మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి (Vivekananda Reddy)మర్డర్ కేసు దర్యాప్తులో భాగంగా కొత్త పేరు తెరపైకి రావడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. అయితే ముఖ్యంగా ఆ పేరు కలిగిన వ్యక్తికి ఈ కేసులో విచారణ ఎదుర్కొంటున్న ప్రస్తుత కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి(Avinash Reddy)పలుమార్లు ఫోన్ చేసినట్లుగా..ఆయన కాల్ డేటా (Call data)ద్వారా సీబీఐ అధికారులు గుర్తించినట్లుగా తెలుస్తోంది. అయితే ఇంతకీ ఎవరీ నవీన్(Naveen)..అతని ప్రొఫైల్ ఏంటని సీబీఐ(CBI) కూపీ లాగుతున్నట్లుగా సమాచారం. అంతే కాదు ఎంపీ అవినాష్‌రెడ్డి కాల్ డేటా ప్రకారం అతని పేరు నవీన్ అయినప్పటికి ...అసలు పేరు వేరే ఉండటం, పులివెందుల స్థానికుడు కావడంతో సీబీఐ అధికారులు అతనిపై దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది. అయితే వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణలో భాగంగా ఇప్పటికే ఎంపీ అవినాష్‌రెడ్డిని విచారించిన సీబీఐ అధికారులు ..నెక్స్ట్ ఎలా వ్యవహరించబోతున్నారు..? కొత్తగా బయటకువచ్చిన పేరు కలిగిన వ్యక్తిని విచారిస్తారా ..? అతనికి సీఎం వైఎస్ జగన్ ఫ్యామిలీతో ఎలాంటి పరిచయాలు ఉన్నాయి ..? వంటి విషయాలపై కూడా ఆరా తీస్తారనే చర్చ జోరందుకుంది.
ఎవరీ నవీన్..
మాజీ మంత్రి, మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణలో ఇప్పటికే పదుల సంఖ్యలో పేర్లు బయటకు వచ్చాయి. అందులో చాలా మందిని అధికారులు విచారించారు.తాజాగా ఈకేసులో నవీన్ అనే వ్యక్తి పేరు బయటకు వచ్చినట్లుగా తెలుస్తోంది. వివేకా మర్డర్ కేసులో సీబీఐ విచారణకు హాజరైన ఎంపీ అవినాష్‌రెడ్డి కాల్ డేటా ఆధారంగానే ఈ పేరు బహిర్గం అయినట్లుగా సమాచారం. అయితే నవీన్ ఫ్యామిలీ పులివెందులలోని రాజారెడ్డి కాలనీలో నివాసముంటోంది. వీళ్లు సీఎం జగన్ తాత అయినటువంటి రాజారెడ్డి దగ్గర పని చేసినట్లుగా సమాచారం. అందులో భాగంగానే నవీన్ చదువుకుంటూ సీఎం జగన్‌కు దగ్గరైనట్లుగా బెంగుళూరు, హైదరాబాద్ లోటస్‌పాండ్‌లో ఆయన దగ్గరే పని చేశారని తెలుస్తోంది. ప్రస్తుతం తాడేపల్లిలో ఉంటున్న సీఎం జగన్ నివాసంలో ఉంటూ వారికి ఇంట్లో పనులు చేస్తున్నట్లుగా సీబీఐ అధికారులు గుర్తించినట్లుగా ప్రచారం జరుగుతోంది.
లోతుగా దర్యాప్తు ..
సీఎం జగన్ దగ్గర పని చేస్తున్న నవీన్‌కి వివేక మర్డర్ తర్వాత అవినాష్‌రెడ్డి పలుమార్లు ఫోన్ చేసినట్లుగా కాల్‌డేటా ద్వారా వెల్లడవడంతో సీబీఐ అధికారులు అతని వివరాలు, ప్రొఫైల్ తెలుసుకుంటున్నారని సమాచారం. పులివెందులలో కొత్తగా ఓ కారు తిరుగుతుండటంతో స్థానికంగా కొంత హడావుడి నెలకొంది. అయితే కడప ఎంపీ కాల్‌డేటాలో వెల్లడైన నవీన్ అసలు పేరు హరిప్రసాద్‌గా తెలుస్తోంది. సోమవారం బయటకు వచ్చిన ఈ వ్యవహారంలో అనుమానిత వ్యక్తులు ఎవరూ కనిపించకపోవడంతో వివేక మర్డర్ కేసులోప్రస్తుతానికి ఏం జరగబోతోందనే ఉత్కంఠ మాత్రం నెలకొంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.