ఏపీ సర్కార్‌ అది తెలుసుకోవాలి...’నిమ్మగడ్డ’ కేసుపై పవన్ కళ్యాణ్ రియాక్షన్

Pawan kalyan reaction on nimmagadda Ramesh kumar case: రాజ్యాంగానికి, చట్టానికి లోబడి పని చేయడం, నిర్ణయాలు తీసుకోవడం అవసరం అని ప్రభుత్వం ఈ తీర్పు ద్వారా తెలుసుకోవాలని పవన్ కళ్యాణ్ వివరించారు.

news18-telugu
Updated: May 29, 2020, 1:17 PM IST
ఏపీ సర్కార్‌ అది తెలుసుకోవాలి...’నిమ్మగడ్డ’ కేసుపై పవన్ కళ్యాణ్ రియాక్షన్
పవన్ కళ్యాణ్ (ఫైల్ ఫోటో)
  • Share this:
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్‌ను తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్సును రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ తీర్పు రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి ఊపిరిపోసిందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్య ప్రక్రియపై ప్రజలకు విశ్వాసాన్ని ఇనుమడింపచేసిందని అన్నారు. రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైన వ్యవస్థలను ప్రభుత్వాలు తమకు నచ్చిన విధంగా మార్చుకోవాలని చూస్తే న్యాయ విభాగాలు రక్షిస్తాయి అనే విషయాన్ని రాష్ట్ర హైకోర్టు తీర్పు ద్వారా మరోమారు అవగతమైందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం భేషజాలకు పోకుండా నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా తిరిగి కొనసాగించాలనే తీర్పును తక్షణమే అంగీకరించి రాజ్యాంగాన్ని, చట్టాన్ని గౌరవించాలని కోరారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ అభీష్టానికి భిన్నంగా వెళ్లారనే కారణంతోనే నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌ను లక్ష్యంగా చేసుకున్నారని అభిప్రాయపడ్డారు. ఆ రోజు ఆయన ఎన్నికల కమిషనర్ హోదాలో కరోనా విపత్తు ఎంత ప్రమాదకరమైనదో గ్రహించి ఎన్నికల ప్రక్రియను నిలుపుదల చేశారని పవన్ కళ్యాణ్ అన్నారు. అప్పుడు ముఖ్యమంత్రి స్పందించిన తీరుని ప్రజాస్వామ్యవాదులెవరూ హర్షించలేదని... రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న అధికారిపై ముఖ్యమంత్రితోపాటు, అధికార పక్షంవాళ్లు చేసిన వ్యాఖ్యలు వారి ధోరణిని వెల్లడించాయని విమర్శించారు.

కరోనాతో అందరూ ఆందోళనలో ఉంటే ప్రభుత్వం మాత్రం ఎన్నికల కమిషనర్‌ను తప్పించే ప్రక్రియపై దృష్టిపెట్టి రాజ్యాంగంలో పేర్కొన్న ఆర్టికల్స్‌ను కూడా పరిగణనలోకి తీసుకోలేదని అన్నారు. రాజ్యాంగానికి, చట్టానికి లోబడి పని చేయడం, నిర్ణయాలు తీసుకోవడం అవసరం అని ప్రభుత్వం ఈ తీర్పు ద్వారా తెలుసుకోవాలని పవన్ కళ్యాణ్ వివరించారు. ఏకస్వామ్య ప్రభుత్వంగానో, నియంతృత్వ ధోరణితోనో పాలన సాగిస్తే న్యాయ వ్యవస్థ ద్వారా ప్రజాస్వామ్యానికి రక్షణ లభిస్తుందని గ్రహించాలని వ్యాఖ్యానించారు. అధికార యంత్రాంగం కూడా పాలకులకు రాజ్యాంగం గురించీ, చట్టం గురించీ అవగాహన కల్పించాలని... లేదంటే న్యాయ స్థానాల ముందు జవాబు చెప్పుకోవాల్సింది అధికార యంత్రాంగమే అని పవన్ కళ్యాణ్ అన్నారు.
First published: May 29, 2020, 1:17 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading