Bheemla Nayak: ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో భీమ్లా నాయక్ (Bheemla Nayak) సినిమా రిలీజ్ అయ్యింది. ప్రతి చోటు రికార్డు కలెక్షన్లతో భీమ్లా నాయక్ సత్తా చాటుతున్నాడు. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో మాత్రం సినిమాపై రాజకీయ రచ్చ ఇంకా కొనసాగుతూనే ఉంది. సినిమా రిలీజ్ కు ముందు రోజే ఏపీ ప్రభుత్వం (AP Government) ఆదేశాలు జారీ చేయడం.. ఐదో షోకు అనుమతించకపోవడంతో ప్రభుత్వం కావాలనే కక్ష కట్టిందని.. సినిమాకు కలెక్షన్లు రాకుండా పవన్ ను దెబ్బ తీయడమే ప్రభుత్వం లక్ష్యమని పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అభిమానులు ఆరోపణలు చేశారు. అయితే తాజా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం కొన్ని చోట్ల థియేటర్లను క్లోజ్ చేశారు.. ఇంత తక్కువ ధరలో సినిమాను ప్రదర్శించలేం అంటూ.. థియేటర్ గేటుకు బోర్డులు కూడా పెట్టారు. ఇక కొంతమంది పవన్ అభిమానులైతే థియేటర్ల దగ్గర తక్కువ ధరకే టికెట్లు అమ్మడంతో మిగిలిన డబ్బుల కోసం హుండీలను కూడా ఏర్పాటు చేశారు. ఇలా ప్రభుత్వం చర్యకు ప్రతి చర్య అంటూ.. సినిమాను సూపర్ హిట్ చేయాలని ఫ్యాన్స్ కంకణం కట్టుకున్నారు. దీంతో తొలి రోజు ఏపీలో పరిస్థితి ప్రభుత్వం వర్సెస్ భీమ్లా నాయక్ అన్నట్టు పరిస్థితి కనిపించింది.
ఈ వివాదంపై జనసేన నేత నాదెండ్ల మనోహర్ (Nadenda Manohar) సైతం స్పందించారు. ప్రజాస్వామ్య భావాలపై విశ్వాసం ఉన్న నాయకులు వైసీపీని విడిచిపెట్టే సమయం ఆసన్నమైందని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి సంకుచిత మనస్తత్వంతో నియంతలా ఆలోచిస్తున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యం కోసం.. రాష్ట్రాభివృద్ధి కోసం పవన్ కళ్యాణ్ తో కలసి నడిచేందుకు రండి అని ఆయన వైసీపీ నేతలకు పిలుపు ఇచ్చారు. ప్రజల కోసం పని చేయాల్సిన రెవెన్యూ సిబ్బందిని సినిమా హాళ్ల దగ్గరకు పంపడం.. అహంభావామే అని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ అహంకారానికి.. పవన్ ఆత్మగౌరవానికి జరిగే పోరులో.. ఆత్మ గౌరవమే గెలిచిందని నాదెండ్ల అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం కుట్రలు పన్నినా.. సహనంగా ఉన్న జన సైనికులకు, అభిమానులకు అభినందనలు తెలిపారు ఆయన.
ఇదీ చదవండి : కొత్త జిల్లా ఏర్పాటు..? ఉద్యోగుల విభజన అప్పుడేనా..?
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) తన అధికారాన్ని అడ్డంపెట్టుకొని అహంకారంతో సినిమా థియేటర్ల వద్ద కర్ఫ్యూ వాతావరణం తీసుకొచ్చారని ఆయన అన్నార. ప్రజా సమస్యలు తీరుస్తారని నమ్మి అధికారం ఇస్తే.. జగన్ రెడ్డి ఇటువంటి పాలన అందిస్తారని ఎవరూ ఊహించి ఉండరని ఆయన విమర్శించారు. భీమ్లా నాయక్ సినిమా విడుదల సందర్భంగా థియేటర్ల వద్ద జరిగిన సంఘటనలు చూసి యావత్తు ప్రపంచం ఆశ్చర్యపోయిందన్నారు. మనం ఎవ్వరూ ఊహించని విధంగా క్షేత్రస్థాయిలో అధికార దుర్వినియోగం జరిగిందన్నారు. సినీ పరిశ్రమను ప్రోత్సహిస్తామని, పెట్టుబడులుపెడితే ప్రత్యేక రాయితీలు కల్పిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి.. మరి పవన్ కల్యాణ్ సినిమా విడుదల సందర్భంగా ప్రతి సినిమా థియేటర్ వద్ద ప్రభుత్వ సిబ్బందిని ఉపయోగించి, ప్రజలను భయబ్రాంతులకు గురి చేసేలా కుట్ర చేయడం సిగ్గుచేటు అని మండిపడ్డారు.
ఇదీ చదవండి :ప్రభుత్వ ఉద్యోగులకు షాకిస్తున్న సర్కార్.. సమయానికి రాకుంటే జీతం కట్
రెవెన్యూ సిబ్బంది రైతులకు ఉపయోగపడే విధంగా పనిచేయాల్సి ఉంది. రైతులకు సంబంధించిన పాస్ పుస్తకాలు జారీ చేయాలి. విద్యార్ధులకు, సామాన్యులకు అవసరమైన సర్టిఫికెట్లు ఇవ్వాలి. వీళ్లకున్న బాధ్యతలను పక్కనపెట్టించి వేకువ జామునే వీళ్లందనీ సినిమా థియేటర్ల దగ్గరకు పంపించి ప్రత్యేకంగా సినిమాకు వచ్చే ప్రతి ఒక్కరిని భయబ్రాంతులకు గురి చేయడానికి ప్రభుత్వం చేసిన కుట్ర చాలా చాలా పొరపాటన్నారు. రెవెన్యూ సిబ్బందికి ఉన్న అధికార బాధ్యతలను పక్కన పెట్టించారు. భీమ్లా నాయక్ చిత్రంలో ఆత్మగౌరవానికి, అహంభావానికి జరిగే పోరాటం ఉంది. సినిమాలో లాగే రాజీకయంగా కూడా ఆత్మగౌరవే గెలుస్తుందన్నారు నాదెండ్ల మనోహర్.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.