news18-telugu
Updated: November 25, 2020, 7:57 PM IST
జేపీ నడ్డాతో పవన్ కల్యాణ్ భేటీ
పవన్ ఢిల్లీకి ఎందుకు వెళ్లారు? నిన్నటి నుంచి ఏపీలో ఇదే చర్చ. బీజేపీ అగ్రనేతలతో భేటీ కోసం ఎదురుచూస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఎట్టకేలకు ఇవాళ సాయంత్రం కలిశారు. ఢిల్లీలో బీజేజీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో ఆయన నివాసంలో సమావేశమయ్యారు. పవన్ కల్యాణ్ వెంట జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా ఉన్నారు. పలు అంశాలపై వీరు చర్చలు జరిపారు. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన పవన్ కల్యాణ్.. అమరావతి, పోలవరం అంశాలతో పాటు తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికపైనా చర్చించినట్లు చెప్పారు. ఇరుపార్టీ ఉమ్మడి కమిటీ అభ్యర్థిని ఎంపిక చేస్తుందని వెల్లడించారు.
'' జేపీ నడ్డాతో జరిగిన సమావేశంలో అమరావతి, పోలవరం అంశాలపై చర్చించాం. అమరావతి రైతుల ఆందోళనకు జనసేన-బీజేపీ మద్దతు ఉంటుందని ఉంటుంది. ఏపీలో అవినీతి విధానాలు, శాంతిభద్రతలు, ఆలయాలపై దాడుల వ్యవహారంపైనా చర్చించాం. పోలవరంపై స్పష్టత ఇవ్వాలని నడ్డాను కోరాం. తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికకు అభ్యర్థిని త్వరలో నిర్ణయిస్తాం. ఇరు పార్టీల ఉమ్మడి కమిటీ వేసి అభ్యర్థిని ఎంపిక చేస్తాం. ఏ పార్టీ అభ్యర్థి అనేది ఆ సమావేశంలోనే నిర్ణయిస్తాం.'' అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

పవన్ కల్యాణ్ ఢిల్లీకి వెళ్లడంతో అందరూ తిరుపతి ఉపఎన్నికల గురించే చర్చించుకున్నారు. వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ మరణంతో అక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది. తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికకు ఇప్పటికీ టీడీపీ, వైసీపీ అభ్యర్థులను ఖరారు చేశాయి. టీడీపీ నుంచి పనబాక లక్ష్మి, వైసీీపీ నుంచి డాక్టర్ గురుమూర్తిని బరిలోకి దిగుతున్నారు. ఇక జనసేన-బీజేపీలో మిత్రపక్షాలుగా ఉన్న నేపథ్యంలో.. ఎవరు పోటీచేస్తారన్న దానిపై ఆసక్తి నెలకొంది. మొదటి నుంచీ తిరుపతిపై బీజేపీ నేతలు కన్నేయడంతో.. ఆ పార్టీయే అభ్యర్థిని రంగంలోకి దింపుతుందని అందరూ భావించారు. కానీ జనసేన తామూ రేస్‌లో ఉన్నామని ముందుకొచ్చింది.
ఇప్పటికే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ కోసం జనసేన పెద్ద త్యాగమే చేసింది. తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించిన తర్వాత.. బీజేపీకి మద్దతు తెలిపింది. లక్ష్మణ్, కిషన్ రెడ్డి పవన్ కల్యాణ్‌తో సమావేశం అనంతరం.. తమ పార్టీ అభ్యర్థులను ఉపసంహరించుకొని, గ్రేటర్ బరి నుంచి తప్పుకుంది. జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలంతా బీజేపీకి మద్దతు ఇవ్వాలని పవన్ కోరారు. బీజేపీ గెలుపునకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఐతే తిరుపతి ఉపఎన్నికలను దృష్టిలో ఉంచుకొనే.. గ్రేటర్ బరి నుంచి పవన్ తప్పుకున్నట్లు తెలిసింది. జీహెచ్ఎంసీలో పూర్తి స్థాయిలో మద్దతు తెలిపినందున.. తిరుపతిలో జనసేనకు మద్దతు తెలపాలని పవన్ డిమాండ్ చేసినట్లు సమాచారం. మరి జనసేనాని డిమాండ్‌కు బీజేపీ ఒప్పుకుంటుందా? లేదా? అన్నది అతి త్వరలోనే తేలనుంది.
Published by:
Shiva Kumar Addula
First published:
November 25, 2020, 7:51 PM IST