అమరావతి రైతులపై కేసులు... తక్షణమే ఉపసంహరించాలని జనసేన డిమాండ్

Amaravati : అమరావతిలో తాము శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే... పోలీసులు తమపై దౌర్జన్యంగా ప్రవర్తిస్తున్నారని మండిపడుతున్నారు స్థానిక రైతులు. దీనిపై స్పందించిన జనసేన... రైతులకు అండగా నిలిచింది.

news18-telugu
Updated: February 20, 2020, 2:15 PM IST
అమరావతి రైతులపై కేసులు... తక్షణమే ఉపసంహరించాలని జనసేన డిమాండ్
అమరావతి రైతులపై కేసులు... తక్షణమే ఉపసంహరించాలని జనసేన డిమాండ్ (File)
  • Share this:
Amaravati : అమరావతిలో 426 మంది రైతులపై పోలీసులు కేసులు నమోదు చేయడాన్ని జనసేన పార్టీ తీవ్రంగా తప్పుపట్టింది. వెంటనే కేసుల్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది. రాజధాని గ్రామం కృష్ణాయపాలెంలో రెవెన్యూ అధికారుల ముందు నిరసన తెలిపిన రైతులపై 7 సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం ప్రభుత్వ నిరంకుశ వైఖరిని వెల్లడిస్తోందన్న జనసేన పార్టీ... రాజధాని అమరావతి పరిధిలోని గ్రామాలకు చెందిన 426 మందిపై కేసులుపెట్టి రైతాంగాన్ని భయభ్రాంతులకు గురిచేయాలని ప్రభుత్వం భావిస్తోందని మండిపడింది. ప్రభుత్వం తక్షణమే ఈ కేసులను ఉపసంహరించుకోవాలని కోరింది. రాజధాని నిర్మాణం కోసం ఇచ్చిన భూములను... ఇళ్ల స్థలాల కోసం ఇవ్వాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని అంగీకరించకూడదనే ఉద్దేశంతోనే ఆ రైతులు నిరసన తెలిపారన్న జనసేన పార్టీ.... మూడు రాజధానుల ప్రకటన వచ్చినప్పటి నుంచి రైతుల భవిష్యత్ అగమ్యగోచరంగా మారిందని అభిప్రాయపడింది. ఇలాంటి తరుణంలో కేసులుపెట్టడం లాంటి చర్యలు పుండు మీద కారం చల్లినట్లు అవుతుందని హెచ్చరించింది. తొలి రోజు నుంచీ రైతులు శాంతియుతంగా తమ ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారనీ.... ప్రభుత్వం రైతులతో చర్చించకుండా కేసులుపెట్టడం లాంటి చర్యలకు దిగడం అప్రజాస్వామికం అవుతుందని అభిప్రాయపడింది. రాజధాని కోసం పోరాడుతున్నవారికి జనసేన బాసటగా నిలుస్తుందని హామీ ఇచ్చింది జనసేన పార్టీ.


బుధవారం తహశీల్దార్ వాహనాన్ని రైతులు అడ్డుకున్నారు. తమకు న్యాయం చెయ్యాల్సిందేననీ, ఇలా వాహనాల్లో తిరిగితే సరిపోదనీ, తమను పట్టించుకోని నేతలు, అధికారులను అడ్డుకుంటామని రైతులు ప్రకటించారు. అప్రమత్తమైన పోలీసులు రైతుల్ని నిలువరించేందుకు ప్రయత్నించారు. ఈ సమయంలో కొంత ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. ఐతే... దాదాపు 500 మంది రైతులు వాహనం ఎలా ముందుకెళ్తుందో చూస్తామంటూ... రోడ్డుపైనే బైటాయించడంతో... పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. తాజాగా కృష్ణాయపాలెం‌కి చెందిన 426 మంది రైతులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. మంగళగిరి రూరల్ పోలీస్‍స్టేషన్‍లో ఈ కేసులు నమోదయ్యాయి. వాహనాన్ని అడ్డుకోవడం, పబ్లిక్ న్యూసెన్స్ సహా 7 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. త్వరలోనే రైతులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

దాదాపు రెండు నెలలకు పైగా ధర్నాలు, నిరాహార దీక్షలూ చేస్తున్నా... వైసీపీ ప్రభుత్వం మాత్రం అమరావతిలోనే పరిపాలనా రాజధానిని ఉంచాలని అనుకోవట్లేదు. ఇదే స్థానిక రైతులకు ఆగ్రహం తెప్పిస్తోంది. ప్రభుత్వ మాత్రం... టీడీపీ ఉచ్చులో పడొద్దనీ, మూడు రాజధానుల్లో భాగమైన అమరావతిని కూడా అభివృద్ధి చేస్తామని చెబుతోంది. ఈ వ్యాఖ్యల్ని స్థానిక రైతులు నమ్మట్లేదు. విశాఖకు పరిపాలనా రాజధానిని తరలించవద్దని కోరుతున్నారు. ప్రభుత్వం మాత్రం ఉగాది నుంచీ విశాఖ నుంచే పరిపాలన సాగించేందుకు ప్రణాళిక వేసుకున్నట్లు తెలుస్తోంది.
Published by: Krishna Kumar N
First published: February 20, 2020, 2:15 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading