Murali Krishna, News18, Kurnool
శ్రీశైలం (Srisailam) లో 4వ రోజు ఉగాది (Ugadi) బ్రహ్మోత్సవాల సందర్బంగా రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. తొలుత స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఉత్సవాన్ని ప్రారంభించారు. రథయాత్రలో ఆలయ ఈవో లవన్న దంపతులు, జగద్గురు పీఠాధిపతి చెన్నసిద్దరమ శివచర్య స్వామి, ఆలయ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్, సభ్యులు పాల్గొన్నారు. రథోత్సవంలో వేలాది మంది భక్తులు పాల్గొన్న మల్లన్న వైభవాన్ని వీక్షించి తరించారు. వేలాది మంది కన్నడ భక్తులు హరహర మహాదేవ శంభోశంకర అంటూ శివనామ స్మరణతో శ్రీశైల పురవీధులు మారుమ్రోగాయి.
రథోత్సవాలకు ముందు శ్రీ భ్రమరాంబా మల్లికార్జునస్వామి అమ్మవారి ఉత్సవ మూర్తులకు ఆలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించారు. అనంతరం పల్లకిలో వైభవంగా గంగాధర మండపం వద్ద ఉన్న రథశాల వద్దకు తరలిరాగా ఉత్సవమూర్తులకు అర్చకులు వేదపండితులు ప్రత్యేక హారతులిచ్చారు. అనంతరం స్వామిఅమ్మవార్లు రధోత్సవానికి సిద్ధమయ్యారు అశేష జనవాహిని మద్య రథోత్సవం కధలగానే వేలాదిమంది కన్నడ భక్తులు ఓం నమః శివాయ నినాదించటంతో శ్రీశైల క్షేత్రం పులకించి పోయింది.
అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం అరటిపండ్లను రథం పైకి విసిరి భక్తులు కరతాళ ధ్వనులతో సంబరాలు చేశారు. ప్రతి ఏటా ఉగాదికి జరిగే రథోత్సవంలో భారీ సంఖ్యలో భక్తులు వస్తారు. భక్తుల రద్దీకి తగ్గట్లుగా అధికారులు ఏర్పాట్లు చేశారు. రథోత్సవంతో పాటు స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. దీంతో దర్శనానికి గంటలకొద్దీ సమయం పట్టింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Kurnool, Local News, Srisailam