Murali Krishna, News18, Kurnool
కర్నూలు జిల్లా (Kurnool District) లో రైతుల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారుతుంది. ఆరుగాలం క్షమించి పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రెక్కఆడితే డొక్కాడని పరిస్థితులలో భూమిని కౌలుకు తీసుకొని అప్పు చేసి పంటలు సాగు చేస్తే కనీసం మద్దతు ధర లేకపోవడంతో రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. పెట్టిన పెట్టుబడిలో కనీసం సగం కూడా రాకపోవడంతో దిక్కుతోచని అయోమయ పరిస్థితులలో ఉండిపోతున్నారు. పంట కోత సమయంలో పనిచేసినటువంటి కూలీలకు డబ్బులు చెల్లించలేక అప్పులలో కూరుకు పోతున్నారు.
మరోవైపు వాటిని మార్కెటుకుతీసుకెళ్లలేక రోడ్డు పక్కనే పారబోస్తున్నారు. టమాట ధరలు భారీగా పతనం అవడంతో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఎమ్మిగనూరులోని మార్కెట్ యార్డులో గత పది రోజులుగా టమాటధరలు భారీగా పతనమయ్యాయి. కిలో టమాటధరలు ఒక్క రూపాయి పలకడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కష్టపడి పండించి పంటను మార్కెట్కు తీసుకువస్తే ఒక బాక్స్ ధర కేవలం 10 రూపాయలు నుంచి 20 రూపాయలు పలకడంతో రైతులు లబోదిబోమంటున్నారు. కనీసం వాటిని తీసుకురావడానికి వచ్చిన వాహనాల రవాణా ఖర్చులు కూడా రాకపోవడంతో వాటిని అక్కడే రోడ్లపై చెత్తకుప్పల్లో పారబోస్తున్నారు.
వీటి ధరలు ఇలాగే కొనసాగితే తమ కుటుంబాన్ని పోషించుకోవడం చాలా భారం అవుతుందని తమ కుటుంబాలతో కలిసి ఆత్మహత్యలకు పాల్పడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించి తమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు...
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Kurnool, Local News, Tomato Price