Murali Krishna, News18, Kurnool
రైతులు వ్యవసాయం చేసేది మేడలు, కార్లు కొనేయాలని కాదు.. కాస్త కడుపు నింపుకునేందుకు. పిల్లల కోసం నాలుగు రాళ్లు కూడబెట్టుకునేందుకు. ఎంత కష్టపడి పంట పండించినా గిట్టుబాటు ధర రాకుంటే చెమట చుక్కకు విలువ ఉండదు. అలా కష్టపడినా ఫలితం రాకపోతే రైతులు రోడ్డున పడాతారు. కరువు ప్రాంతమైన రాయలసీమలో ఉమ్మడి కర్నూలు జిల్లా (Kurnool District) రైతులు భారీస్థాయిలో ఉల్లి సాగు (Onion Cultivation) చేస్తుంటారు. దాదాపుగా 30% వరకు రైతులు ఇక్కడ ఉల్లి పంట సాగు చేస్తూ వస్తున్నారు. అయితే, ఒక్కో ఏడాది ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఉల్లిపండించిన రైతులకు చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. అప్పుచేసి మరీ ఉల్లి పంటను సాగు చేస్తే కనీసం పెట్టిన పెట్టుబడి కూడా రాకపోవడంతో ఉల్లి రైతులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు.
ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేసి ఉల్లికి గిట్టుబాటు ధర కల్పించ లేకపోతే తమ కుటుంబాలు రోడ్డున పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలంలో ఓ రైతు తనకు ఉన్న ఐదెకరాల పొలంలో రూ.3.80 లక్లషలు పెట్టుబడి పెట్టి ఉల్లి పంటను సాగు చేశాడు. కానీ ఆరుకాలం శ్రమించి కష్టపడి పండించిన పంటకు మార్కెట్లో గిట్టుబాటు ధర రాలేదు. దీంతో పంటను పశువులకు మేతగా వదిలేశాడు. కనీసం పండించిన పంటను కోత కోసి మార్కెట్ కు తీసుకువెళ్లే రవాణా ఖర్చులు కూడా రావడం లేదంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు. దీంతో కొన్ని రైతు సంఘాలు ప్రభుత్వానికి తమ గోడు వినిపించుకునే విధంగా కొన్ని వినూత్న కార్యక్రమాలు చేపట్టాయి.
గిట్టుబాటి ధరపై ప్రభుత్వాలు స్పందించకపోవడంతో ఒళ్లు మండిన రైతులు ఏకంగా కేంద్ర ప్రభుత్వానికే చెప్పాలని నిర్ణయించుకున్నారు. అంతే ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఉల్లిపాయలను పార్శిల్ చేశారు. అంతేకాదు గిట్టుబాటు ధర లేక తాము తీవ్రంగా నష్టపోతన్నామని.. కనీస మద్దతు ధరను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం ఆదుకోకుంటే తమకు ఆత్మహత్యలే శరణ్యమని ప్రధానికి రాసిన లేఖలో రైతులు వాపోయారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Kurnool, Local News, Onion price