Andhra Pradesh: అయ్యా నన్ను బతికించండి.. గుండెలు పగిలేలా రోదన. ఏపీలో ఆక్సిజన్ లెక్కేంటి?

ఆక్సిజన్ కోసం ఆస్పత్రుల చుట్టూ ప్రదక్షిణలు..

ఆక్సిజన్ కొరత ఏపీని తీవ్రంగా వేధిస్తోంది. కాపాడండి బాబు అంటూ చాలామంది ఆస్పత్రుల చుట్టూ క్యూ కడుతున్నారు. అయినా అందరికీ సరిపడ ఆక్సిజన్ బెడ్లు లేకపోవడంతో రోగుల పరిస్థితి ప్రమాదకరంగా మారుతోంది. మరోవైపు అధికారులు మాత్రం సరిపడ ఆక్సిజన్ నిల్వలు ఉన్నాయని చెబుతున్నారు. మరి వాస్తవం ఏంటి?

 • Share this:
  కరోనా రక్కసి మనుషుల జీవితాలను కకావికలం చేస్తోంది. సెకెండ్ వేవ్ రూపంలో సునామీలా ఏపీపై విరుచుకుపడుతోంది. తొలి దశలో భారీగా కేసులు నమోదైనా.. ఇంత భయపడాల్సిన పరిస్థితి కనిపించలేదు. కానీ సెకెండ్ వేవ్ మరింత ప్రమాదకారిగా మారింది. మనుషుల ప్రాణాలను బలితీసుకుంటోంది. పొరపాటున ఎవరికైనా కరోనా సోకితే ఊపిరి పీల్చుకోనీయకుండా చేసేస్తోంది. ఆక్సిజన్ కోసం అల్లాడిపోయేలా చేస్తోంది. ప్రాణాలను అరచేత పెట్టుకుని ఆస్పత్రుల చుట్టూ ప్రదక్షిణలు చేయిస్తోంది. అయితే ఏపీలో కరోనా బాధితుల సంఖ్య పెరుగుతున్నా అందుకు సరిపడ సౌకర్యాలు ఆస్పత్రుల్లో లేకపోవడంతో ఈ సారి మరణాల రేటు విపరీతంగా పెరుగుతోంది.

  తాజాగా గుంటూరులో ఓ రోగి రోధన గుండెలు పగిలేలా చేస్తోంది. శేషయ్య అనే వ్యక్తికి ప్రస్తుతం కరోనా సోకి పల్స్ పూర్తిగా పడిపోయాయి. చికిత్స కోసం ఎన్ని ఆస్పత్రులు తిరిగినా బెడ్లు దొరకడం లేదు. శ్వాస అందక చికిత్స దొరకక ఇంట్టోనే ప్రాణాపాయ స్థితిలో పోరాడాల్సి వస్తోంది. జిల్లా వ్యాప్తంగా ఎక్కడా వైద్యం అందక దయానీయ పరిస్థితిలో ఆ కుటుంబం కన్నీరు మున్నీరు అవుతోంది.

  గుంటూరు రిలయన్స్ స్టోర్ కు సమీపంలో ఉన్న శేషయ్యకు ఇటీవలే కరోనా సోకింది. గుర్తించే సరికి అతడి పరిస్థితి విషమంగా మారింది. శ్వాస తీసుకోవడం చాలా ఇబ్బందిగా మారింది. దీంతో వెంటనే స్థానికంగా ఉన్న ఓ ఆస్పత్రిలో చికిత్స కోసం జాయిన్ చేశారు అతడి కుటుంబ సభ్యులు. అయితే అక్కడ పల్స్ రేట్ పడిపోవడంతో వేరే ఆస్పత్రికి తరలించాలని వైద్యులు సూచించారు. దీంతో మరో ఆస్పత్రికి వెళ్తే అక్కడ బెడ్లు లేవన్నారు. తరువాత గుంటూరు నరసరావు పేటలో ఉన్న చాలా ఆస్పత్రుల చుట్టూ రోగితో పాటు బంధువులు ప్రదక్షిణలు చేసినా ఫలితం లేకపోయింది. అయ్యా నన్ను బతికించండి అని ఆ రోగి గగ్గోలు పెడుతున్నా పట్టించుకునే వారు లేకుండా పోయారు. అందుకు కారణం ఎక్కడికి వెళ్లినా ఆక్సిజన్ బెడ్ లు లేకపోవడంతో ఎవరూ జాయిన్ చేసుకోవడం లేదు. దీంతో ఏం చేయాలో తెలియక ఇంట్లోనే ప్రాణాపాయ స్థితిలో రోధిస్తున్నాడు.

  గుంటూరులోనే కాదు చాలా చోట్ల ఇదే పరిస్థితి. తాజాగా విజయనగరంలోని మహారాజ ప్రభుత్వ ఆస్పత్రిలోనూ ఆక్సిజన్ అందక తమవారు మరణించారని బంధువులు ఆరోపిస్తుంటే.. అధికారులు మాత్రం ఆక్సిజన్ సరఫరాలో ఎలాంటి సమస్య లేదని చెబుతున్నారు. అయినా రాష్ట్ర వ్యాప్తంగా ఆక్సిజన్ కొరతపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీడీపీ సహా విపక్షాలన్నీ ప్రభుత్వం తీరును తప్పుపడుతున్నాయి. మరోవైపు ఆరోపణల సంగతి ఎలా ఉన్నో రోజు రోజుకూ ఏపీలో మరణాల సంఖ్య పెరుగుతోంది. దీంతో రాష్ట్రంలోని ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ ఆడిట్‌ను ఏపీ ప్రభుత్వం ప్రారంభించింది. ఆస్పత్రుల వారీగా సరఫరా అయ్యే ఆక్సిజన్‌ లెక్కలు తీయాలని నిర్ణయించింది. రోజువారీ వినియోగం, ఆక్సిజన్‌ పడకలపై ప్రభుత్వం ఆరా తీస్తోంది.

  ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఒక్కో ఆస్పత్రిలో ఎన్ని ట్యాంకుల ఆక్సిజన్‌ వాడారనే దానిపై ఆడిటింగ్‌కు చేపడుతోంది. రోజువారీ అవసరాలకు 330 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ కావాలని.. అయితే ప్రస్తుతం దాదాపు 290 మెట్రిక్‌ టన్నులే ఉందని వైద్యఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం విశాఖతో పాటు భువనేశ్వర్‌, బళ్లారి నుంచి ఆక్సిజన్‌ సరఫరా అవుతోంది. వచ్చిన ఆక్సిజన్‌ను త్వరతగతిన ఆస్పత్రులకు పంపాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలోని 42 ఫిల్లింగ్ స్టేషన్ల నుంచి ఆస్పత్రులకు సరఫరా చేయాలని నిర్ణయించారు. అత్యవసరం అనుకున్నవారికి, ఆక్సిజన్‌ స్థాయి 94 కంటే తక్కువ ఉన్నవారికి మాత్రమే సరఫరా చేయాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఆక్సిజన్‌ సరఫరా సమన్వయ బాధ్యతలను ప్రత్యేకాధికారిగా నియమితులైన ఐఏఎస్‌ అధికారి షన్మోహన్‌కు అప్పగించింది ప్రభుత్వం.
  Published by:Nagesh Paina
  First published: