తెలుగు రాష్ట్రాల్లో ప్రేమికులపై వరుస దాడులు జరుగుతునూ ఉన్నాయి. హైదరాబాద్‌లో వేర్వేరు సంఘటనల్లో ఇద్దర్ని రోడ్డుపైనే కిరాతకంగా చంపిన ఘటనలు మరువకముందే తాజాగా ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని కర్నూలు జిల్లా (Kurnool District) లో జరిగిన ఘటన కలకలం రేపింది. ఇష్టం లేని వివాహం చేశారన్న కారణంతో వివాహిత పెళ్లయిన మూడురోజులకే తాను ప్రేమించిన వాడితో పరారైంది. ఇది తట్టుకోలేని యువతి కుటుంబ సభ్యులు ఏకంగా ప్రియుడి ఇంటికే నిప్పు పెట్టారు. వివరాల్లోకి వెళ్తే.. కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం మాధవరానికి చెందిన శ్రీజ, శివాజీ ఒకరంటే ఒకరు ఘాడంగా ప్రేమించుకున్నారు. ఈ విషయం ఇంట్లో తెలియడంతో.. ఆగ్రహించిన యువతి తల్లిదండ్రులు ఆమెకు వెంటనే పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నారు.
విషయం తెలిసిన కొద్ది రోజులకే రచ్చమర్రి గ్రామానికి చెందిన మరో యువకుడితో ఈ నెల 9వ తేదీన పెళ్లి చేశారు. మొదటి మూడు రోజుల పాటు అంతా బాగానే ఉంది. ఆ తర్వాత వివాహిత అందరికీ ట్విస్ట్ ఇస్తూ తాను ప్రేమించిన వాడిని తీసుకుని పరారైంది. పెళ్లయిన మూడు రోజులకే తాను ప్రేమించిన శివాజీకి విషయం చెప్పి.. తనను ఎక్కడికైనా తీసుకుని వెళ్లమని శ్రీజ చెప్పడంతో.. శివాజీ తన ప్రియురాలితో జిల్లా దాటి వెళ్లిపోయాడు. అయితే, విషయం తెలుసుకున్న యువతి తల్లిదండ్రులు, బంధువులు కోపోద్రిక్తులై ఆదివారం రాత్రి శివాజీ ఇంటికి నిప్పుపెట్టారు. అప్పటికే తమ కుమారుడు యువతిని తీసుకెళ్లాడని తెలుసుకున్న తల్లిదండ్రులు ఇంటి నుంచి వెళ్లిపోవడం ప్రమాదం తప్పింది.
ఇంట్లోని దుస్తులు, బియ్యం, ఇతర సామగ్రి పూర్తిగా దగ్ధమయ్యాయి. మంత్రాలయం సీఐ భాస్కర్, మాధవరం ఎస్సై రాజకుళ్లాయప్ప, మంత్రాలయం ఎస్సై వేణుగోపాల్ సిబ్బందితో అక్కడి చేరుకుని మంటలు ఆర్పేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మాధవరం, రచ్చమర్రి గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గ్రామంలో ఏదైనా అలజడులు సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామంటూ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.
గతంలో చిత్తూరు జిల్లాలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. మదనపల్లికి చెందిన యువకుడికి, అనంతపురంకు చెందిన యువతికి పెళ్లి నిశ్చయమైంది. తెల్లవారుజామున ముహూర్తం కావడంతో ముందురోజు రాత్రే రిసెప్షన్ ఏర్పాటు చేశారు. అప్పటివరకు నవ్వుతూ ఫోటోలకు ఫోజిచ్చిన యువతి.. అందరితోనూ బాగానే గడిపింది. ఐతే గదిలోకి వెళ్లి కాసేపు నిద్రపోతానని చెప్పింది. అందరూ పడుకున్నతర్వాత సైలెంట్ గా గోడదూకి ప్రియుడితో పారిపోయింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Kurnool