Tiger Cubs: సాధారణంగా పులి (Tiger) ని చూసినా.. పులి పిల్లను చూసినా ప్రజలు భయపడతారు. కానీ ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఓ నాలుగు పులి పిల్లలను చూసి.. జనాలు ఎంత ముందుగా ఉన్నయో అని వాటిని దగ్గరుండి చూస్తున్నారు.. అయ్యో పాపం అని శోచిస్తున్నారు. ఎందుకంటే ఆ నాలుగు పులి పిల్లలు ఎక్కడ పుట్టాయో తెలీదు.. తల్లి ఎక్కడుందో జాడ లేదు.. నంద్యాల జిల్లా (Nandyala District) కొత్తపల్లి మండలం పెద్ద గుమ్మాడాపురం దగ్గర ఈ పులి పిల్లలను స్థానికులు గుర్తించారు. వెంటనే అటవీ శాఖ అధికారులకు, స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వాటిని ఆత్మకూరుకు తరలించారు. మొదట ఆత్మకూరు డిఎఫ్ఓ ఆఫీసు (DFO Officer) లో పులి పిల్లలకు షెల్టర్ ఇచ్చి .. వాటి బాగోగోలు చూసుకుంటున్నారు అటవీ సిబ్బంది. ఆ అధికారుల సంరక్షణలో పులి పిల్లలు సేదతీరుతున్నాయి. వాటి తల్లి అయిన పెద్ద పులి దగ్గరకు వాటిని చేర్చేందుకు ప్రయత్నిస్తున్నారు అటవీ సిబ్బంది.
ప్రస్తుతం పెద్ద పులి జాడ తెలుసుకునేందుకు పెద్ద గుమ్మడాపురం లో సుమారు 40 ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు.. అయినా ఇంకాఆ పులి జాడ కనుక్కోలేదు. తల్లికి దూరంగా ఉన్న పులిపిల్లలకు ఆహారం అందిస్తున్నారు అటవీ సిబ్బంది. పెద్ద పులి జాడ దొరకని పక్షంలో 4 పిల్లలను తిరుపతి జూకు తరలించే యోచనలో అటవీ అధికారులు ఉన్నట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం ఆత్మకూరు కు తిరుపతి వన్య ప్రాణి సంరక్షణ ప్రత్యేక బృందం రానుంది. ఈ పులికూనల వయసు 40 రోజులు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం నంద్యాల ప్రాంతంలో ఎండ తీవ్రత పెరుగుతుండటంతో చల్లని ప్రదేశంలో ఉంచేందుకు ఆత్మకూరు మండలంలోని బైర్లూటి పశు వైద్యశాలకు పులి పిల్లల్ని తరలించారు. పులి పిల్లలకు పాలు, ఓఆర్‌ఎస్ నీళ్లు పట్టిస్తున్నారు. అవి ఆరోగ్యంగా ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.
తల్లిపులి తన పిల్లలతో కలిసి ఆదివారం రాత్రి ఈ ప్రదేశానికి వచ్చి ఉంటుందన్నారు. కుక్కల అరుపులు, జనాల శబ్దాలు విని భయపడి తల్లి, పిల్లలు వేరై ఉంటాయని అనుమానిస్తున్నారు. పులి పిల్లలను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో జనం తరలివచ్చారు. సెల్ఫీలు కూడా దిగారు. ఈ పులి కూనలను వదిలి తల్లిపులి ఉండలేదని, దానికి ఏదైనా అపాయం జరిగిందేమో అని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఏ క్షణంలోనైనా తల్లి పులి వస్తుందేమోనని స్థానికులు భయపడుతున్నారు. పిల్లలు కనిపించకపోవడంతో ఆ పెద్దపులి మరింత ఆవేశంతో ఉంటుందని.. అది పిల్లను వెతుక్కుంటూ గ్రామం వైపు వస్తే పరిస్థితి ఏంటని భయపడుతున్నారు. అధికారులు వెంటనే ఆ పెద్ద పులిని గుర్తించి.. అదుపులోకి తీసుకోవాలని.. పిల్లలను కూడా అప్పచెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Kurnool, Tiger