Ramesh, News18, East Godavari
దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదన్నది పాత సామెత. కానీ ఏపీలో సర్కారు వరమిచ్చినా వరమే దక్కడం లేదంటున్నది కొత్త మాట. ప్రస్తుతం ఏపీలో ప్రభుత్వ విధానాలు చూస్తుంటే వచ్చినట్టే..వచ్చి వెక్కిరిస్తున్నట్టుంది పరిస్థితి. ఇదిగో అదిగో అంటూ కాలం వెలిబుచ్చడం తప్పితే ఫలితం దక్కకపోవడంతో సంబంధిత బాధితులకు కష్టాలు తప్పడం లేదు. ఇటీవల కాలంలో కారుణ్య నియామకాల తీరు అదే స్పష్టం చేసింది. మొత్తం మీద బాధితుల మొరకు,సర్కారు కదిలింది. నియామక పత్రాలు చేతుల్లో పెట్టింది.
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 33 మంది అభ్యర్థులకు కారుణ్య నియామకాల కింద జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా నియామక పత్రాలను అందించారు. దీంతో చాలా కుటుంబాల్లో ఆనంద బాష్పాలు వెలుగుచూశాయి. కారుణ్య నియామకం కింద 33మందికి ఉద్యోగ పత్రాలను అందించడంతో ఆయా కుటుంబాలు ఆనందం వ్యక్తం చేశాయి. ఈ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ఏం పని జరిగినా పక్కాగానే జరుగుతుంది. అయితే ఆలస్యం కూడా అదే స్థాయిలో పక్కగా ఉందని చెప్పాలి. ఆయా కుటుంబాల్లో పెద్దలు చనిపోతే, కుటుంబ సభ్యుల అంగీకారం మేరకు ఆ ఉద్యోగాన్ని ఆ ఇంటిలో వారు ప్రపోజ్ చేసిన వ్యక్తికి ఇవ్వాలి.
ఇలాంటివి ఉమ్మడి తూర్పుగోదావరి అంటే, ప్రస్తుతం కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాలో గతం నుండి పెండింగ్ దరఖాస్తులు ఎదురుచూస్తూనే ఉన్నాయి. వీటిపై ప్రభుత్వం ఏ ఒక్క నిర్ణయం స్పష్టంగా తీసుకోలేదు. దీనికి తోడు ఆయా కుటుంబ సభ్యులు పనిచేసిన చనిపోయిన అభ్యర్థి డెత్, ఎఫ్ఎమ్సీ (ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్) సమర్పించాలి. ఈ ప్రక్రియ మొత్తం దాదాపుగా నెల నుండి రెండు నెలలు జరుగుతుంది. కొన్ని ప్రాంతాల్లో ఆయా అధికారుల ప్రభావాన్ని బట్టి సమయం పెరగొచ్చు, తగ్గొచ్చు. ఇలా జరిగిన ప్రక్రియ అనంతరం దరఖాస్తు చేసారు.
ఇలా చేసిన దరఖాస్తులు ప్రభుత్వం వద్ద పెండింగ్లో ఉండిపోయాయి. అన్ని శాఖలకు సంబంధించిన దరఖాస్తులు చేసుకున్న వారు ఈ జాబితాలో ఉన్నారు. ముఖ్యంగా ఆర్టీసీ,హెల్త్, ఎడ్యుకేషన్ విభాగాలతోపాటు, మున్సిపల్, పంచాయతీరాజ్,ఆర్అండ్బి శాఖలకు చెందిన ఉద్యోగులు మృతి చెంది ఉండటంతో వారి కుటుంబ సభ్యుల్లో ఎవరికో ఒకరికి ఆ పోస్టుకు సంబంధించి, అభ్యర్థి అర్హతకు సంబంధించిన పోస్టు కేటాయించాలి. అయితే ఇక్కడ పోస్టుల ఎంపికలోనే దాదాపుగా ఎక్కువ ఆలస్యం జరిగింది.
సచివాలయాల ఉద్యోగాలకే ప్రాధాన్యత
ప్రస్తుతం గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉన్న ఖాళీలను, కారుణ్య నియామకాల కోటా కింద చూపిస్తు న్నారు. కారుణ్య నియామకం ఆయా తండ్రి, తల్లి పనిచేసిన శాఖకు కాకుండా ఎక్కువగా సచివాలయ వ్యవస్థను దీనికి అనుసంధానం చేశారు. అంటే ప్రస్తుతం అక్కడ ప్రొబిషన్ పీరియడ్ జీతాలే ప్రస్తుతానికి వారికి చెల్లిస్తారు.
ఈనేపథ్యంలో అర్హత ఎక్కువగా ఉన్నప్పటికీ ఆయా సంస్థలకు సంబంధించిన వాటిలో ఉన్న పోస్టులు కాకుండా సచివాలయాల ఉద్యోగం ఉందని ఎక్కువగా సూచిస్తున్నారు. ఇందులో ఎంపిక విధానం అయితే దూర ప్రాంతాలకు వెళ్లే అవకాశం ఉండటంతో దగ్గరగా ఉండే సచివాలయాలమే మేలని మరికొందరు అభిప్రాయ పడుతున్నారు. ఏదైనా మొత్తం మీద సర్కారు కారుణ్య నియామకాలపై కరుణించడం ఇప్పుడు ఓ రకంగా ఆ కుటుంబాల్లో వెలుగు నింపుతుందనే చెప్పాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, East godavari, Local News