KAPU LEADERS THINKING OF NEW PLATFORM INSTEAD OF FLOORING NEW POLITICAL PARTY FULL DETAILS HERE PRN VSP
Kapu Political Party: రాజకీయ పార్టీపై కాపునేతల కీలక నిర్ణయం..? ఆ విషయంలో వెనక్కి తగ్గారా..?
రాజకీయ పార్టీపై కాపు నేతల కీలక నిర్ణయం..?
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో కాపులు (Kapu Caste) ఎప్పుడూ హాట్ టాపిక్కే. కాపులు ఏవైపు ఉంటే ఆ పార్టీ అధికారంలోకి వస్తుందన్న ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. ఐతే కాపులు గెలుపోటముల్లో కీలక పాత్ర పోషిస్తున్నా.. రాజ్యాధికారం మాత్రం ఆ సామాజిక వర్గానికి కలగానే ఉంది.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో కాపులు (Kapu Caste) ఎప్పుడూ హాట్ టాపిక్కే. కాపులు ఏవైపు ఉంటే ఆ పార్టీ అధికారంలోకి వస్తుందన్న ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. ఐతే కాపులు గెలుపోటముల్లో కీలక పాత్ర పోషిస్తున్నా.. రాజ్యాధికారం మాత్రం ఆ సామాజిక వర్గానికి కలగానే ఉంది. ఐతే ఇటీవల కాపులకు ప్రత్యేక పార్టీ వస్తోందంటూ ప్రచారం జరిగింది. ఐతే కాపులు పార్టీ కంటే.. రాజకీయాలను శాసించేలా వేదికను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారట. రాజకీయ పార్టీ పెద్దగా వర్కవుట్ కాదని కాపుపెద్దలు భావించడం వల్లే ఈ నిర్ణయం వెనక్కి తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ విషయాన్ని కాపులలో పెద్దలు.. ఆ వర్గంలో పెద్దలుగా ఉంటున్న రాజకీయ నేతలే నిర్ణయించారని తెలుస్తోంది. రాజ్యాధికారం సాధించే దిశగా ఎన్నాళ్ల నుంచో కాపులు ఎదురుచూస్తున్నారు.
ప్రధానంగా ఎందరో ప్రముఖులు రాజకీయాల్లో ఆయా సామాజిక వర్గాల వారీగా ఎదుగుతున్న నేపధ్యం మనం నిత్యం గమనించవచ్చు. నాలుగు దశాబ్ధాలుగా కాపులకు తెలుగు రాష్ట్రంలో "సీఎం" అనే పదవి కూడా దక్కలేదు. స్వాతంత్రం వచ్చిన తర్వాత తమ వర్గం రాజకీయంగా బలపడుతుందని ఎందరో ఆశించారు. అయితే అవన్నీ అడియాశలే అయ్యాయి. ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావంతో ఆశలు మళ్లీ చిగురించాయి. కానీ ఆపరేషన్ సక్సెస్ పేషంట్ డెడ్ అన్న చందాన.. పీఆర్పీ ప్రస్థానం ముగియగానే కాపుల గూడు చెదిరిపోయింది. ఎవరికి వారే అయిపోయి.. మళ్లీ ఇతర సామాజిక వర్గాలు అధికారంలో మంత్రులుగా ఉంటూ వస్తున్నారు.
