Murali Krishna, News18, Kurnool
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఎన్నో చారిత్రక కట్టడాలున్నాయి. దాదాపు అన్నీ టూరిజం స్పాట్లుగా డెవలప్ అయ్యాయి. పర్యాటకులను ఆకర్షిస్తూ ఆయా ప్రాంతాలకు ల్యాండ్ మార్క్ లా నిలిచాయి. అలాంటి వాటిలో ముఖ్యమైనది కర్నూలు (Kurnool) కొండారెడ్డి బురుజు. పర్యాటక ప్రాంతంగా, షూటింగ్ స్పాట్ గా మారింది. ఎన్నో సినిమాల విజయాలకు కేరాఫ్‌గా నిలుస్తోంది కొండారెడ్డి బురుజు. ఇక్కడ నందమూరి హరికృష్ణ నటించిన సీతయ్య, మహేష్ బాబు నటించిన ఒక్కడు, సరిలేరు నీకెవరు,గ్గుబాటి రాణా నటించినటువంటి నేనే రాజు నేనే మంత్రి వంటి గొప్ప గొప్ప సినిమాలు చిత్రికరించారు. అప్పటి హీరోల నుంచి నేటి తరం హీరోల వరకు ఇక్కడ సినిమాలు తీస్తే మంచిహిట్ అవుతాయని నమ్మకం.
ఆ పేరు ఎలా వచ్చిందంటే..!
ఆ కోట వెనక ఉన్న రహస్యం తెలియాలంటే చరిత్ర తెలుసుకోవాల్సిందే. విజయనగర ప్రభువైన వీరనరసింహుడు రామరాజును మెచ్చుకొని కందనవోలు కోటను అతనికి బహుమానంగా ఇచ్చాడు. అతడే కర్నూలు కోటను పటిష్ఠం చేసి, కొండారెడ్డి బురుజును నిర్మించి ఉండవచ్చునని కొందరి అభిప్రాయం. కానీ అనేక మంది చరిత్రకారులు ఏమి చెబుతున్నారంటే కర్నూలులో 1529-49 మధ్య శ్రీకృష్ణదేవరాయలు కొండారెడ్ది బురుజును విజయనగర సామ్రాజ్య కాలంలో నిర్మించారని ఒక ప్రతీతి.
కర్నూలు దగ్గరలో ఉన్నటువంటి జగన్నాథగట్టునుండి రాళ్లతో నిర్మించారు. ఇసుక, సున్నం, బెల్లం కలిపిన మిశ్రమంతో అతికిస్తూ నిర్మించినట్లు చారిత్రక ఆనవాళ్ళు కనపడితున్నాయి. ఈ కొండారెడ్డి బురుజు మొత్తం నాలుగు భాగాలుగా ఉంది. క్రింది భాగంలో తూర్పువైపు కాపలాదారు ఉండటానికి ఒక చిన్న గది, ఆగ్నేయంవైపు మొదటి అంతస్తుకు చేరుకోవడానికి వీలుగా విశాలమైన మెట్లు ఉన్నాయి. మధ్య భాగంలో నాలుగు స్తంభాలు ఈ బురుజుకు సపోర్టుగా ఉన్నాయి.
వీటిని నవాబుల కాలంలో బురుజు పడిపోకుండా నిర్మించినట్లు చెబుతారు. మొదటి అంతస్తులో కుడి, ఎడమలవైపు గుంపుగా కాకుండా ఒక్కొక్కరు చొప్పున వరుసగా ఎక్కడానికి ఇరుకైన మెట్లు కొంచెం నిట్ట నిలువుగా ఉన్నాయి. అంటే శత్రువులెవరైనా దాడి చేసినపుడు ఒక్కసారిగా పైకి రాకుండా ఇవి అడ్డు పడతాయి. ఆ పై భాగంలో సైనికులు ఉండటానికి ఐదు పెద్ద పెద్ద గదులు, ఖైదీలను బంధించడానికి రెండు చిన్న గదులు ఉన్నాయి.
అదే విధంగా మధ్యలో అవసరం పడినపుడు తప్పించుకొవడానికి వీలుగా ఒక సొరంగ మార్గం కూడా ఉంది. ఈ సొరంగ మార్గం అలంపూర్ వరకు ఉందని ఇక్కడి ప్రజల అభిప్రాయం. తుంగభద్రానది క్రింద నుండి సొరంగ మార్గం నిర్మిచడం అప్పట్లో అసాధారణమైనది. కాబట్టి ఈ సొరంగ మార్గం కోట బయట తుంగభద్రానది ఒడ్డువరకు గానీ, ఎస్.పి. కార్యాలయం వరకు గానీ ఉండి ఉండవచ్చని అంచనా. ఇందులో పడమరవైపు సైనికుల కోసం నిర్మిచిన ఏడు గదులున్నాయి. వాటికి ఎదురుగా శత్రువులను ఎదుర్కోవడానికి వీలుగా చిన్న చిన్న రంధ్రాలు గల మనిషి పట్టేంత నిర్మాణాలున్నాయి. ఈ రంధ్రాల ద్వారా సైనికులు అవతల వారికి కనబడకుండా తమని తాము రక్షించుకుంటూ, కోటపైకి వచ్చినటువంటి శత్రువులపై దాడి చేయడానికి వీలవుతుంది. ఇక్కడి నుండి తుపాకుల ద్వారా క్రిందివారిని కాల్చవచ్చు.
ఇది చదవండి: కోస్తాకు సీమకు మధ్య స్వీట్ ఫైట్.. పూతరేకులకు పోటీ.. కాజాకు కాంపిటీషన్
మూడవ అంతస్తులో ఇటుకలతో నిర్మించిన 7 సైనిక గదులు వాటి ముందు విశాలమైన స్థలం ఉన్నాయి. స్థలం మధ్యలో 168 ఎత్తు గల పొడవైన స్తూపం ఉంది. ఇది బ్రిటిష్ వారి కాలంలో వారి జెండా ఎగరవేయటం కోసం నిర్మిచినట్లు తెలుస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Kurnool