D.Prasad, News18, Kadapa
కోటి రెడ్డి సర్కిల్... ఈ మధ్యతెలుగు సినిమాలలో కడప గురించిన ప్రస్తావన రాగానే మొదటగా ఈ పేరునే వాడుతున్నారు. ఈ పేరుకి కడప ప్రజలకి ఎంతో అనుబంధం వుంది. కడప నగరం నడిబొడ్డున విశాలంగా విస్తరించిన కోటి రెడ్డి సర్కిల్ ని నగరంలో నివసించే ప్రతి ఒక్కరు, రోజుకి ఒక్కసారైనా సరే ఇక్కడికి రావాల్సిందే, కూడలిని దాటాల్సిందే.. ఎందుకంటే కడప నగరంలో ప్రతి ప్రాంతానికి ఈ కోటి రెడ్డి సర్కిల్ అనుసంధానం అయి ఉంటుంది.
అలా వెళ్ళేటప్పుడు ఆ కూడలి లో మధ్యలో ఒక పెద్దాయన ఠీవిగా, తెలుగుతనం ఉట్టిపడే రూపంతో ఒక విగ్రహం మన కంట పడుతుంది. అందరూ ప్రతి రోజు ఆయన్ని చూస్తున్నా.. కొద్ది మందికి మాత్రమే ఆ మహానుభావుడి గురించిన పూర్తి వివరాలు తెలుసు. తెలియని వారిలో మీరు ఉన్నట్లయితే జాగ్రత్తగా చదవండి. మన కడప స్వాతంత్ర సమరయోధుడి చరిత్రని. తెల్ల దొరలూ మన దేశాన్ని పాలించే కాలంలో వారికి ఎదురు తిరిగి పోరాటం చేసిన ఉక్కు గుండెలు కలిగిన అతి కొద్ది మంది స్వాతంత్ర సమర యోధులలో మన జిల్లానుండి ఆయన ఒకరు.
అంతే కాదు ఆయనొక విద్యావేత్త, న్యాయవాది, రాజకీయ నాయకుడు, వ్యవసాయాన్ని ప్రేమించే రైతు. ప్రతి రంగంలో ఆయన విజయం సాధించారు, ప్రజల గుండెల్లో చిర స్థాయిగా నిలిచారు.చిత్తూరు జిల్లా, మదనపల్లె తాలూకాలోని కోటి రెడ్డి పల్లె గ్రామంలో జన్మించిన ఆయన, 1911 సంవత్సరంలోనే ఇంగ్లాండ్ లో ఉన్నత విద్యని ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో అభ్యసించి, బారిష్టర్ ఎట్ లా లో పట్టభద్రుడు అయ్యాడు. ఆ తరువాత ఆయన న్యాయవాదిగా మరియు రైతుగా కడప నగరంలో స్థిరపడ్డారు.
విద్యార్థి స్థాయి నుండి ఆయన స్వాతంత్రోద్యమంలో చురుకుగా పాల్గొనేవారు. 1921వ సంవత్సరంలో, సహాయ నిరాకరణోద్యమంలో భాగంగా రాయలసీమ ప్రాతంలో పర్యటించిన మహాత్మాగాంధి గారి ప్రసంగాలకి ఆకర్షితుడైన కోటి రెడ్డి...అప్పటి ఉద్యమంలో గాంధీఅనుచరుడిగా మారి పోరాడాడు. రాయలసీమ ప్రాంతంలో అఖిల భారత కాంగ్రెస్ తరఫుల ప్రజలలో రాజకీయ స్వాతంత్ర ఉద్యమ స్పూర్తిని నింపడంలో ప్రధాన పాత్ర వహించారు.
రాయలసీమ ప్రాంతంలో గాంధీప్రసంగాలకి అనువాదకుడిగా వ్యవహరించాడు ఇలా రాయలసీమ ప్రాంతంలో గాంధీప్రధాన అనుచరుడిగా పేరు పొంది. క్విట్ ఇండియా, ఉప్పు సత్యాగ్రహం, విదేశీ వస్తు బహిష్కరణ వంటి స్వాతంత్రోద్యమాలలో పాల్గొంటూ, పలు మార్లు జైలు పాలయ్యారు. ఆయన మాటలతో రాయలసీమ ప్రజలు స్యతంత్రయోద్యమంలో పాల్గొనేలా చైతన్యపరిచేవాడు.
ఈవిధంగా ఆయన 1922 వ సంవత్సరంలో ప్రథమంగా మద్రాసు శాసనసభకి ఎన్నికయ్యారు.ఇలా తన రాజకీయ జీవితాన్ని కూడా స్వాతంత్రోద్యమంలో భాగం చేస్తూ పలుమార్లు రాజీనామాలు చేస్తూ, స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికవుతూ, తెల్ల వారికి వ్యతిరేకంగా ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులతో కలిసి పోరాడేవారు.
ఈ విధంగా ప్రత్యేక తెలుగు రాష్ట్రం ఏర్పడటంలో, ఆంధ్ర విశ్వ విద్యాలయ ఏర్పాటు, రాయలసీమ ప్రజల మనుగడ కొరకు తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం స్థాపన వంటి మరెన్నో సాంఘిక సంస్కరణ కార్యక్రమాలలో కోటిరెడ్డిముందుండి కృషి చేశారు. ఆయన చేసిన కృషికి అడుగడుగునా స్మరించుకునే విధంగా ఆయన గౌరవార్థం నేడు మన కడప నగరం నడిబొడ్డున ఆయన విగ్రహం ప్రతిష్టించారు. ఇలా ఆ స్థలం నేడు కోటి రెడ్డి సర్కిల్ గా చరిత్రలో, ప్రజల మనస్సులో నిలిచి పోయింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Kadapa, Local News