ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) విద్యాశాఖ (Education Department)లో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాడు-నేడు పనుల నాణ్యత చర్యనీయాంశమవుతోంది. పాఠశాలలు ప్రారంభమైన తర్వాత నాసిరకం పనులు విద్యార్థుల ప్రాణాలమీదకు తెస్తున్నాయి. కోట్ల రూపాయలు ఖర్చు చేసి కొత్త భవనాలు, డెస్కులు, టాయిలెట్స్ నిర్మించి, కొత్త డెస్కులు ఏర్పాటు చేసి ప్రభుత్వ బడుల రూపరేఖలను కార్పొరేట్ స్కూళ్ల మాదిరిగా మార్చినా పనుల్లో అక్కడక్కడా పనుల్లో డొల్లతనం బయటపడుతోంది. కర్నూలు జిల్లా సి.బెళగల్ మండలం బురాన్ దొడ్డి ప్రాధమిక పాఠశాలలో కలకలం రేగింది. క్లాస్ రూమ్ లో పాఠాలు వింటున్న 5వ తరగతి విద్యార్థులపై స్లాబ్ పెచ్చులూడి పడటంతో నలుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో మహీధర్ అనే విద్యార్థికి తలపగిలింది. రక్తస్రావం కావడంతో అతడ్ని తరలించారు. విద్యార్ధి మహీధర్ తలకు ఐదుకుట్లు పడ్డాయి.
కాగా ఇటీవలే స్కూల్లో నాడు-నేడు పనులు చేపట్టారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో నాసిరకం పనలు చేయడంతో పెచ్చులూడిపడినట్లు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థులు తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకోవడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై విద్యాశాఖ అధికారులు ఇంతవరకు స్పందించలేదు.
ఇటీవల ప్రకాశం జిల్లా మార్కాపురంలోనూ ఇదే తరహాలో ప్రమాదం జరిగి ఓ విద్యార్ధి నిండుప్రాణం బలైంది. మార్కాపురం మండలం రాజుపాలెంలో గత నెల 29వ తేదీన స్కూలుకు సెలవు దినం కావడంతో ప్రభుత్వ పాఠశాల గ్రౌండ్ లో గ్రామానికి చెందిన పిల్లలు ఆడుకుంటున్నారు. విష్ణు అనే 7వ తరగతి విద్యార్థి క్లాస్ రూమ్ కు వెళ్లి ఒక్కడే కూర్చున్నాడు. అదే సమయంలో పైకప్పు కూలింది. దీంతో విష్ణు తీవ్రంగా గాయపడ్డాడు. పెద్దలు వచ్చి గమనించేలోపు మృతి చెందాడు. సమాచారమందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా మృతుడు విష్ణు ఓ ప్రైవేట్ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాడు. విద్యాశాఖ మంత్రి సొంత జిల్లాలో ఇలా జరగడంపై విమర్శలు వస్తున్నాయి.
ఇదిలా ఉంటే వారం రోజుల వ్యవధిలో రెండుచోట్ల స్కూళ్ల పైకప్పు పెచ్చులూడిపడటంతో నాడునేడు పనులపై విమర్శలు వెల్లివెత్తుతున్నాయి. వేల కోట్ల రూపాయలతో చేపట్టిన పనుల్లో డొల్లతనం బయటపడటంపై ప్రజలు మండిపడుతున్నారు. ఇటీవలే సీఎం జగన్ తొలి విడత నాడు-నేడు పనులను జాతికి అంకితం చేసి విద్యాసంవత్సరాన్ని ప్రారంభించారు. అసలే కరోనాతో విద్యార్థులను స్కూల్ కు పంపేందుకు తల్లిదండ్రులు భయపడుతుంటే.. ఇలాంటి ప్రమాదాలు వారిని మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి.
కొన్ని స్కూళ్లలో క్లాసులు ప్రారంభమైనా నాడు-నేడు పనులు కొనసాగుతూనే ఉన్నాయి. నిర్మాణాలు కొత్తవికావడం, నిర్మాణ సామాగ్రి కూడా ప్రాంగణాల్లో ఉండటంతో ఎప్పుడు ఏం జరుగుతుందనే ఆందోళన విద్యార్థులతో పాటు ఉపాధ్యాయుల్లోనూ ఉంది. మరీ ఇలాంటి నాసికరమైన పనులపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP Schools, Kurnool