బ్రతికున్నప్పుడు ఎలా బ్రతికినా.. కనీసం చనిపోయిన తర్వాత అయినా వారిని గౌరవంగా సాగనంపాలంటారు పెద్దలు. కానీ ఆ ముగ్గురికి ఏమైందో తెలియదు.. చావు ఎందుకొచ్చిందో అర్ధం కాలేదు.. అన్నీ తెలుసుకునేలోపే ప్రాణం పోయింది. బ్రతుకు దెరువు కోసం వెళ్తే బ్రతుకేలేకుండా చేశాడా దేవుడు. కానీ చచ్చిన తర్వత కూడా వారి మృతదేహాలు ఖననం చేయడానికి కాస్త భూమి కూడా దొరకలేదు. భయంతో గ్రామస్తులు రానివ్వకపోవడంతో అనాథ శవాల్లో అడవిలో కుళ్లిపోవాల్సి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని వైఎస్ఆర్ కడప జిల్లా (YSR Kadapa District), అన్నమయ్య జిల్లా (Annamayya District) ల సరిహద్దుల్లోని అటవీ ప్రాంతంలో లభ్యమైన మృతదేహాల కేసును పోలీసులు ఛేధించారు. విచారణలో పలు పోలీసులకే కన్నీళ్లు తెప్పించే విషయాలు తెలిశాయి.
వివరాల్లోకి వెళ్తే.. అన్నమయ్య జిల్లా రాయచోటిలోని గొర్లముదివీడు యానాది కాలనీకి చెందినవారు బొగ్గులు తయారు చేస్తూ జీవనం సాగిస్తుండేవారు. ఈ క్రమంలో రెండు వారాల క్రితం రాయచోటికి చెందిన బసవయ్య అనే మేస్త్రి.. చెంచయ్యతో పాటు పలువుర్ని బొగ్గుల తయారీ కోసం కర్ణాటకలోని గుల్బర్గాకి తీసుకెళ్లాడు. అక్కడ తాగునీరు లేకపోవడంతో చెలమలు తవ్వుకున్నారు. ఐతే ఆ నీటిని తాగిన వారికి వాంతులు, విరేచనాలు అయ్యాయి. దీంతో స్థానికంగా ఓ ఆస్పత్రిలో చేర్పించగా.. అక్కడి డాక్టర్లు స్వస్థలానికి వెళ్లిపోవాలని సూచించారు.
ఐతే అప్పటికే వారితో వెళ్లిన ఓ బాలిక ప్రాణాలు కోల్పోవడంతో అక్కడే ఖననం చేశారు. కర్ణాటక నుంచి స్వగ్రామానికి తిరిగొస్తుండగా.. చెంచయ్య, చెంచురామయ్యతో పాటు భారతి అనే మహిళ మృతి చెందారు. దీనిపై బసవయ్య.. గ్రామస్తులకు సమాచారం ఇచ్చాడు. ఐతే అంటువ్యాధుల భయంతో మృతదేహాలను తమ గ్రామానికి తీసురావద్దని స్థానికులు హెచ్చరించారు. దీంతో చెంచయ్య కుమారుడు శివాజీ సమక్షంలో మూడు మృతదేహాలన ప్లాస్టిక్ కవర్లో చుట్టి లోయలో పడేశారు. కానీ చెట్లు, రాళ్లు తగలడంతో మృతదేహాలు అక్కడే ఉండిపోయాయి.
లోయలో మృతదేహాలను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో విచారణ ప్రారంభించారు. మృతదేహాలు గర్తుపట్టలేని విధంగా కుళ్లిపోవడంతో దర్యాప్తు కష్టమైంది. తొలుత హత్యలుగా భావించి ఆ కోణంలో విచారణ జరపగా ఎలాంటి క్లూ లభ్యం కాలేదు. ఐతే ఓ మృతదేహం షర్టుపై ఉన్న టైలర్ లేబుల్ ఆధారంగా రాయచోటి ప్రాంతంలో విచారించగా అసలు విషయం బయటపడింది. మృతదేహాలను తీసుకురావద్దని గ్రామస్తులు హెచ్చరించడంతోనే అలా చేసినట్లు మేస్త్రి బసవయ్య, చెంచయ్య భార్య చిట్టెమ్మ తెలపడంతో మిస్టరీ వీడింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Kadapa