D.Prasad, News18, Kadapa
పుష్పగిరి, మన కడప జిల్లాలో అలనాటి చారిత్రక వైభవాన్ని ఆధ్యాత్మిక గొప్పతనాన్ని మన కళ్లకి కట్టినట్లు సజీవంగా నిలిపే సాక్ష్యం. అద్భుతమైన శిల్ప కళా సంపద. అపురూపమైన దేవాలయ నిర్మాణాలు మనల్ని కట్టిపసేసే విధంగా రూపు దిద్దుకొని నేటికి చెక్కు చెదరకుండా మన ముందు నిలిచి ఉన్నాయి. కడప జిల్లాలోని ఈ పుష్పగిరి వల్లూరు మండలంలో వుంది. కడప నగరానికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో పెన్నా నది ప్రవాహానికి దగ్గరగా ఈ పుష్పగిరి ఆలయం అతి సుందరంగా నిర్మించబడి వుంది.
ఈ ఆలయంలో శివ కేశవులు ఇరువురు ఒకేచోట ఉండటం విశేషం.ఇక ఈ ఆలయం యొక్క స్థల పురాణం గురించి తెలుసుకున్నట్లయితే ఈ ప్రాంతం గురించిన అనేకమైన పురాతన కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. అందులో ప్రధానంగా గరుత్మంతుడు తన తల్లి దాస్య విమోచనం కొరకు, నాగులకు తీసుకెలుతున్న అమృతంలో కొన్ని చుక్కలు ఈ ప్రాంతంలోని సరస్సు నందు పడగా, ఈ సరస్సులో స్నానమాచరించిన వారు అమరులు అవుతుండగా ఇది చూసిన శివ కేశవులు సరస్సుపై ఒక కొండను ఉంచి తొక్కి పూడ్చడం జరిగిందని, ఆ తరువాత ఈ కొండ పుష్పంలా మారడం వలన ఈ ప్రాంతాన్ని పుష్పగిరి అని పిలుస్తున్నారని పురాణ గాథల ద్వారా మనం తెలుసుకొన వచ్చును.
ఈ కొండపై ఉన్న ఆలయంలో విష్ణు స్వరూపుడైన చెన్నకేశవ స్వామి, శివ స్వరూపం సంతాన మల్లెస్వరుడైన శివ స్వరూపం ఇక్కడ ఉండటం వలన పుష్పగిరి హరిహర క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. అద్భుత శిల్ప సౌందర్యంతో అపురూప కట్టడాలతో ఈ క్షేత్రం వైభవంగా వృద్ధి చెందుతుంది. ఎల్లప్పుడూ పక్క రాష్ట్రాల నుండి ఎంతో మది భక్తులు ఇక్కడి స్వామివారికి దర్శించుకుని వెళుతుంటారు.ఇక్కడి ప్రాంతంలో అయిదు ఉప నదులు ఇక్కడి పెన్నానదిలో కలవడం పంచనదీ తీర్థం అని అంటారు
. ఆనాటి శిల్పకళా సౌందర్యానికి సాక్ష్యంగా పుష్ప గిరి ఆలయ అందాలు మన కళ్లకు కన్పిస్తాయి. అపురూప శిల్ప కళలకు, భిన్న సంస్కృతి, సాంప్రదాయాలకు నెలవుగా పుష్పగిరి ఆలయ సౌందర్యం సందర్శకులను మంత్ర ముగ్ధుల్ని చేస్తుంది.అద్భుతమైన ఈ ఆలయ నిర్మాణాన్ని పాండవుల వంశానికి చెందిన జనమే జయుడు చెసిన సర్పయాగ పాప పరిహారార్థం ఈ పుష్పగిరి కొండపై ఆలయ ప్రతిష్ఠ చేసినట్లు చరిత్ర ద్వారా తెలుస్తోంది. ఆ తరువాత చోళులు, పల్లవులు, కృష్ణ దేవరాయలు ఆ తర్వాతి కాలంలో ఆలయాన్ని అభివృద్ధి చేశారని చరిత్ర ద్వారా తెలుస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Kadapa, Local News