D Prasad, News18, Kadapa
ప్రస్తుతం శీతాకాలం (Winter) వణికిస్తోంది. వస్తు వస్తూ.. అందమైన, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని, అందరు సంతోషంగా జరుపుకునే పడగలను తనతోపాటు తీసుకొచ్చింది. అంతే కాదండోయ్..! మనకు ఇష్టమైన రేగు పండ్లని కూడా మన ముందుకు తీసుకొచ్చింది ఈ చల్లని శీతాకాలం. రేగు పండ్లు ఈ పేరు వినగానే, బహుశా అందరికి నోట్లో నీళ్ళురుతాయి. అలా ఉంటుంది మరి దాని రుచి. పులుపు, తీపి, కొంచెం వగరు కలగలిపిన ఆ రుచికి చిన్నపిల్లల దగ్గర నుండి పండు ముసలి వరకు అందరు మహా ఇష్టంగా తింటారు. ఇక పోతే..! రేగుపండ్లు తినడంవలన మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలగురించి ఇపుడు తెలుసుకుందాం. మన రాయలసీమ జిల్లాలో మాత్రం, ప్రతి ఊళ్లో కనీసం ఒక చెట్టయిన ఉండక తప్పదు..! నిజమే కదా మీ ఊళ్ళో కూడా ఉండే ఉంటుంది.?
ఇక అటవీ ప్రాంతాలలో అయితే రోడ్డు పక్కనే ఎక్కడబడితే అక్కడ గుంపులు గుంపులుగా, కొమ్మల వెంపటి పేర్చినట్లు వరుసగా అందంగా ఆకుపచ్చ, పసుపు, ఎరుపు రంగుల్లో మన కనులను ఆకర్షిస్తూ కనిపిస్తూ ఉంటాయి. అలా ఆకర్షిస్తుంటే మనం మాత్రం ఆగుతామా చెప్పండి.. బండి పక్కకి ఆపి, చెట్టు దగ్గరికి వెళ్లి.. ఓ నాలుగు కాయలు నోట్లో వేసుకుని, ఇంకో నాలుగు జేబులో వేసుకుని, తింటూ మన ప్రయాణాన్ని కొనసాగిస్తాం.
ఇంతవరకు బాగానే వుంది ఇప్పుడు రేగు పండ్ల గురించి అసలైన నిజాలను తెలుసుకుందాం...! ఈ రేగు పండ్లు రుచికే కాదండి, వీటిని తినడం వలన మన శరీరానికి కావలసిన ఆరోగ్యాన్ని మనకు తెలియకుండానే మనకు అందిస్తుంది. ఎలాగా అంటారా..!
ఇది చదవండి: కోనసీమలో ఘనంగా ప్రభల ఉత్సవం.. ప్రత్యేకతలివే..!
ఈ రేగు పండ్లలో విటమిన్ సి, ఎ, పొటాషియం పుష్కలంగా దొరుకుతాయి. వీటి వలన, మన శరీరానికి కావాల్సిన వ్యాధి నిరోధక శక్తి పెంపొందిస్తుంది. చర్మ సమస్యలు తొలగి, చర్మం ఎక్కువ రోజులు యవ్వనంగా ఉంటుంది, రక్తంలో ఐరన్ శాతం పెరిగి రక్త సమస్యలు దూరం అవుతాయి. అలాగే మలబద్దకం నివారణ, ఒత్తిడిని నివారణకు ఈ పండు దివ్యౌషధంగా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణుల సలహా ఇస్తున్నారు. అంతే కాకుండా అజీర్తి, కడుపులో మంట, ఎముకల బలహీనత, రక్త హీనత వంటి సమస్యలు ఈ పండు తినడం వలన మన దరిచేరవు అని అంటున్నారు.
మనకి ఇష్టమైన పండులో ఇన్ని లాభాలున్నాయని తెలిసిన తరువాత మనకి ఎంత ఆనందంగా ఉంటుంది. కాబట్టి ఈ శీతాకాలంలో దొరికే రేగుపండ్లని అవకాశం దొరికినప్పుడల్లా ఆనందంగా తినేయ్యండి మరి. ఆనందమే ఆరోగ్యం-ఆరోగ్యమే మహా భాగ్యం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Kadapa, Local News