అయితే ఇది ఏమాత్రం సంతృప్తికరంగా లేదని కాపు పెద్దల్లో కొందరు బాహటంగానే చాలాసార్లు పెదవివిరిచారు. ఓట్లలో తమ ఆధిక్యం.. సీట్ల కేటాయింపులో తమ ఆధిక్యం ఉన్నప్పటికీ.. సీఎం పదవి అనేది మాత్రం దూరమవుతూ వస్తోంది. ఇది ఎంతమాత్రం సమంజసం కాదన్నది కాపుల్లో ఉద్దండ పెద్దల అంతర్మధనం. మొన్నటి 2019 ఎన్నికల తర్వాత కాపులకి మరింత ప్రాధాన్యం తగ్గిందన్న భావన కూడా ఉండనే ఉంది. దీంతో అందరూ ఇక ఏకతాటి పైకి రావాలని.. తమ సామాజికవర్గం ప్రముఖుల్ని.. అతిరధుల్ని కలుపుకోవాలని ప్రణాళికలు వేశారు. దీనికి చిరంజీవి.. పవన్ కళ్యాణ్ వంటి వారి ప్రోత్సాహం.. సహకారం మాట ఎలా ఉన్నా.. గంటా శ్రీనివాసరావు వంటి నాయకులు మాత్రం ముందుకు కదిలారు.
మొన్నటివరకూ కాపు పెద్దలంతా ఒక పార్టీ పెట్టాలని.. కాపులకు ప్రత్యేక రాజకీయ పార్టీ కావాలని భావించినట్టు బయటకు వచ్చింది. అయితే రాజకీయ పార్టీ వల్ల ప్రయోజనాలు తక్కువేఅని.. అలా అయితే వచ్చే మెజారిటీ కూడా తక్కువేనని నాయకులు అభిప్రాయం వెలిబుచ్చారట. తాజాగా కాపు ముఖ్యనాయకులు మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారని సమాచారం. విజయవాడలో భేటీ కావాలని భావించినా.. కరోనా థర్డ్ వేవ్‌తో వర్చువల్‌లో భేటీ అయ్యారు. ఈ సమావేశానికి 16 మంది నేతలు హాజరయ్యారని.. సుమారు రెండు గంటల పాటు ఈ సమావేశం సాగిందని తెలుస్తోంది.
ఇందులో మొదట అనుకున్నట్టు కాకుండా.. అన్ని కులాలను కలుపుకుని ముందుకు వెళ్లాలని మెజార్టీ సభ్యులు సూచనలు చేశారు. అన్ని కులాలను కలుపుకుని ఐక్యవేదిక ఏర్పాటుకు రంగం సిద్ధం చేశారు. దళితులు, వెనకబడిన వర్గాల ముఖ్యనేతలతో టచ్‌లో ఉన్న కాపు ముఖ్యనేతలు ఫిబ్రవరి రెండవ వారంలో మరోసారి భేటీ కావాలని నిర్ణయించినట్టు సమాచారం. విజయవాడలో సమావేశం అయ్యేందుకు సూత్రపాయంగా అంగీకారం తెలిపారు. సమావేశంలో కోర్ కమిటీ వేయాలని సూచనలు చేశారు. అయితే ఈ సమావేశానికి వైసీపీలో ఉన్న కాపు నేతలు దూరంగా ఉన్నారు.
తొలుత జరిగిన మూడు నాలుగు భేటీల్లో మాత్రం వైసీపీ నేతలు వచ్చారు. ముఖ్యంగా వంగవీటి రంగా జయంతి సందర్భంలో తూర్పు నేత తోట త్రిమూర్తులు కాపు ప్రముఖులతో కలిశారు. అయితే అది వంగవీటికి సంబంధించిన కార్యక్రమం కావడంతో వైసీపీ అధిష్టానం కూడా పెద్దగా పట్టించుకోలేదు. అయితే ఈ సారి కాపు నేతలతో కలిస్తే.. రాజకీయంగా పార్టీలో ఇబ్బంది వస్తుందని వైసీపీ కాపు నేతల్లో బలంగా ఉంది.
మొన్నటి సమావేశంలో మాత్రం మాజీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, వట్టి వసంతకుమార్, రిటైర్డ్ ఐఎఎస్ అధికారి రామ్మోహాన్, ఏపీ మాజీ డీజీపీ సాంబశివరావు, ముద్రగడ్డ అనుచరుడు ఆరేటి ప్రకాశ్ కలిసారు. ఏదేమైనా కాపులకు ప్రత్యేక రాజకీయ పార్టీ లేదనేది విస్పష్టం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
Published by:Purna Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.