జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నివర్ తుఫాన్ ప్రభావిత జిల్లాల్లో పర్యటించనున్నారు. డిసెంబర్ 2 నుంచి ఆయన పర్యటన మొదలు కానుంది. డిసెంబర్ 2న కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. ఆ తర్వాత డిసెంబర్ 3, 4, 5 తేదీల్లో చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో పవన్ కళ్యాణ్ పర్యటన ఉంటుందని ఆ పార్టీ నేత హరిప్రసాద్ తెలిపారు. నివర్ తుఫాన్ కారణంగా పంటలు నష్టపోయిన రైతులను పరామర్శించి, పంట నష్టాలను స్వయంగా తెలుసుకోవాలని పవన్ కళ్యాణ్ క్షేత్రస్థాయిలో పర్యటించనున్నారు. నాలుగు రోజుల పాటు క్షేత్రస్థాయిలో పర్యటిస్తారు. డిసెంబర్ 2 నుంచి పర్యటన మొదలవుతుంది. ఉదయం 9.30 గంటలకు కృష్ణా జిల్లా ఉయ్యూరు చేరుకుంటారు. అక్కడి నుంచి పామర్ర, చల్లపల్లి, అవనిగడ్డ ప్రాంతాల్లో పర్యటిస్తారు. పులిగడ్డ వంతెన మీదుగా గుంటూరు జిల్లాకు వెళ్తారు. గుంటూరు జిల్లాలో భట్టిప్రోలు, చావలి, పెరవలి, ప్రాంతాల మీదుగా తెనాలి, నందివెలుగు, కొలకలూరులో పవన్ కళ్యాణ్ పర్యటిస్తారు.
డిసెంబర్ 3వ తేదీన పవన్ కళ్యాన్ తిరుపతి చేరుకుంటారు. చిత్తూరు జిల్లాలో వరద వల్ల జరిగిన పంట నష్టంపై పార్టీ నాయకులతో చర్చిస్తారు. 4వ తేదీన శ్రీకాళహస్తి ప్రాంతంలో పర్యటించి అక్కడి రైతాంగాన్ని కలుస్తారు. అక్కడి నుంచి నాయుడు పేట, గూడూరుల్లో పర్యటించి నెల్లూరు చేరుకుంటారు. 5వ తేదీన నెల్లూరు, రాపూరు, వెంకటగిరి ప్రాంతాల్లో పర్యటిస్తారు. నివర్ ప్రభావిత జిల్లాల నేతలతో పవన్ కళ్యాణ్ నవంబర్ 29న టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అందులో జిల్లాల క్షేత్రస్థాయి సమాచారాన్ని జిల్లాల నేతల నుంచి సమాచారం తెలుసుకున్నారు. రైతుల కష్టాలను జనసైనికులు వినిపించారు. దీంతో తుఫాన్ ప్రభావిత ప్రాంతాలకు వెళ్లి స్వయంగా పరిశీలించి, రైతులను కలవాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించారు.
Published by:Ashok Kumar Bonepalli
First published:November 30, 2020, 19:07 IST