్లాలో టమాటో (Tomato) రైతుల పరిస్థితి అతి దారుణంగా మారింది. కనీసం పిల్లలు కొనుక్కుతినే చాక్లెట్ ధరంతైన పలకడం లేదు. ఆరుగాలం శ్రమించి పండించిన అన్నదాతలకు చివరికి అప్పులే మిగులుతున్నాయి. పండించిన పంటకు పెట్టిన పెట్టుబడికి తేడా ఆకాశానికి భూమికి మధ్య ఉన్నంత తేడా ఉండడంతో రైతన్నలు విలవిలలాడిపోతున్నారు.
రాయలసీమ ప్రాంతంలో అధికంగా పండే పంటలలో ఒకటైనటువంటి టమాటో ధరలు గణనీయంగా పడిపోవడంతో రైతన్నలకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. దీంతో చేసేదేమీ లేక పంటలను అలాగే వదిలేస్తున్నారు. కొంతమంది మాత్రం వాటిని పశువులకు మేతగా పరబోస్తున్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరుపట్టణంలో ఉన్నటువంటి టమాటో మార్కెట్లో కిలో రెండు రూపాయల టమాటో ధర పలకడంతో రైతులకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది.
కనీసం పండించిన పంటకు గిట్టుబాటు ధర కాకపోయినా. మార్కెట్కు తీసుకు వచ్చినటువంటి రవాణా ఖర్చులు కూడా రాకపోవడంతో రైతన్నలు విలవిలలాడిపోతున్నారు. కనీసం పొలంలో పనిచేసినటువంటి కూలీలకు డబ్బు కూడా చెల్లించ లేనటువంటి పరిస్థితి ఏర్పడడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి కొంతమంది రైతులుపండించిన పంటను వృథాగా పోనీయకుండా కనీసం మద్దతు ధర అయినా లభిస్తుంది ఏమోనని ఆశతో వాటిని మార్కెట్కు తీసుకువెళ్తే కిలో రెండు రూపాయల చొప్పున ధర ఉండడంతో వాటిని తిరిగి వెనక్కి తీసుకెళ్లలేక మార్కెట్లోనే అలాగే వదిలి వెళ్ళిపోతున్నారు.
ఇలా కర్నూలు జిల్లా వ్యాప్తంగా రైతన్నల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ప్రభుత్వం రైతులను ఆదుకో లేకపోతే తమ కుటుంబాలను పోషించుకోలేక ఇల్లు వాకిలి అమ్ముకొని రోడ్డున పడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Kurnool, Local News, Tomato Price