JR NTR MAY BECOME NEW HEADACHE FOR CHANDRABABU NAIDU IN TDP AND ANDHRA PRADESH POLITICS AK
Andhra Pradesh: టీడీపీలో మళ్లీ ‘జూనియర్ ఎన్టీఆర్’… చంద్రబాబుకు కొత్త తలనొప్పి
చంద్రబాబు, జూనియర్ ఎన్టీఆర్ (ఫైల్ ఫోటో)
Chandrababu Naidu-Jr NTRచంద్రబాబు సొంత నియోజకవర్గం.. ఆయనకు తిరుగులేని నియోజకవర్గమైన కుప్పంలో.. అది ఆయన ముందే జూనియర్ ఎన్టీఆర్ రావాలి అంటూ టీడీపీ శ్రేణులు నినాదాలు చేయడం టీడీపీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
ఏపీలో దూకుడు మీదున్న వైసీపీని ఎదుర్కొని టీడీపీని మళ్లీ అధికారంలోకి తీసుకురావడం ఆ పార్టీ అధినేత చంద్రబాబుకు పెద్ద సవాల్‌గా మారింది. మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఏకంగా తన సొంత నియోజకవర్గంలోనే వైసీపీ మెజార్టీ స్థానాలు గెలుచుకోవడం చంద్రబాబుకు పెద్ద ఎదురుదెబ్బ అనే చెప్పాలి. అలాంటి చంద్రబాబుకు ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ రూపంలో మరో కొత్త తలనొప్పి ఎదురుకానుందా ? అనే చర్చ కూడా రాజకీయవర్గాల్లో మొదలైంది. కుప్పంలో పర్యటిస్తున్న చంద్రబాబుకు కార్యకర్తల నుంచి ఊహించని అనుభవం ఎదురైంది. శాంతిపురం రోడ్ షోలో చంద్రబాబును సార్ సార్ అంటూ పిలిచి మరీ జూనియర్ ఎన్టీఆర్ ను తీసుకురావాలంటూ అక్కడి కార్యకర్తలు కోరారు. జూనియర్ ఎన్టీఆర్ ని ప్రచారానికి తీసుకుండి సార్.. జూనియర్ ఎన్టీఆర్ తప్పకుండా రావాలి సర్.. కుప్పం కూడా తీసుకురావాలి సర్ అంటూ కోరారు. దీంతో టీడీపీకి జూనియర్ ఎన్టీఆర్ అవసరం ఎంతుందో కార్యకర్తలు చంద్రబాబుకు చెప్పకనే చెప్పారు. సొంత నియోజకవర్గంలోనే ఈ డిమాండ్ వినిపించడం పార్టీలో చర్చనీయాంశమైంది.
నిజానికి టీడీపీకి మళ్లీ జూనియర్ ఎన్టీఆర్ సేవలు అవసరమని.. పార్టీకి మళ్లీ కొత్త ఉత్తేజం, ఉత్సాహం రావాలంటే జూనియర్ ఎన్టీఆర్ రాక తప్పదనే అభిప్రాయం టీడీపీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. అప్పుడప్పుడు ఎక్కడో ఒక చోట ఈ ప్రస్తావన వస్తూనే ఉంది. అయితే అధినేత చంద్రబాబు మనోగతం తెలిసిన నాయకులు మాత్రం ఈ వాదనకు దూరంగా ఉంటున్నారు. కానీ ఇప్పుడు ఏకంగా చంద్రబాబు సొంత నియోజకవర్గం.. ఆయనకు తిరుగులేని నియోజకవర్గమైన కుప్పంలో.. అది ఆయన ముందే జూనియర్ ఎన్టీఆర్ రావాలి అంటూ టీడీపీ శ్రేణులు నినాదాలు చేయడం టీడీపీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
మరోవైపు కుప్పంలో చోటు చేసుకున్న ఈ ఘటన కారణంగా చంద్రబాబుకు భవిష్యత్తులోనూ టీడీపీ శ్రేణుల నుంచి ఈ రకమైన డిమాండ్లు వచ్చే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అదే జరిగితే అసలే రాజకీయంగా ఇబ్బందులు పడుతున్న టీడీపీకి, ఆ పార్టీ అధినేత చంద్రబాబుకు కొత్త ఇబ్బందులు ఖాయమనే టాక్ వినిపిస్తోంది. మొత్తానికి చంద్రబాబు కుప్పం పర్యటనలో తెరపైకి వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ నినాదాలు.. టీడీపీపై ఏ రకమైన ప్రభావం చూపుతాయో చూడాలి.