P Anand Mohan, Visakhapatnam, News18
ఉక్రెయిన్ పై రష్యా యుద్ధానికి దిగడమేమో గానీ.. ఆంధ్రప్రదేశ్ లో భోజనప్రియులకు మాత్రం ముద్ద దిగడం లేదు. యుద్ధం ఎఫెక్ట్ తో వంట నూనెల ధరలు అమాంతం పెరిగాయి. యుద్ధం కారణంగా దిగుమతులు నిలిచిపోయాయా.. లేదా అనేది పక్కనబెడితే నూనెల ధరలు మాత్రం చుక్కలనంటాయి. వంటనూనె పెంపు దెబ్బ మామూలుగా లేదు. సామాన్య జనమే కాదు. పేరు మోసిన హొటళ్లు కూడా ఆయిల్ అంటేనే భయపడిపోతున్నాయి. ఆయిల్ బేస్డ్ వంటకాల్ని దూరం పెడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ప్రముఖమైన తూర్పు గోదావరి జిల్లా (East Godavari District) కాకినాడ సుబ్బయ్యగారి హోటల్ (Kakinada Subbayya Gari Hotel) లో ఇప్పటికే ఇది జరిగింది. ప్రస్తుతం సుబ్బయ్య హోటల్లో నో పూరి. నో బజ్జీ. అన్నీ ఉడికింపు వంటలే. ఆవిరి కుడుములు.. ఇడ్లీలు.. దోశలే. ఇదంతా ఉక్రెయిన్ రష్యా యుద్ధ ప్రభావమే. రెండు దేశాలు కొట్టుకుంటే.. భారత్ లోని కాకినాడలో ఆ ఎఫెక్ట్ ఇలా పడింది.
కాకినాడ సుబ్బయ్య హొటల్ చాలా ఫేమస్. అందరికీ ఇక్కడి సంప్రదాయ వంటకాల గురించి ఓ ఐడియా ఉంది. దాదాపు ఆంధ్రులందరూ ఈ భోజనాన్ని, టిఫిన్లను లొట్టలేసుకుని తింటారు. ఎన్నో రకాల ఐటెమ్స్ కూడా ఇక్కడి స్పెషాలిటీ. ఆ మాటకొస్తే.. పక్కరాష్ట్రాల వాళ్లు కూడా సుబ్బయ్య హొటల్ లో చేయికడగందే వెళ్లబోరు. ఇక ప్రస్తుతం సుబ్బయ్య హొటల్లో కొన్ని ఐటమ్స్ మాత్రం ఇవ్వడం లేదు. సన్ ఫ్లవర్ ఆయిల్ కొరత.. రేట్ల పెరుగుదల కారణంగా ఇక్కడ పూరీ, బజ్జీ వంటి వంట నూనె ఆధారిత వంటకాల్ని కొద్ది రోజులు దూరం పెట్టారు. ఇదంతా కొద్దిరోజులే.. వంటనూనె ధరలు అందుబాటులో ఉంటే మళ్లీ ఇస్తామని వినియోగదారులు గమనించాలంటున్నారు.
ఇక యుద్ధ ప్రభావంతో విధించిన ఆంక్షల కారణంగా నూనె ధరలకు రెక్కలు వచ్చాయి. మొన్నటివరకు కిలో రూ.138 వరకు ఉన్న ప్రముఖ సన్‌ఫ్లవర్ బ్రాండ్ నూనె ఇప్పుడు రూ.175, అయిదు లీటర్లు రూ.890, 15 లీటర్ల డబ్బా రూ.2,7820 వరకు పెరిగిపోయింది. ఒకరకంగా చెప్పాలంటే గడచిన పన్నెండు రోజుల్లో వంట నూనెలపై కిలోకు రూ.37, అయిదు కేజీలపై రూ.170, 15 లీటర్లపై రూ.520 భారం పడింది. ఎప్పుడూ ఐదు లేదా పదిహేను లీటర్లు కొనే కుటుంబాలు కూడా ఇప్పుడు ధరల భగ్గుతో కిలో ప్యాకెట్‌తో సరిపెట్టుకుంటున్నాయి.
హోటళ్లు, రెస్టారెంట్లు ఆయిల్‌తో తయారుచేసే ఆహార పదార్థాల తయారీ నిలిపివేయగా, మరికొన్ని రేట్లు పెంచేశాయి. కాకినాడ, రాజమహేంద్రవరం నగరాల నుంచి గ్రామాల వరకు అనేక హోటళ్ల నుంచి రోడ్డుపై బండి వరకు నూనెధరల సాకుతో టిఫిన్ రేట్లు పెంచేశారు. దోసె, పూరీపై పది నుంచి పన్నెండు చొప్పున, ఇడ్లీపై అయిదు రూపాయల చొప్పున ధర పెంచేశాయి. నూనె ధరలు పెర గడంతో పెంపు తప్పలేదని బయట బోర్డులు ఏర్పాటు చేశాయి. ప్రముఖ హోటళ్లలోను అల్పాహార ధరలు పెరిగిపోయాయి.
ఇక తోపుడు బండ్లు, చిన్నచిన్న కాకాహోటళ్లలో గత నాలుగు రోజులు నుంచి టిఫిన్ రేట్లు పెంచినట్లు బోర్డులు ఏర్పాటుచేశాయి. గ్రామాల్లోను దోసె, పూరీ రేట్లు పెరిగాయి. కొన్ని హోటళ్లయితే ధరలు పెంచడానికి బదులు పూరీ, బజ్జీ వంటి ఎక్కువ నూనె వినియోగించే టిఫిన్ల విక్రయాలు నిలిపివేశాయి. కొన్ని రెస్టారెంట్లు చికెన్ స్టార్టర్ల రేట్లు కూడా పెంచి మెనూ ధరలు సవరించాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Cooking oil, Kakinada