ఏపీ సీఎం వైఎస్ జగన్ (AP CM YS Jagan) తల్లి వైఎస్ విజయమ్మ (YS Vijayamma) కు తృటిలో ప్రమాదం తప్పింది. కర్నూలు జిల్లా (Kurnool District) లో విజయమ్మ ప్రయాణిస్తున్న వాహనం స్వల్ప ప్రమాదానికి గురైంది. బుధవారం అనంతపురం జిల్లా (Anantapuram District) లో ఓ పెళ్లికి హాజరైన ఆమె తిరిగి హైదరాబాద్ కు వస్తుండగా.. కర్నూలు సమీపంలోని ఆమె కారు టైర్లు పంక్చర్ అయ్యాయి. ఒక్కసారిగా రెండు టైర్లు పేలడంతో వాహనం అదుపుతప్పింది. ఐతే డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి కారును నిలిపేశారు. ఈ ఘటనలో విజయమ్మకు ఎలాంటి గాయాలు కాలేదు.. ఆమె సురక్షితంగానే బయటపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే ఆమె వైఎస్ రాజశేఖర్ రెడ్డి మిత్రుడు.. అయ్యపురెడ్డి ఇంటికి వెళ్లారు. అనంతరం ఆమెను ఏపీఎస్పీ గెస్ట్ హౌస్ కు తరలించారు. కారు టైర్లు మార్చిన వెంటనే ఆమె హైదరాబాద్ బయలుదేరి వెళ్లిపోయారు.
విజయమ్మ కారుకు ప్రమాదం అనగానే వైసీపీ శ్రేణులు ఆందోళన చెందాయి. ఐతే ఆమె క్షేమంగా ఉన్నారని తెలిసి అంతా ఊపిరి పీల్చుకున్నారు. లాంగ్ జర్నీ కావడం, కారు వేగం వల్ల టైర్లు పంక్చర్ అయి ఉండొచ్చని అంతా భావిస్తున్నారు. డ్రైవర్ సకాలంలో స్పందించి చాకచక్యంగా వ్యవహరించడంతో ఆమె క్షేమంగా బయటపడ్డారు. ఈ ఘటనపై సీఎం జగన్ కూడా ఆరా తీసినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే గతంలో వైసీపీ గౌరవాధ్యక్షురాలిగా ఉన్న వైఎస్ విజయమ్మ.. ఆ పార్టీ ప్లీనరీ రోజూ ఆ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. తెలంగాణ (Telangana) లో వైఎస్ షర్మిల (YS Sharmila) పార్టీకి అండగా ఉండేందుకు ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. ఏపీలో జగన్ సీఎం కావడం, వైసీపీ అధికారంలో ఉండటంతో ఇకపై తెలంగాణలో కుమార్తెకు అండగా ఉంటూ.. వైసీపీలో కొనసాగడం సరైంది కాదని భావించిన విజయమ్మ.. పార్టీని వీడుతున్నట్లు నిర్ణయం తీసుకున్నారు.
ప్రస్తుతం హైదరాబాద్ (Hyderabad) లో ఉంటూనే కుమార్తె షర్మిలకు తోడుగా ఉంటున్నారు. అక్కడ వైఎస్ఆర్టీపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని విజయమ్మ తెలిపారు. అంతేకాదు తన పేరుతో లేఖలు విడుదల చేయడం, అసత్యప్రచారాలు చేయడాన్ని తిప్పికొట్టేందుకే వైసీపీని వీడుతున్నట్లు కూడా ఆమె ప్రకటించారు. కొంతకాలంగా హైదరాబాద్ లోనే ఉంటున్న విజయమ్మ.. అప్పుడప్పుడు కుటుంబ కార్యక్రమాలు, ఇతర వేడుకలకు ఏపీకి వస్తున్నారు. వైఎస్ జయంతి, వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయకు వచ్చి నివాళులర్పిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, YS Vijayamma