Home /News /andhra-pradesh /

JANASENA PAWAN KALYAN RAISES RS 1 CRORE TO TURN FORMER CM DAMODARAM SANJIVAYYA HOUSE INTO A MEMORIAL MKS

Pawan Kalyan: ఎవరూ చేయలేని పనిని తలకెత్తుకున్న JanaSena -మాజీ సీఎం కోసం కోటి రూపాయలతో నిధి

దామోదరం సంజీవయ్యపై పవన్ కల్యాణ్

దామోదరం సంజీవయ్యపై పవన్ కల్యాణ్

జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు. చరిత్రలో ఎంతో గొప్ప పేరు ఉండి కూడా ఇప్పటిదకా నిరాదరణకు గురవుతోన్న దివంగత నేతకు సంబంధించిన కీలక బాధ్యతను జనసేనాని నెత్తికెత్తుకున్నారు. ఏకంగా కోటి రూపాయలతో నిధిని ఏర్పాటు చేసి నిత్య స్మరణీయుడైన ఆ నేత పాత ఇంటిని స్మారక చిహ్నంగా మార్చబోతున్నట్లు పవన్ ప్రకటించారు..

ఇంకా చదవండి ...
దేశ చరిత్రలో అత్యంత అరుదైన నేతగా, చిన్న వయసులోనే సీఎం అయిన వ్యక్తిగా, జాతీయ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడైన తొలి దళిత నేతగా, వృద్ధాప్య పెన్షన్లకు ఆద్యుడిగా, కార్మిక చట్టాల రూపకల్పనలో ముఖ్యుడిగా, నిజాం అనంతర హైదరాబాద్ అభివృద్ధిలో దార్శనికుడిగా.. ఇలా ఎన్నెన్నో ఉపమానాలు కలిగిన మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్యను ‘నిత్య స్మరణీయులు’గా పేర్కొంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక ప్రకటన చేశారు. కర్నూలు జిల్లా పెదపాడులోని సంజీవయ్య పాత (ఫొటోలో కనిపిస్తున్న) ఇంటిని స్మారక కేంద్రంగా తీర్చిదిద్దుతామని, అందు కోసం కోటి రూపాయలతో నిధిని ఏర్పాటు చేశామని పవన్ వెల్లడించారు. ఈ మేరకు ఆదివారం వరుస ట్వీట్లలో సంజీవయ్యకు సంబంధించిన ఆసక్తికర విషయాలను పవన్ గుర్తుచేశారు. పవన్ ప్రకటనను యథాతథంగా అందిస్తున్నాం..

సమతావాదులు, ప్రజాసేవకులు నిత్యం స్మరించుకోవలసిన విలక్షణ నాయకుడు దామోదరం సంజీవయ్య. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన తొలి అణగారిన నేత. కడు పేదరికంలో జన్మించి అసాధారణ వ్యక్తిగా ఎదిగిన కారుణ్యమూర్తి సంజీవయ్య. సమకాలీన కుటిల నీతి కారణంగా రెండేళ్లకే సీఎం పదవిని వదులుకోవాల్సి వచ్చినా.. తన పదవీకాలంలో ఆయన సాధించిన విజయాలు, ప్రజలకు అందించిన అపూర్వ సేవలు చిరస్మరణీయం.

తెలంగాణ, ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో వెనుకబాటుతనాన్ని రూపుమాపడానికి సంజీవయ్య కృషిచేశారు. శ్రీకాకుళంలో వంశధార ప్రాజెక్టు, రాయలసీమలో గాజులదిన్నె, వరదరాజులు ప్రాజెక్టులు ఆయనలోని అపర భగీరథునికి గుర్తులుగా నిలిచాయి. కృష్ణా నదిపై పులిచింతల ప్రాజెక్టుకు అంకురార్పణ చేసింది కూడా సంజీవయ్యే..

