Andhra Pradesh: వ్యాక్సిన్ పంపిణీ చేయలేం. కేంద్రానికి స్పష్టం చేసిన ఏపీ ప్రభుత్వం

ఏపీలో ప్రస్తుతం 18 ఏళ్లు దాటిన వారికి కరోనా వ్యాక్సిన్ వేయలేం

ఏపీలో వ్యాక్సినేషన్ పరిస్థితి ఏంటి? మే ఫస్ట్ నుంచి 18 ఏళ్లు నిండిన అందరికీ వ్యాక్సిన్ వేయాలి అని ప్రభుత్వం చెబుతోంది. మరి ఏపీలో ఇప్పటికే వ్యాక్సిన్ కేంద్రాల చుట్టు ప్రదక్షిణలు చేస్తున్నా.. అక్కడక్కడా నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. మరి అందరికీ వ్యాక్సిన్ వేయాలంటే ఏం చేయాలి?

 • Share this:
  ఏపీలో ప్రస్తుతం కరోనా సెకెండ్ వేవ్ సునామీలా రెచ్చిపోతోంది. వయసుతో సంబంధం లేకుండా అందరిపై దాడి చేస్తోంది. ఆ వర్గం ఈ వర్గం అని తేడా లేకుండా కాటేస్తోంది. గతంతో పోల్చుకుంటే రెట్టింపు వేగంతో ఏపీలోకి దూసుకొస్తోంది. గత పది రోజులుగా ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. దీంతో కేంద్రం చెబుతున్నట్టు ఆఖరి ఆయుదమైన లాక్ డౌన్ తప్పదా అనే వాదన వినిపిస్తోంది.

  రాష్ట్ర వ్యాప్తంగా గడచిన 24 గంటల్లో 74,435 శాంపిల్స్ ని పరీక్షించగా 11,434 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గుంటూరు జిల్లాలో రికార్డు స్థాయిలో 2,028 కేసులు నమోదవ్వడం ఆందోళన పెంచుతోంది. గుంటూరుతో సహా ఐదు జిల్లాల్లో కేసులు వేయికి పైనే నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో 1,982, నెల్లూరు జిల్లాలో 1,237, శ్రీకాకుళం జిల్లాలో 1,322, విశాఖపట్నం జిల్లాలో 1,067 మంది కరోనా బారిన పడ్డారు. ఈ కేసులు చూస్తే చాలా ఏపీలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చెప్పడానికి. ఇక కరోనా మరణాలు కూడా భయపెడుతున్నాయి. 24 గంటల్లో 64 మంది మృతి చెందారు.  ఇలాంటి సమయంలో కరోనాను కట్టడి చేయాలి అంటే ఏపీ ప్రభుత్వం ముందు ఉన్న మార్గం ఒక్కటే వ్యాక్సినేషన్ ను మరింత వేగవంతం చేయడం..

  ఇదీ చదవండి: మూడు రోజుల్లో లాక్ డౌన్. ఉదయం 10 గంటల వరకు మాత్రమే దుకాణాలు

  ప్రస్తుతం ఏపీలో వ్యాక్సినేషన్ పరిస్థితి చూస్తే ఆందోళన పెంచుతోంది. ప్రభుత్వ ఆస్పత్రులు, సచివాలయాల ద్వారా వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టినట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కానీ అందుకు సరిపడ వ్యాక్సిన్ నిల్వలు మాత్రం కనిపించడం లేదు. ఇటీవల నిల్వలలు లేని కారణంగా చాలాచోట్ల వ్యాక్సినేషన్ కు బ్రేకులు పడ్డాయి. దీనిపై నేరుగా సీఎం జగన్ కేంద్రానికి లేఖ రాశారు కూడా. దానికి స్పందించిన కేంద్రం కేవలం ఆరు లక్షల డోస్ లు మాత్రమే ఏపీకి పంపింది. అయితే ప్రస్తుతం చాలావరకు ఏపీ ప్రభుత్వం సెకెండ్ డోస్ లు మాత్రమే వేస్తోంది. దీంతో ఫస్ట్ డోస్ కోసం అక్కడకు వెళ్లిన వారు ఉసూరమంటు తిరిగి రావాల్సి వస్తోంది. దాదాపు అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి. గతంలో కంటే ఇప్పుడు వ్యాక్సినేషన్ పై అవగాహన పెరగడంతో భారీగా జనాలు టీకాలు వేయించుకోడానికి రెడీగానే ఉన్నారు. కానీ అందుకు సరిపడ స్టాక్ లేకపోవడం ఆందోళన పెంచుతోంది.

  ఇదీ చదవండి: కరోనా ప్రాణాలు తీస్తోంది. భయం చంపేస్తోంది? ఆత్మహత్యలకు కారణం ఏంటో తెలుసా?

  మరోవైపు మే 1వ తేదీ నుంచి 18 ఏళ్లు దాటిన వారికి వ్యాక్సినేషన్ చేయాలని కేంద్రం స్పష్టం చేసింది. అలా అందరికీ ఏపీలో వ్యాక్సిన్ వేయాలి అంటే. ప్రస్తుతం లెక్కల ప్రకారం ఏపీలో 2 కోట్ల 4 లక్షల మంది 18-45 ఏళ్ల వయసున్న వారు ఉన్నారని వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ పేర్కొన్నారు. టీకాల కోసం వివిధ కంపెనీలతో మాట్లాడామని.. ఉత్పత్తిలో సగం కేంద్రానికి ఇవ్వాలి ఆ తర్వాతే రాష్ట్రాలకు ఇవ్వాల్సి ఉంటుందని ఆయా సంస్థల ప్రతినిధులు చెప్పారని.. వాళ్లు చెబుతున్న లెక్కల ప్రకారం జూన్ వరకు రాష్ట్రాలకు టీకాలు సరఫరా చేయలేరని పేర్కొన్నారన్నారు. మరి వ్యాక్సిన్ శాంపిల్స్ రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వకుండా అందరికీ టీకాలు వేయమంటే ఎలా అని ఆయన కేంద్రాన్ని ప్రశ్నించారు.
  Published by:Nagesh Paina
  First published: