GT Hemanth Kumar, Tirupati Correspondent, News18
అందరికి అన్నం పెట్టె రైతన్నకు పట్టెడు అన్నం దొరకక తీవ్ర ఇబ్బందులకు గురి అవుతుంటారు. ఓ వైపు అప్పుల బాధ. మరోవైపు పండిన పంటకు సరైన దిగుబడి రాక ఆత్మహత్యలకు పాలోడుతున్నాడు రైతు. ఇలాంటి సంఘటనలు నిత్యం మనం వింటున్నాం.., చూస్తున్నాం కూడా. రైతును చూసి అయ్యో అనే వారు ఉండరేమో. అలంటి పరిస్థితుల్లో రైతు ఒక్కరోజులో కోటీశ్వరుడు అయితే ఔరా అనక ఉండలేము. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరి ప్రాంతంకు చెందిన రైతు పంట పండింది. ఏకంగా మూడు కోట్లు విలువ చేసే వజ్రం సాగు భూమిలో లభ్యం అయింది. రహస్యంగా వ్యాపారి వద్దకు తీసుకెళ్లడంతో 30 క్యారెట్ల వజ్రమని తేలడంతో రైతుతో బేరసారాలు ఆడి కోటి 20 లక్షల రూపాయలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. మార్కెట్లో దీని ధర రూ.2 నుంచి రూ.3కోట్ల వరకు ఉంటుందన్న ప్రచారం జరుగుతోంది.
వర్షం పడితే వజ్రాలే..
వర్షాలు పడ్డాయి అంటే చాలు.. ఆ భూమిలో పండేది వరి,ఇతర ఆహార ధాన్యాలు పండుతాయి. కానీ ఇక్కడి మట్టిలోని వజ్రాలు పండుతాయి. చినుకు చినుకు పడే కొద్దీ మట్టి పొరల్లో దాగిన ఎంతో విలువైన వజ్రాలు వర్షం పడ్డప్పుడు మట్టి పొరల నుండి బయట పడతాయి. వజ్రాలను వెతకటానికి వేరే జిల్లా నుండే కాక వేరే రాష్ట్రాల నుండి కూడా పెద్దఎత్తున జనాలు ఇక్కడికి వస్తుంటారు. జొన్నగిరి చుట్టుపక్క గ్రామాల రైతులు వాళ్ల అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ఉదయం నుండి వజ్రాల వేట కొనసాగిస్తారు. దొరికిన వారు లక్షాధికారి అవుతారు. దొరకని వారు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వెతుకుతూనే ఉంటారు.
ఇలా తన పొలంలో వెతుకుతున్న రైతుకు కోట్ల విలువ చేసే విజ్రం దొరికింది. పొలంలో మిలమిలా మెరుస్తున్న రాయి తనని బాగా ఆకర్షించింది. వజ్రంగా భావించి వెనువెంటనే ఇంటికి తీసుకువచ్చాడు. స్థానిక వ్యాపారికి చూపించగా స్థానికంగా వజ్రాల వ్యాపారి పార్థు ఆ వజ్రాన్ని పరీక్షించాడు. 30 క్యారెట్ల వజ్రం కావడంతో వెంటనే బేరం మాట్లాడేశాడు. ఆ వజ్రానికి రూపాయి కోటి 20 లక్షలు ఇస్తానని టక్కున చెప్పేసాడు.. 30 క్యారెట్ల బరువున్న ఈ వజ్రం మార్కెట్ ధర రూ.3 కోట్ల వరకు ఉంటుందని ఈ విషయం బయటకు పొక్కిన తర్వాత ఇతర వ్యాపారులు చెబుతున్నారు. అంత సొమ్ము ఒక్కసారి చూసిన అన్నదాత దక్కిందే అదృష్టంగా భావించి ఇతరులకు తెలియజేయలేదని, వ్యాపారి సైతం గుట్టుగా ఉంచే ప్రయత్నం చేసారు. చివరకు ఆ నోటా ఈ నోటా పడి బయటపడ్డ విలువైన వజ్రం విషయం ఇప్పుడు వైరల్ గా మారింది.
సాధారణంగా ఈ ప్రాంతంలో వజ్రాలు దొరికితే స్థానిక వ్యాపారు లందరికీ సమాచారమిచ్చి వేలం పాటలో అమ్ముతారు. కాని తొలకరికి ముందే, అదీ.. ఇంత విలువైన వజ్రం దొరకడం మొదటిసారని స్థానికులు చెబుతున్నారు. కోట్లు విలువ చేసే విలువైన వజ్రాల ను అక్కడి వ్యాపారస్తులు తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు ఇంత భారీ మొత్తంలో వజ్రాలు దొరికిన అక్కడి రెవెన్యూ అధికారులు దరిదాపులకి కూడా వెళ్లరు
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.