KONSEEMA UPDATES NEWS NO INTERNET FELICITY IN ALL AMALAPURAM SURROUNDING NGS
Konaseema: పూర్తిగా కోలుకోని కోనసీమ.. నెట్ సేవలు నిలిపివేతతో కష్టాలు.. గోదావరి గట్టుపైనే వర్క్ ఫ్రమ్ హోమ్
కోనసీమలో నెట్ కష్టాలు
Konaseema: నిత్యం ప్రశాంతంగా ఉండే కోనసీమ ఇప్పుడు చిన్న శబ్ధం విన్నా ఉలిక్కి పడాల్సి వస్తోంది. పచ్చటి పైరు గాలులతో కలకలలాడే ఆ ప్రాంతం.. పోలీసుల పహారాతో అల్లకల్లోలంగా కనిపిస్తోంది. ఉద్రిక్తతలు చల్లారినా.. అక్కడ ఇంకా సాధారణ స్థితికి రాలేదు. ముఖ్యంగా నెట్ సేవలు నిలిచిపోవడంతో ఐటీ ఉద్యోగులకు కష్టాలు తప్పడం లేదు.
Konaseema: కోనసీమ అంటే ప్రశాంతతకు.. సంప్రదాయాలకు.. పెట్టింది పేరు.. అక్కడ ఆప్యాయతలు కూడా ఎక్కువ ఉంటాయి. కానీ అలాంటి కోనసీమ ఇటీవల భగ్గుమంది. ఆ ఆగ్రహజ్వాల ఇంకా పూర్తిగా చల్లారలేదు. అయితే ఆ ఘటనకు కారణం ఎవరు అన్నదానిపై ఇప్పటికే రాజకీయంగా రచ్చ కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా కోనసీమ జిల్లా (Konaseema District) పేరు విషయంలో అమలాపురం (Amalapuram) లో జరిగిన అల్లర్లు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఈ వ్యవహారంపై తీవ్రరాజకీయ దుమారం కూడా రేగింది. అధికార ప్రతిపక్షాల మధ్య నిత్యం మాటల తూటాలు ఆగడం లేదు. తప్పు మీది అంటే మీద అంటూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. అల్లర్ల వెనుక టీడీపీ (TDP), జనసేన (Janasena) ఉన్నాయని వైసీపీ (YSRCP) ఆరోపిస్తుంటే.. డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా వైసీపీనే.. ఈ దారుణనానికి పాల్పడిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అయితే ఆ హింసాత్మక ఘటనలకు కారణం ఎవరన్నదానిపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. అయితే ఈ దర్యాప్తుపైనా విపక్షాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. అసలు ఏం జరిగింది అన్నది పోలీసులకు మొత్తం తెలుసని.. ముందే సమాచారం ఉందని.. కేవలం అధికార పార్టీ ఈ ఘటనలకు పాల్పడి.. విపక్ష నేతలను టార్గెట్ చేయడమే పోలీసుల లక్ష్యం అంటున్నారు. అంతా స్థానిక వైసీపీ నేతల ప్లాన్ ప్రకారం జరుగుతోందని ఆరోపిస్తున్నాయి. అయితే రాజకీయ ఆరోపణలు ఎలా ఉన్నా.. ఇంకా పూర్తిగా అక్కడ సాధారణ పరిస్థితి మాత్రం రాకపోవడంతో ఐటీ ఉద్యోగలు, ఇతర ఉద్యోగులు, సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ముఖ్యంగా సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు పెద్ద కష్టమే వచ్చింది. ఇప్పటికే ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరించలేదు. చివరికి గోదావరి నది ఒడ్డున నిలబడి పని చేసుకుంటున్నారు. అక్కడ ఇంటర్నెట్ సర్వీస్ వస్తుండటంతో ల్యాప్ ట్యాప్ లు పట్టుకొని వెళ్లి.. గోదావరి నది గట్టుపై గుంపులు గుంపులుగా నిలబడి పని చేసుకోవాల్సి వస్తోందని వాపోతున్నారు. ఎందుకంటే అమలాపురంలో అల్లర్ల తర్వాత జిల్లాలో ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. గత మూడు రోజులుగా ఇంటర్నెట్ సర్వీస్ కట్ చేశారు. దీంతో ముక్తేశ్వరంలోని ఐటీ ఉద్యోగులు తిప్పలు పడుతున్నారు.
అమలాపురంలో విధ్వంసకాండ జరిగి మూడు రోజులు దాటింది. ఇప్పటికే అమలాపురం ప్రాంతం అంతా పోలీసుల ఆధీనంలోనే ఉంది. ప్రస్తుతం అక్కడ ప్రశాంత వాతావరణం నెలకొని ఉంది. ప్రజలకు నిత్యం కార్యక్రమాలకు ఇబ్బందులు లేకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. అల్లర్లు జరిగిన మరుసటి రోజు నుంచి కూడా పూర్తిగా ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. అవాంఛనీయ సంఘటనలు, గొడవలు జరక్కుండా, వాట్సాప్ గ్రూపుల్లో రెచ్చగొట్టే అంశాలు ఫార్వార్డ్ చేసుకోకుండా ఇంటర్నెట్ సేవలు నిలిపివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కానీ అమలాపురం పరిసర ప్రాంతాల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు మాత్రం ఇబ్బందులు తప్పడం లేదు. ఇంటర్నెట్ సర్వీస్ నిలిచిపోవడంతో వారి విధులు ఆగిపోయాయి. ఈ క్రమంలో ముక్తేశ్వరం ప్రాంతంలో కొద్దిమేర ఇంటర్నెట్ సర్వీస్ వస్తోంది. ఈ విషయం తెలుసుకున్న టెకీలు.. తమ ల్యాప్ ట్యాప్ లు తీసుకుని ఆ ప్రాంతానికి వెళ్లారు. అక్కడే తమ విధులు నిర్వహిస్తున్నారు.
Published by:Nagabushan Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.