Murali Krishna, News18, Kurnool
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో కొన్ని రోజులుగా భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తున్నాయి. వానల కారణంగా పలు జిల్లాలో జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ముఖ్యంగా కర్నూలు జిల్లాలో గత వారం రోజులు నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు జలాశయాలు నిండుకుండలా మారాయి. ఈ ఏడాది వర్షాలు అధికంగా కురవడంతో ఎన్నడూ లేని విధంగా అటు తుంగభద్ర ఇటు వక్కెర వాగు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గాజుల దీన్నే జలాశయానికి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు డ్యాం గేట్లను తెరిచి నీటిని దిగువకు విడుదల చేశారు. మరోవైపు భారీ వర్షాలకు తోడు వక్కెర వాగు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో కర్నూలు నగరంలోని పలు కాలనీలు జలమయమయ్యాయి.
వక్కెర వాగుకు వరద నీరు పోటెత్తింది. దీంతో దిగువ ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. కర్నూలు నగరంకు ఎగువనున్న గాజులదీన్న ప్రాజెక్ట్‌కు భారీగా వరద రావడంతో అధికారులు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. నదీ పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా అధికారులు హెచ్చరికలు జారీచేశారు.
ఇక భారీ వరదల కారణంగా కర్నూల్ నగరంలోని కల్లూరు చెన్నమ్మ సర్కిల్, ఆనంద్ థియేటర్, ఓల్డ్ బస్టాండ్ బాబూజీ నగర్, కడక్ పూర్, గని గల్లి, జోరాపురం తదితర ప్రాంతాలు ముంపుకు గురవుతున్నాయి. ఆయా ప్రాంతాలు నదీ పరివాహకంకు ఆనుకుని ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచనలు చేశారు. నగరంలో అనేక ప్రాంతాల్లో రోడ్లపై నీరు మోకాలు లోతు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.
గతంలో 2009లో కర్నూలు నగరానికి వచ్చిన వరదలు తలుచుకుంటూ నగరవాసులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే జిల్లాలో పడుతున్న భారీ వర్షాలకు జిల్లాలో వంకలు వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. కర్నూలు జిల్లాలోని పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ఆయా గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్ళదీస్తున్నారు.
మరో రెండు రోజుల్లో కర్నూలు జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీంతో కర్నూలు జిల్లాలోని ప్రజలు మళ్లీ 2009 అక్టోబర్ నెలలో వచ్చినటువంటి వరదలు మళ్లీ వస్తాయని భయాందోళనకు గురవుతున్నారు. అధికారులు సైతం ఇదివరకులా జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టి ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా చర్యలు చేపట్టారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Heavy Rains, Kurnool, Local News