ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాలు, అందునా రాయలసీమ రాజకీయాల్లో జేసీ ఫ్యామిలీ (JC Brother) కి ప్రత్యేక స్థానముంది. ఒకవిధంగా స్వపక్షంలోని విపక్షం అనే ముద్ర జేసీ బ్రదర్స్ పై ఉంది. రాజకీయ విమర్శలు చేయడంలో జేసీ బ్రదర్స్ స్టైలే వేరు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా.. పాలకులను నిలదీస్తుంటారు. ఏం చెప్పాలనుకున్నా ముక్కుసూటిగా చెప్పేస్తుంటారు. వైసీపీ (YSRCP) అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా అంశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి (JC Prabhakara Reddy). మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్రమంతా వైసీపీ గెలిచినా.. తాడిపత్రిలో మాత్రం టీడీపీని ఒంటిచేత్తో గెలిపించారు జేసీ ప్రభాకర్ రెడ్డి. సీఎం జగన్ నిర్ణయాలపై, వైసీపీ ప్రభుత్వ విధానలపై తనదైన శైలిలో, భయం బెరుకు లేకుండా విమర్శలు సంధిస్తుంటారాయన.
ఇక టీడీపీలోని లోటుపాట్లను కూడా ఇటీవల కాలంలో గట్టిగానే ప్రశ్నించారు. తాజాగా మరోసారి జేసీ ప్రభాకర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అనంతపురం (Anantapuram) లో చంద్రదండు రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ నాయుడుని పరామర్శించిన ఆయన.. కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రి ఉషశ్రీ చరణ్ ర్యాలీలో బాలిక మృతి చెందిన ఘటనపై నిరసన తెలిపిన వారిపై అక్రమ కేసులు నమోదు చేసి వేధిస్తున్నారని జేసీ మండిపడ్డారు. ఇలాంటి కేసులకు భయపడేది లేదని.. కార్యక్రతల్లో మరింత ధైర్యం నింపేందుకు పనిచేస్తానన్నారు. అంతేకాదు టీడీపీ గెలుపుపైనా సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్నారు. రాజకీయాల నుంచి తప్పుకొని ఎన్జీవో ప్రారంభించి సేవా కార్యక్రమాలు చేస్తానని ప్రకటించారు.
ఇటీవల పార్టీ నియోజకవర్గ ఇన్ ఛార్జుల విషయంలోనూ జేసీ కీలక వ్యాఖ్యలు చేశారు. పుట్టపర్తి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పల్లె రఘునాథ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. అనంతపురం జిల్లా నేత సైకం శ్రీనివాసరెడ్డిని టీడీపీ కార్యకర్తలకు పరిచయం చేసిన జేసీ ప్రభాకర్ రెడ్డి.. ఆయనపై ప్రశంసలు కురిపిస్తూనే మాజీ మంత్రి పల్లె రఘునాథ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. శ్రీనివాస్ రెడ్డి మచ్చలేని నాయకుడంటూనే ఈసారి పల్లె రఘునాథ్ రెడ్డికి టికెట్ ఇస్తే ఖచ్చితంగా ఓడిపోతారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన కాకుండా ఎవరికి టికెట్ ఇచ్చినా పార్టీ విజయం సాధిస్తుందని జేసీ జోక్యం చెప్పారు. పార్టీ అధిష్టానం పాతవారికి కాకుండా కొత్తవారికి టికెట్ ఇస్తేనే గెలుపు సాధ్యమన్న జేసీ.. తన కుమారుడి కంటే మంచి వ్యక్తికి టికెట్ ఇచ్చినా సపోర్ట్ చేస్తానని ప్రభాకర్ రెడ్డి ప్రకటించారు. జేసీ కామెంట్స్ పై అప్పట్లో టీడీపీలో దుమారం రేగింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Jc prabhakar reddy, TDP