హైదరాబాద్, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో నిజాం భూములు సుమారు 6లక్షల ఎకరాలను దళితులు, వెనుకబడిన వర్గాలు, కార్మిక కర్షకులు, కులవృత్తిదారులకు పంపిణీ చేసిన భూబాంధవుడు సంజీవయ్య. దార్శనికతలో ఆయనకు ఆయనే సాటి. కార్మికులకు బోనస్, చట్టాల సవరింపునకు న్యాయ కమిషన్, అవినీతి నిరోధక శాఖ, చర్మకారుల కోసం లిడ్ క్యాప్, ఊరూరా పారిశ్రామిక వాడలు, ప్రభుత్వ రంగంలో పరిశ్రమల ఏర్పాటుకు విశేష కృషి చేశారు. భాగ్యనగరం భవిష్యత్తును ముందే ఊహించి.. హైదరాబాద్-సికింద్రాబాద్ లను కలిపి ఒకే మున్సిపల్ కార్పొరేషన్ గా ఏర్పాటు చేసింది కూడా సంజీవయ్యే..

వృద్ధులు, వికాలాంగులకు పెన్షన్ ఇవ్వడాన్ని మొదలు పెట్టిందే దామోదరం సంజీవయ్య. ఒక సందర్బంలో.. అనారోగ్యంతో బాధపడుతోన్న తల్లిని చూడటానికి స్వగ్రామం వెళ్లి ఆమెకు వంద రూపాయలు ఇవ్వబోగా, ‘నాకు ఆరోగ్యం బాగా లేకుంటే నువ్వు డబ్బులిచ్చావ్.. మరి డబ్బులు లేనివాళ్లు తల్లులకు ఏమివ్వగలరు?’అనడంతో చెలించిపోయిన సంజీవయ్య.. అనంతరకాలంలో పెన్షన్ల పథకానికి రూపకల్పన చేశారు.

కవి, రచయిత కూడా అయిన దామోదరం సంజీవయ్య హిందీ, ఇంగ్లీష్ భాషల్లోనూ అనర్గళంగా ఉపన్యసించేవారు. మాతృభాష తెలుగుపై ఆయనకు మక్కువ ఎక్కువ. అందుకే ప్రభుత్వ కార్యాలయాల్లో ఉత్తరప్రత్యుత్తరాలు తెలుగులోనే జరగాలని నిర్దేశించారు.

అర్ద శతాబ్దం కిందటే కులాల మధ్య సయోధ్యను సాధించి చూపారు సంజీవయ్య. సామాజికంగా వెనుకబడిన బోయలు, కాపు, తెలగ, బలిజ, ఇతర కాపు అనుబంధ కులాలను బీసీ జాబితాలో చేర్చి, వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి పాటుపడ్డారు. ఇవన్నీ కేవలం రెండేళ్లలోనే ఆచరించి చూపారాయన. కాంగ్రెస్ పార్టీకి జాతీయ అధ్యక్షుడిగాన పనిచేసిన తొలి దళిత నేత కూడా ఆయనే. అంతటి మహానుభావుడు..

దామోదరం సంజీవయ్య జీవిత చరమాంకంలో అతి సాధారణంగా బతికారు. రూ.17వేల నగదు, పాత ఫియట్ కారు తప్ప చనిపోయేనాటికి ఆయన దగ్గర ఆస్తులేవీ లేవు. అదే ఇప్పటి నాయకులైతే? ఏవిధంగా చూసినా సంజీవయ్యను ‘నిత్య స్మరణీయుడు’గానే నేను భావిస్తున్నాను. ప్రజలకు ఆయన చేసిన సేవలకు గుర్తుగా సంజీవయ్య నివసించిన ఇంటిని స్మారక చిహ్నంగా మలచడానికి జనసేన సంకల్పించింది. ఇందుకోసం కోటి రూపాయలతో నిధిని ఏర్పాటు చేయబోతున్న విషయాన్ని వినమ్రంగా తెలియజేస్తున్నాను.. అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
Published by:Madhu Kota
First published:

Tags: Janasena, Karnool, Pawan kalyan

తదుపరి వార్తలు