Murali Krishna, News18, Kurnool
కర్నూలు జిల్లా (Kurnool District) అధికార పార్టీ నేతలు వరుసగా భూమి వివాదాలలో చిక్కుకుంటున్నారు. ఎమ్మెల్యేల దగ్గరి నుంచి మంత్రుల దాక జిల్లా అధికార పార్టీ నాయకుల ఒక్కొక్కరిగా భూ వివాదాలు చుట్టుపడుతున్నాయి. ఈ మధ్యనే కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం (Minister Gummanuru Jayaram) 180 ఎకరాల భూమిని తన భార్య పేరిట రిజిస్ట్రేషన్ చేసుకున్నారని ఆరోపణలతో ఐటి శాఖ నోటీసులు జారీ చేసింది. అలాగే బుగ్గన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి రాజేంద్రనాథ్ రెడ్డి (Buggana Rajendranath Reddy) నియోజకవర్గమైన డోన్ పట్టణంలో రుద్రాక్షల గట్టు ఒక స్థల వివాదంలో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తాజాగా కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ జలదొడ్డి సుధాకర్ ఓ వివాదస్పద స్థలం పరిష్కరిస్తానంటూ పంచాయితీ చేసిన వైసీపీకి చెందిన ప్రజాప్రతినిధి, ఏకంగా ఆ స్థలాన్నే కొట్టేశాడని.. తమకు తెలియకుండానే విక్రయించి డబ్బులు జేబులో వేసుకున్నాడని బాధితుల ఆరోపిస్తున్నారు.
తగవు తీర్చమని వేడుకుంటే అసలకే మోసం వచ్చిందని బాధితులు బావురమన్నారు. ఇది అన్యాయమని ప్రశ్నిస్తే, బెదిరింపులకు పాల్పడుతున్నట్లు కర్నూలు జిల్లాకు చెందిన బాధితులు వాపోతున్నారు. పోలీసులను, న్యాయస్థానాన్ని ఇప్పటికే ఆశ్రయించామని, తమకు ప్రాణహాని ఉందని బాధితులు వాపోతున్నారు. కర్నూలు పట్టణానికి చెందిన బాధితులు వజహద్ అలీ, ఇమ్రాన్ బాధితులు తెలిపిన వివరాల మేరకు. కర్నూలు మండలం మామిదాలపాడు పరిధిలోని ఎస్. జె. హాస్పిటల్ పక్కన సర్వే నంబరు 203-సి1ఏ1లో 93 సెంట్ల స్థలం ఉంది. దీన్ని ఇర్షాద్, మరో నలుగురికి రూ.7.50 కోట్ల రూపాయలకు అమ్మేందుకు 2020 సెప్టెంబరు నెలలో అగ్రిమెంట్ చేసుకున్నారు. ఆ సమయంలో కొంత మొత్తం ఇచ్చారు. రిజిస్ట్రేషన్ కు ముందే ఇరువురి మధ్య మనస్పర్థలు రావడంతో దాన్ని కాస్త రద్దు చేసుకోవాలనుకున్నట్లు బాధితులు తెలిపారు.
అగ్రిమెంట్ చేసుకున్న ఇర్షాద్ బృందం పోలీసులకు ఫిర్యాదు చేశారు . ఇక్కడ సివిల్ కేసును క్రిమినల్ కేసుగా మార్చి, భూమి రిజిస్ట్రేషన్ చేయాల్సిందేనని తమపై పోలీసులు ఒత్తిడి తెచ్చారని బాధితులు వాపోయారు. దీంతో తాము కోడుమూరు ఎమ్మెల్యేను ఆశ్రయించామని తెలిపారు.పంచాయితీ చేసినందుకు రూ.30 లక్షలు కమీషన్ ఇవ్వాలని ఎమ్మెల్యే కోరారు. అందుకు భరోసాగా ఏదైనా స్థలం ఇవ్వాలని ఎమ్మెల్యే కోరారని తెలిపారు. దీంతో ఉలిందకొండలో ఉన్న 96 సెంట్ల స్థలాన్ని సేల్ డీడ్ చేశామని.., ఇర్షాద్ బృందం ముందుగా చెల్లించిన రూ.4.20 కోట్లకు మరో రూ.2.35 కోట్లు కలిపి మొత్తం రూ.6.55 కోట్లు తిరిగి ఇచ్చేలా ఎమ్మెల్యే సుధాకర్, 38 వార్డు కార్పొరేటర్ గిప్సన్తో కలిసి పంచాయితీ చేశారు.
లాక్ డౌన్ సమయంలో డబ్బులు సమకూరకపోవడంతో ఎమ్మెల్యేను మూడు నెలలు గడువు కావాలని కోరారు. ఇర్షాద్ బృందానికి కట్టాల్సిన నగదును వడ్డీకి ఇప్పించి, ఏడాది సమయం ఇస్తానంటూ ఫుల్ రిజిస్ట్రేషన్ చేయించాలని ఎమ్మెల్యే తెలిపారు. 2021 జులై 15న ఆయన అనుచరులైన రఘునాథ్‌రెడ్డి, రవికుమార్ పేర్లపై సాయంత్రం 6.30కి హడావుడిగా రిజిస్ట్రేషన్ చేయించారు. ఇర్షాద్ బృందానికి చెల్లించాల్సిన డబ్బు చెల్లించకుండా.మొత్తం భూమిని ఇర్షాద్ బృందంలోని నలుగురి పేర్లతో 2021 జులై 30న రిజిస్ట్రేషన్ చేయించారు' అని తెలిపారు.
ఇందులో సుమారు రూ.3.50 కోట్లు ఎమ్మెల్యే జేబుల్లో వేసుకున్నారని ఆరోపించారు. దీనిపై స్పందించిన కోడుమూరు నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ జరదండి సుధాకర్ “నాపై కావాలనే కొంతమంది అనవసర ఆరోపణలు చేస్తున్నారు. నేను సెటిల్మెంట్ చేయలేదు. అగ్రిమెంట్ చేయడం, ఆపై రద్దు చేయడం. ఇలా రెండుసార్లు చేసి మూడోసారి స్టేషన్లో కేసు పెట్టారు. ఆ సమయంలో ఇమ్రాన్ నా దగ్గరకు వచ్చారు. సమయం ఇస్తే సెటిల్మెంట్ చేసుకుంటామని కోరారు. నష్టపోతున్నామని బాధపడితే సాయం చేద్దామని అనుకుని, తర్వాత ఎవరెవరో మధ్యవర్తులు కలగజేసుకోవడంతో నేను పట్టించుకోలేదు. ఆ తర్వాత ఇద్దరూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారని” తెలిపారు.
ఇందులో ఎంతవరకు వాస్తవముందో ఎంత వరకు లేదో చూడాలి. పైగా కోడుమూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ఈ మధ్యకాలంలోనే నాలుగు కోట్లకు పైగా విలువ చేసే కొత్త ఇంటిని సైతం నిర్మించుకున్నారు. దీనిపై జిల్లాలోని కొంతమంది ఈ సెటిల్మెంట్ ద్వారానే వచ్చిన డబ్బుతో ఇల్లు నిర్మించుకున్నాడని ఆరోపణలు చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Kurnool, Local News, Ysrcp