Murali Krishna, News18, Kurnool
పోలీసులంటే ప్రజల ఆస్తులకు రక్షణగా ఉండాలి. అలాగే రికవరీ సొత్తుపై అంతే బాధ్యతగా వ్యవహరించాలి. రూల్స్ కి విరుద్ధంగా తరలిస్తున్న బంగారాన్ని సీజ్ చేసిన పోలీసులు.. దానిని స్టేషన్లో ఉంచి మహిళా కానిస్టేబుల్ కు బాధ్యత అప్పగించారు. ఎంత పోలీస్ అయినా.. మహిళే కదా..! బంగారంపై ఆమె కన్నుపడింది. తర్వాత సీన్ మీకు అర్థమయ్యే ఉంటుంది. వివరాల్లోకి వెళ్తే.. కర్నూలు రూరల్ తాలూకా పోలీస్ స్టేషన్లో ఇటీవల 75 లక్షల విలువచేసే బంగారం చోరీకి గురైంది. సంచలనం సృష్టించిన కేసులో విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. బంగారం మాయం చేసింది మరెవరో కాదు.. మహిళా కానిస్టేబులే. 2021 జనవరి 28 రాత్రి కర్నూలు మండలం పంచలింగాల చెక్ పోస్టు వద్ద పోలీసులు భారీగా బంగారం స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్ నుంచి వస్తున్న తమిళనాడు రిజిస్ట్రేషన్ కారును ఆపి తనిఖీ చేయగా శాతనభారతి, మణికందన్ (తమిళనాడు) అనే ఇద్దరు వ్యాపారుల వద్ద 105 కిలోల వెండి ఆభరణాలు, రూ.2.05 లక్షల నగదును గుర్తించారు. వీటికి ఎలాంటి ఆధారపత్రాలు లేకపోవటంతో తనిఖీ అధికారులు సొత్తును సీజ్ చేసి అప్పటి కర్నూలు తాలుకా అర్బన్ పోలీసుస్టేషన్ సీఐ విక్రమ్ సింహాకు అప్పగించారు. వాణిజ్య పన్నుల శాఖకు గాని ఆదాయపన్నులశాఖకు అప్పగించలేదు.
పోలీసుఅధికారులు సదరు సొత్తును పోలీసుస్టేషన్‌లోని బీరువాలో ఉంచారు. వాటిని పర్యావేక్షకురాలిగా ఓ మహిళా కానిస్టేబుల్ ను నియమించారు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్లో సీఐలు బదిలీ కావడంతో సొత్తు గురించి ఎవరూ పట్టించుకోలేదు. ఇదిలా ఉంటే బంగారం తరలిస్తున్న వ్యాపారం.. కోర్టు ఆదేశాలతో సొత్తును తిరిగి తీసుకెళ్లేందుకు పోలీస్ స్టేషన్ కి వచ్చాడు. ఐతే అందులో రూ.75లక్షలు విలువ చేసే సొత్తు కనిపించలేదు. దీంతో పోలీసులు స్పెషల్ టీమ్ తో దర్యాప్తు చేపట్టారు. అది ఇంటి దొంగల పనే అనే అనుమానంతో గత మూడేళ్లలో ఇక్కడ పనిచేసిన వారినందరినీ విచారించారు.
ప్రతి ఒక్కరిని పిలిచి మాట్లాడిన పోలీసులు.. వారిలో కొందరిని మధ్యాహ్నం లంచ్ కు పంపగా.. అమరావతి అనే మహిళా కానిస్టేబుల్ మాత్రం ఎంతకీ తిరుగిరాలేదు. ఆమె ఫోన్ కూడా స్విఛ్ ఆఫ్ రావడంతో వారి అనుమానమే నిజమైంది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు కానిస్టేబుల్ అమరావతితో పాటు ఆమె భర్త.. గతంలో ఇదే పీఎస్ లో పనిచేసిన రైటర్ మరో వ్యక్తి పరారైనట్లు తేల్చారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Kurnool, Local News