D Prasad, News18, Kadapa
ఈ భూమి మీద మానవుడి జీవనం మొదలైన క్షణం నుండి అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతూ సామాజికంగా ఆర్థికంగా నిలదొక్కుకుంటూ అధునాతనమైన పరిజ్ఞానాన్ని సంపాదించి, జీవన పోరాటంలో ముందుకు సాగుతున్నాడు. నేటి ఆధునిక యుగంలో బలవంతుడు బలహీనుడు మద్య అంతరం నేడు ధనిక, పేద, బడుగు వర్గాలుగా విడిపడి ముందుకు సాగుతూ వుంది. అలాంటి ప్రపంచంలో నేటికి ఆకలితో అలమటిస్తూ, పొట్ట కూటకై పొరుగూరుకి పయనమై వచ్చిన కూలీల జీవన చిత్రం చూడండి. మీ మనస్సు కూడా కదులుతుంది. కడప (Kadapa) నగరంలో ఐటి సర్కిల్ నుండి సంధ్యా సర్కిల్ మార్గ మద్యంలో ప్రయాణించే వారికి ఉదయం ఎనిమిదిన్నర నుండి పది గంటల మద్య సమయంలో జిల్లా పరిషత్ దగ్గరలోని సర్కిల్ వద్ద ఒక మినీ జన సంద్రం కనిపిస్తూ ఉంటుంది.
ఆ జన సంద్రంలోని జనాల ముఖ చిత్రాలను పరిశీలనగా గమనించినట్లైతే అందరి ముఖంలోను ఒకటే సందిగ్ధత, మనసులో ఒకటే ఆలోచన, ఇవాలైన పని దొరక్క పోదా...! అనే చిన్న ఆశ వారిని ఆవరించి ఉంటుంది.పొద్దు పొద్దునే 8 గంటల సమయానికి వారి ఇంటి పనులు ముగించుకుని, బతుకుదెరువు చూపించే పని కోసం పని కట్టుకుని, మధ్యాహ్న సమయానికి కావలసిన ఆహారపు క్యారియర్ గిన్నెలు నెత్తిమీద పెట్టుకుని ఆడవారు, పనిముట్లు పట్టుకుని మగవారు కడప జిల్లాపరిషత్ వైపు రావడం మనకు ప్రతి రోజు కనిపిస్తూ ఉంటుంది.
అక్కడికి రావడంతోనే అక్కడే గుమి గూడివున్న తోటి వారిని ఒకసారి పలకరిచి పని గురించి వెతుక్కోవడం, అటుగా వచ్చి ఆగిన మోటార్ సైకిల్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్లి పనుందా సారూ..? అని అడగడం వారికి మామూలే. కాని అక్కడికి చేరిన వారందరికీ పని దొరుకుతుందనే గ్యారంటీ లేదు. పని దొరినినా పనికి తగిన కూలీదొరకదు, ఈ విధంగా కూలి కోసం వలస వచ్చిన వారిలో చాల భాగం కర్నూలు , కడప జిల్లా కరువు ప్రాంతాల ప్రజలు ఇక్కడ మనకి కనపడుతుంటారు. ఏదేమైనా పనివున్న రోజు మస్తు లేదంటే పస్తు. అంటూ సాగుతున్న కూలి బ్రతుకుల జీవన దృశ్యం ఇది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Kadapa, Local News