Murali Krishna, News18, Kurnool
AP Floods: తుంగభద్ర నది క్షణక్షణానికి ఉప్పొంగుతోంది. క్రమక్రమంగా ప్రవాహం పెరుగుతోంది..జిల్లా యంత్రాంగం అంతా అలర్ట్‌గా ఉంది. ఈ నేపథ్యంలో గూడూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని సుంకేసుల బ్యారేజ్ ను కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ సిద్ధార్థ్ కౌశల్ పరిశీలించారు. తుంగభద్ర నది తీర ప్రాంతాన్ని సందర్శించారు. తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నీటి ప్రవాహం పెరగడంతో అధికారులందరూ సమన్వయంతో విధులు నిర్వహించాలని ఆదేశించారు. ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎదుర్కునేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. విపత్కర పరిస్థితిలో ప్రతి ఒక్క సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
సుంకేసుల బ్యారేజ్ సామర్థ్యం.. ప్రస్తుతానికి ఎన్ని టీఎంసీలు నిల్వ ఉంది.. ఎన్ని క్యూసెక్కుల నీటిని కెనాల్‌కు విడుదల చేశారనే విషయాలను అక్కడి అధికారులను అడిగి తెలుసుకున్నారు. జిల్లా ఎస్పీతో పాటు స్పెషల్ బ్రాంచ్ సిఐ ప్రసాద్, కోడుమూరు సిఐ శ్రీధర్, సి.బెళగల్ ఎస్సై శివాంజల్ కూడా ఉన్నారు.
శుక్రవారం రాత్రికి తుంగభద్రానదిలో 1,41,815 క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోంది. మంత్రాలయం వద్ద స్నాన ఘాట్లు అయితే పూర్తిగా మునిగిపోయాయి. మంత్రాలయం వద్ద భక్తులను స్నానాలకు వెళ్లనీయకుండా బారికేడ్లు పెట్టారు. ప్రజలు అటువైపు వెళ్లకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటుచేశారు. ఇంకాస్త వరద ఎక్కువైతే అక్కడే ఉన్న గంగమ్మ ఆలయం నీటమునిగే అవకాశం ఉంది. ఇప్పటికే ఆ గంగమ్మ ఆలయం చుట్టూ నీరు చేరింది.
ఇదీ చదవండి : భక్తులకు శుభవార్త.. ఆగస్టు 5న తిరుచానూరులో వరలక్ష్మీ వ్రతం.. టికెట్ ధర ఎంతంటే..?
మాధవరం ఎత్తిపోతల పథకాలకు వరద నీరు చేరుతోంది. మాధవరం వంతెన, రైల్వే వంతెన వద్ద నది ఉద్ధృతంగా ప్రహిస్తోంది. రాంపురం, కాచాపురం గ్రామాల్లో స్నాన వాటికలు నీట మునిగాయి. పలు ప్రాంతాల్లో వ్యవసాయ విద్యుత్తు మోటార్లు కూడా నీట మునిగిపోయాయి.
ఇదీ చదవండి : పార్టీలో ఆయనది పెద్ద పొజిషన్.. సీనియర్ నేత కూడా.. ఆ నియోజకవర్గంలోనే అసమ్మతి గోలా..?
తీరప్రాంతాల్లో ఉద్ధృతంగా..!
కౌతాళం మండలంలోని నదీతీర గ్రామాలైన కుంబళనూరు, మరళి, మేళిగనూరు, నదిచాగి, వల్లూరు, గుడికంబాలి గ్రామాల వద్ద తుంగభద్ర నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. తుంగభద్ర నదికి జలాశయం నీరేకాకుండా…ఎగువన కర్ణాటకలో కురిసిన వర్షాల వల్ల వాగులు, వంకల నుంచి సైతం నీరు వచ్చి చేరుతోంది. దీంతో పలు ప్రాంతాల్లో వ్యవసాయ విద్యుత్ మోటార్లు నీట మునిగాయి. ఆ నీటిలో నుంచి మోటార్లను గట్టుకు తరలించేందుకు రైతులు నానాతిప్పలు పడ్డారు. కొంతమంది ప్రవాహం ఎక్కువగా ఉండటంతో వెనక్కి వచ్చేశారు.
ఇదీ చదవండి : ఆ నియోజకవర్గమే పవన్ కు సేఫ్ ప్లేసా..? జనసైనికుల సర్వే ఏం చెబుతోంది?
గుడికంబాలి ఇసుక రేవు వరద నీటిలో పూర్తిగా మునిగిపోయింది. మూడు రోజుల నుంచి ఇసుక తవ్వకాలు, తరలింపు ప్రక్రియ పూర్తిగా రద్దయింది. తుంగభద్రా నది క్షణాక్షణాన ఉప్పొంగుతుండటంతో జిల్లా యంత్రాంగం అంతా 24 గంటలు అలర్ట్‌గా ఉండాలని ఎస్పీ సిద్ధార్ధ్ కౌశల్ సూచించారు. తీర ప్రాంతాలను ఎప్పటికప్పుడు అధికారులకు క్షుణ్ణంగా పరిశీలించాలని తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP Floods, AP News, Kurnool, Local News