ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వానికి, టాలీవుడ్ (Tollywood) కి మధ్య నెలకొన్న వివాదానికి ఇటివలే ఎండ్ కార్డ్ పడిన సంగతి తెలిసిందే. సినిమా టికెట్ల ధరలు పెంచుతూ ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేయడంతో సినీ పరిశ్రమ హర్షం వ్యక్తం చేసింది. అంతేకాదు సీఎం జగన్ (CM YS Jagan) కు త్వరలోనే టాలీవుడ్ తరపున సన్మానం చేస్తామని కూడా ప్రకటించింది. ఐతే ఈ వ్యాఖ్యలపై జనసేన నేత నాదెండ్ల మనోహర్ స్పందించారు. టాలీవుడ్ పెద్దలు సీఎం జగన్ కు సన్మానం చేసేందుకు సిద్ధమవడతం కామెడీ సీన్ లా ఉందని ఆయన అన్నారు. ఏపీలోని పేదలంతా ఒక్కసారిగా ధనవంతులు ఎలా అయ్యారన్నారు. ప్రజలంతా ధనవంతులయ్యారనే టికెట్ల రేట్లు పెంచారని.. ఏడు లక్షల కోట్ల అప్పులు తెచ్చి వాళ్లను ధనవంతులను చేశారని మనోహర్ ఎద్దేవా చేశారు. సీఎం ఆలోచనా విధానం చాలా విచిత్రంగా ఉందని ఆయన అన్నారు.
గతంలో అందుబాటు ధరల్లో పేదలకు వినోదాన్ని అందిస్తామని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇటీవల విడుదలైన పవన్ కల్యాణ్ (Pawan Kalyan) భీమ్లా నాయక్ సినిమా (Bheemla Nayak Movie) వరకు తగ్గించిన రేట్లను అమలు చేసిన ప్రభుత్వం.. ఆ సినిమా విడుదలైన పది రోజుల తర్వాత టికెట్ రేట్లను పెంచింది. ఈ నేపథ్యంలో సినిమా విడుదల సందర్భంగా జనసేన నేతలు ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇప్పుడు టాలీవుడ్ పై, సీఎం జగన్ పై నాదెండ్ల మనోహర్ సెటైర్లు వేయడం ఆసక్తికరంగా మారింది.
ఇదిలా ఉంటే జనసేన ఆవిర్భావ దినోత్సవం విషయంలోనూ ప్రభుత్వం సరిగా స్పందించలేదని నాదెండ్ల మనోహర్ అన్నారు. సభకు అనమతులు కోరుతూ గత నెల 28న డీజీపీకి లేఖ రాసినా పట్టించుకోలేదన్నారు. పోలీస్ శాఖ బందోబస్తు ఇచ్చినా ఇవ్వకపోయినా సభ నిర్వహించి తీరుతామని స్పష్టం చేశారు. ప్రభుత్వ తీరు వల్ల సభ కోసం 3 ప్రాంతాలు మారాల్సి వచ్చిందన్నారు. చివరకు ఇప్పటం గ్రామ రైతులు వైసీపీ నేతలు బెదిరించినా ధైర్యంగా ముందుకొచ్చి పార్టీకి సహకరించారని చెప్పారు.
ఐతే జనసేన సభకు ప్రభుత్వం అనుమతివ్వలేదని నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. అనుమతుల కోసం హైకోర్టుకు వెళ్తామని స్పష్టం చేశారు. ఐతే ఆయన ఆ వ్యాఖ్యలు చేసిన కొద్దిసేపటికే ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. దీంతో జనసైనికులు ఏర్పాట్లను ముమ్మరం చేశారు. ఇప్పటికే సభ నిర్వహణకు పార్టీ అధిష్టానం 12 కమిటీలను నియమించింది. ఈనెల 14న పార్టీ ఆవిర్భావ సభకు జనసేనాని పవన్ కల్యాణ్ తో పాటు ఇతర ముఖ్యనేతలు హాజరుకానున్నారు.
Published by:Purna Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.