D Prasad, News18, Kadapa
నాడు ఆమె చేసిన పోరాటమే నేడు ఎందరో మహిళల పాలిట వరమై నిలిచింది. సంవత్సర కాలంలో ఎందరో మహిళా విద్యార్థులకి విద్యా బుద్దులు నేర్పించి వారిని ఉన్నత స్థాయిలో నిలుపుతుంది. ఆమె ఎవరో కాదు కడప జిల్లా (Kadapa District) నుండి స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న వీర మహిళా కోటిరెడ్డి రామ సుబ్బమ్మ. మహిళా దినోత్సవ సందర్భంగా నేడు ఆమె గురించి తెలుసుకుందాం. కడప (Kadapa) నగర నడిబొడ్డున మహిళా సాధికారతే లక్ష్యంగా జిల్లాలో ఏర్పాటైన ఏకైక మహిళా డిగ్రీ కళాశాల. కోటిరెడ్డి మహిళా కళాశాల. ఈ కళాశాల ప్రారంభించినప్పటి నుంచి జిల్లాలోని మహిళల జీవితాల్లో వెలుగులు నింపుతోంది. స్త్రీ విద్య అభ్యున్నతికి ఏర్పాటైన ఈ విద్యాలయం గురించి తెలుసుకోవాలంటే ముందు ఈ కళాశాల నిర్మాణానికి ఎంతో కృషి చేసిన కోటి రెడ్డి రామ సుబ్బమ్మ గారి గురించి తెలుసుకోవాలి.
కడప జిల్లా (Kadapa District) నుండి గాంధీపిలుపు మేరకు స్వాతంత్ర్యపోరాటంలో పాల్గొని తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్నారు కోటి రెడ్డి. ఆయన సతీమణి ఈ కోటి రెడ్డి రామ సుబ్బమ్మ . ఈమె కడప జిల్లా, జమ్మలమడుగు తాలుకా సుద్దా పల్లె గ్రామంలో జన్మించారు. తన 15 ఏటనే కోటిరెడ్డిని వివాహమాడింది. ఆపైన భర్త సహకారంతో అప్పటి సమకాలిన విషయాలలో అద్భుతమైన శ్రద్దని కనపరిచేది. ఆ తరువాత ఆమె భారత వలసవాద వ్యతిరేక జాతీయోద్యమంలోప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఉద్యమంలో కుడా పాల్గొంది.
1933లో కడప జిల్లా ఎడ్యుకేషనల్ కౌన్సిల్ కు అధ్యక్షులుగా ఉన్న ఆమె 1938 లో కడప జిల్లా బోర్డ్ అధ్యక్షులుగా కూడా పని చేశారు. ఈ విధంగా కడప జిల్లా బోర్డ్ కి మొట్టమొదటి మహిళా అధ్యక్షులుగా ఆమె పని చేశారు. మహిళా విద్యని ప్రోత్సహిస్తూ 1973లో కోటిరెడ్డి రామ సుబ్బమ్మ చొరవతో కోర్టు భవన సముదాయంలో జిల్లాలో మొట్టమొదటి మహిళా డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేశారు. కళాశాల అభివృద్ధికి ఆమె సొంత నిధులు వెచ్చించారు. చాల కాలం వరకు కోర్టు భవన సముదాయంలో కొనసాగిన ఈ కళాశాల... ప్రస్తుతంనాగరాజుపేట నుంచి పాతబస్టాండ్ వెళ్లే మార్గానికిమార్చబడింది.
ఆనాడు రామ సుబ్బమ్మ చొరవతో ప్రారంభించబడిన కళాశాల నాటి నుంచి నేటి వరకు కడప నగరంలో ఒకే ఒక్క ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల జిల్లా విద్యార్థినులకు సేవలందిస్తోంది. అంతే కాకుండా ఈ కళాశాల నుండి ఎంతో మంది విద్యార్థులు ఉన్నత స్థానానికి చేరుకొని సమాజంలో గౌరవప్రదంగా నివసిస్తున్నారు. ఈ విధంగా రామ సుబ్బమ్మ స్త్రీ కి విద్యని అందించి సమాజంలో చెరిగిపోని ముద్ర వేసుకుని, మహిళల మనసులో నిలిచిపోయారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Kadapa, Local News