Kia Motors : నేడే కియా కొత్త కారు విడుదల... ఆవిష్కరించనున్న ఏపీ మంత్రులు

Kia Motors : నేడే కియా కొత్త కారు విడుదల... ఆవిష్కరించనున్న ఏపీ మంత్రులు

ప్రతీకాత్మక చిత్రం (Image : Twitter - Kia Motors India)

Kia Car : అనంతపురంలో కంపెనీని నెలకొల్పి... కార్ల తయారీ చేపట్టిన కియా మోటార్స్... తొలి ఎడిషన్‌ను ఇవాళ రిలీజ్ చేస్తోంది. ఇందుకు ముఖ్యమంత్రి జగన్‌ని ఆహ్వానించినా... ఢిల్లీ పర్యటన కారణంగా... ఆయన బదులు మంత్రులు హాజరుకాబోతున్నారు.

  • Share this:
అనంతపురంలోని పెనుగొండలో ఏర్పడిన కియా మోటార్స్... సంవత్సరానికి 3 లక్షల కార్లను ఉత్పత్తి చెయ్యాలని టార్గెట్ పెట్టుకుంది. భవిష్యత్తులో ఏడాదికి 7 లక్షల కార్లను తయారుచేసే సామర్ధ్యానికి చేరుకోవాలనే లక్ష్యం కూడా ఉంది. అందులో భాగంగానే తొలి కారు ‘సెల్టోస్‌’ను నేడు మార్కెట్లోకి రిలీజ్ చేస్తోంది కియా. ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌ను కియా కంపెనీ ప్రతినిధులు ఆహ్వానించారు. కానీ... ఢిల్లీ పర్యటనలో ఉన్న జగన్... మరికొంత మంది కీలక మంత్రుల్ని కలవాల్సి ఉండటంతో... తన పర్యటనను మరో రోజు పొడిగించుకున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ఢిల్లీ నుంచీ గన్నవరం వచ్చే జగన్... వెంటనే పోలవరం ముంపు ప్రాంతాల్లో ఏరియల్‌ సర్వే చేస్తారు. కాపర్‌ డ్యాం కారణంగా... నీట మునిగిన ప్రాంతాల్ని హెలికాప్టర్‌ ద్వారా పరిశీలిస్తారు. ఆ తర్వాత పోలవరం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. అందువల్ల ప్రతిష్టాత్మక కారు ప్రారంభోత్సవానికి ఏపీ మంత్రులే వెళ్లబోతున్నట్లు తెలిసింది.


నేటి మధ్యాహ్నం 12:30 గంటలకు ఏపీ మంత్రులు అనంతపురం జిల్లాకు వెళ్తారు. 1:45 నిమిషాలకు కియా మోటార్స్ ఇండియా కంపెనీని చేరుకుంటారు. 2:20కి ప్రధాన వేదిక దగ్గరకు వెళ్తారు. భారీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ కుమార్ రెడ్డి, జిల్లా మంత్రి శంకర నారాయణలతో పాటు మరికొందరు మంత్రులు, కియా మోటార్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ కుక్ హ్యూన్ షిమ్, వైఎస్ ఛైర్మన్ ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు కియా సెల్టోస్ కారు రిలీజ్ అవుతుంది.

నిజానికి కిందటి నెల 31 నాడే తొలి కారును ఆవిష్కరించాల్సి ఉన్నా... వైఎస్ జగన్ జెరూసలేం పర్యటనకు వెళ్లడంతో వాయిదా వేశారు. అలాంటిది రెండోసారి కూడా సీఎం హాజరయ్యే పరిస్థితి లేకుండా పోయింది. మరోవైపు ఇప్పటికే సెల్టోస్ కార్ల బుకింగ్ మొదలైంది. పెనుకొండ ప్లాంట్ నుంచే దేశంలోని అన్ని రాష్ట్రాలకూ ఈ కార్లు సరఫరా అవ్వబోతున్నాయి.
First published:

అగ్ర కథనాలు