జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) బస్సు యాత్రకు సిద్దం అవుతున్నారు. యాత్రకు అవసరమైన బస్సును ప్రత్యేకంగా డిజైన్ చేయించి, హైదరాబాద్‌లో రూపొందించారు. ఇప్పటికే బస్సు తయారీ పూర్తైంది. బస్సులో ప్రత్యేక లైటింగ్, CCTVలు, ఆధునిక భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఈ బస్సుకు వారాహి అని పేరు పెట్టారు. 2024 సాధారణ ఎన్నికల నాటికి రాష్ట్రమంతా విస్తృతంగా పర్యటించేందుకు పవన్ కల్యాణ్ ఈ బస్సును ప్రత్యేకంగా తయారు చేయించుకున్నారు.
నాడు ఎన్టీఆర్ చైతన్యరథం.. నేడు జనసేనాని వారాహి
1982లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు చైతన్య రథం తయారు చేయించుకున్నారు. అప్పట్లో అదో సంచలనం. అదే వాహనంపై ఎన్టీఆర్ రాష్ట్రం మొత్తం పర్యటించారు. చైతన్యరథం చూసేందుకు కూడా జనం ఎగబడ్డారు. ఇక ఎన్టీఆర్ హవా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నేడు జనసేనాని ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రత్యేకమైన వాహనం తయారు చేయించుకున్నారు. అన్ని సౌకర్యాలతో వారాహి బస్సు సిద్దమైంది. డిసెంబరు 7న ఈ వాహనం ట్రయల్ రన్ నిర్వహించారు. 2024 ఎన్నికల నేపథ్యంలో ఓటర్లను చైతన్యం చేసేందుకు పవన్ కళ్యాణ్ రాష్ట్రవ్యాప్తంగా వారాహిలో పర్యటించనున్నారు.
ఎన్నికల యుద్ధానికి సిద్ధం
వచ్చే ఎన్నికలకల సమరానికి వారాహి సిద్ధంగా ఉందని పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. వాహనం పక్కన నిలబడి ఫోటో దిగారు. వారాహిలో ముగ్గురికి వసతి ఉంటుంది. తెలంగాణలోని జగిత్యాల జిల్లాలోని కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత ఇది రోడ్డుపైకి రానుంది. జనసేన పార్టీ శ్రేణులు తెలిపిన వివరాల ప్రకారం.. యాత్ర చేపట్టేందుకు ప్రత్యేక వాహనం సిద్ధమయింది. ట్రయల్ రన్ అనంతరం పవన్ కళ్యాణ్ కొన్ని సూచనలు చేశారు. సాంకేతిక నిపుణులతోనూ చర్చించారు. అన్ని అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, వాహనానికి అవసరమైన భద్రతా చర్యలతో దీన్ని రూపొందించారు.
రెండు రాష్ట్రాలు కలిసే పరిస్థితి వస్తే స్వాగతిస్తాం.. ఏపీ మంత్రి బొత్స
వారాహి అంటే ఏమిటి?
దుర్గాదేవి సప్తమాతలలో వారాహి ఒకరు. ఈ వాహనానికి వారాహి దేవి పేరు పెట్టారు. దుర్గాదేవి ఏడుగురు మాతృ దేవతలలో వారాహి ఒకరు అని పురాణాలు చెబుతున్నాయి. ఈ ఏడుగురు మాతృ దేవతలు రక్త బీజుడు అనే రాక్షసుడిని సంహరించారు. వైసీపీని అధికారం నుంచి దించేందుకు ఈ వారాహి ఉపయోగపడుతుందని జనసేన అధినేత భావిస్తున్నారు.
వారాహి ప్రత్యేకతలు
వారాహిలో ప్రత్యేకమైన లైటింగ్, ఆధునిక సౌండ్ సిస్టమ్స్ .ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి అత్యంత భద్రతా చర్యలతో వాహనం రూపొందించారు .వైజాగ్‌లో పవన్‌కల్యాణ్ పర్యటనల సందర్భంగా లైట్లు ఆఫ్ చేయడం వంటి ప్రతీకార చర్యల సంస్కృతిని గమనించి వాహనంలో ప్రత్యేక లైటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు.వారాహిలో అన్ని వైపులా CC కెమెరాలు ఉన్నాయి. అది ఎప్పటికప్పుడు సర్వర్ రూమ్‌కి వెళుతుంది.ఆధునిక సౌండ్ సిస్టమ్‌తో వేలాది మంది ప్రజలు కూడా పవన్ కల్యాణ్ ప్రసంగాలను స్పష్టంగా వినవచ్చు. కొండగట్టులో పూజల అనంతరం.. వారాహిని ఏపీలోని జనసేన కార్యాలయానికి తరలిస్తారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Janasena, Pawan kalyan