అప్పటికి పదహారేళ్లు కూడా నిందని వయసు, జీవితం మీద ఎన్నో ఆశలు, భవిష్యత్తుని ఎంతో ఎత్తులో ఊహించుకుంటూ చదువుకునే వయసులో, వారి ఆశలకి, ఊహలకి కళ్లెం వేస్తూ ఆ పిల్లలకి వారి తల్లిదండ్రులే పెళ్ళిళ్ళు చేస్తున్న వైనం.సమాజంలో అన్ని విషయాలలో పురోగతి సాధించినా.. ఇప్పటికి కొన్ని గ్రామీణ ప్రాంతాలలో అవగాహన లేని కొందరు తల్లిదండ్రులు వారి ఆడ పిల్లలని సరైన వయసు రాక మునుపే పెళ్ళిళ్ళు చేసి అత్తవారింటికి పంపించాలని తొందరపడుతూ ఉంటారు.
అలాంటి వారికోసం ప్రభుత్వం ఎన్ని అవగాహనా కార్యక్రమాలు చేపట్టినా ఫలితం శూన్యం.ఇలాంటి అనాగరిక అంశాన్ని ఎండగడుతూ నగరంలో ఒక బాలిక చేసిన పనికి అందరు ఆ పాపని మెచ్చుకుంటున్నారు. అదేమిటో మీరు కూడా చదివేయండి.కడప నగరంలోని రామకృష్ణ నగర్‌కు చెందిన ఒక వ్యక్తి, పదో తరగతి చదువుతున్న తన కుమార్తెకి వివాహం చేయడానికి నిశ్చయించాడు.
ఈ నెల మూడవ తేది నుండి ఆ అమ్మాయికి పబ్లిక్ పరీక్షలు మొదలు కానున్నాయి. చదువుకోవాలని ఆకాంక్ష కలిగిన ఆ అమ్మాయి, వారి తల్లిదండ్రులు వివాహానికి సంబంధించిన సామగ్రి కొనడానికని బయటకి వెళ్ళారు. సరైన సమయం కోసం ఎదురు చూస్తున్న ఆ అమ్మాయి వెంటనే నగరంలోని దిశా పోలిస్ స్టేషన్ కి వెళ్లి డీఎస్పీకి విషయాన్ని వివరించింది. ఈ విషయంపై స్పందించిన డీఎస్పీ దిశ సిబ్బందిని రామకృష్ణనగర్‌కు పంపించి వారి తల్లిదండ్రులు చేస్తున్న ఈ బాల్యవివాహ ప్రయత్నాన్ని అడ్డుకున్నారు.
అంతే కాకుండా బాలిక తల్లిదండ్రులు, అబ్బాయి తల్లిదండ్రులను స్టేషన్ కి పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. బాలికకు 18 ఏళ్లు నిండే వరకు వివాహం చేయమని రాతపూర్వకంగా రాయించుకుని పంపించారు. ఈ విషయం పై డీఎస్పీ మాట్లాడుతూ అమ్మాయికి 18 ఏళ్లు, అబ్బాయికి 21 ఏళ్లు పూర్తి కాకుండా వివాహం చేయడం నేరమన్నారు. ఎక్కడైనా బాల్యవివాహాలు జరుగుతున్నా, వేధింపులకు గురవుతున్నా 181, 1098, 08562-224333, 112, 100, 1100 నంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు.
తనను ఈ బాల్య వివాహం నుండి తప్పించిన పోలీసులకి ఆ అమ్మాయి ధన్యవాదాలు చెప్పింది. ఇలా ధైర్యం చేసి నిలబడిన ఆ అమ్మాయి తీరు చూసి శభాష్ అని స్థానికులు మెచ్చుకుంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Kadapa, Local News, Wedding