ఈమె ఆంధ్రా అన్నపూర్ణ.. ఎవరీ డొక్కా సీతమ్మ...

ఈమె ఆంధ్రా అన్నపూర్ణ.. ఎవరీ డొక్కా సీతమ్మ...

ఏపీలో డొక్కా సీతమ్మ ఆహార శిబిరాలు

మంగళగిరిలో తన చేతుల మీదుగా ఆహార శిబిరాన్ని ప్రారంభించి.. స్థానికులకు భోజనాలు పెట్టారు పవన్. ఐతే ఈ ఆహార శిబిరాలకు డొక్కా సీతమ్మ పేరు పెట్టడంతో.. ఆమె ఎవరనే దానిపై తెలుగు రాష్ట్రాలో చర్చ జరుగుతోంది.

 • Share this:
  ఏపీలో ఇసుక కొరత కారణంగా వేలాది మంది భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోయారు. వారికి అండగా జనసేన పార్టీ పలు కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇప్పటికే విశాఖలో లాంగ్ మార్చ్ నిర్వహించిన జనసేనాని పవన్ కళ్యాణ్.. ఇప్పడు భవన నిర్మాణ కార్మికుల కోసం డొక్కా సీతమ్మ ఆహార శిబిరాలను ఏర్పాటు చేశారు. మంగళగిరిలో తన చేతుల మీదుగా ఆహార శిబిరాన్ని ప్రారంభించి.. స్థానికులకు భోజనాలు పెట్టారు పవన్. రాష్ట్ర వ్యాప్తంగా జనసేన నేతలు ఈ శిబిరాలను ప్రారంభించారు. ఐతే ఈ ఆహార శిబిరాలకు డొక్కా సీతమ్మ పేరు పెట్టడంతో.. ఆమె ఎవరనే దానిపై తెలుగు రాష్ట్రాలో చర్చ జరుగుతోంది.

  డొక్కా సీతమ్మను ఆంధ్రా అన్నపూర్ణగా పిలుస్తారు. జాతి,కుల,మత, ప్రాంతాలను పట్టించుకోకుండా అందరికీ కడుపునిండా అన్నంపెట్టిన నిత్యాన్నదాత. ఖండాంతర ఖ్యాతి గడించిన మహాతల్లి..డొక్కా సీతమ్మ..! 1841లో మండపేటలో ఆమె జన్మించారు. ఆనపిండి భవానీ శంకరం, నరసమ్మ ఆమె తల్లిదండ్రులు. తొమ్మిదేళ్ల ప్రాయంలో సీతమ్మకు వివాహం జరిగింది. లంకల గన్నవరానికి చెందిన డొక్కా జోగన్నతో పెళ్లిచేశారు. జోగన్ననది వ్యవసాయ కుటుంబం. ఆ గ్రామంలో ఆయనే ధనవంతుడు. ఒక రోజున పండిత సభకు వెళ్లి వస్తూ మండపేట వచ్చేటప్పటికి మధ్యాహ్నం కావడంతో భవానీ శంకరం గుర్తొచ్చి..ఆయన ఇంటికి వెళ్లి భోజనం చేశారు. అతిధి మర్యాదలను చేయడంలో సీతమ్మ చూపిన ఆదరాభిమానులకు ఆయన సంతృప్తి చెందారు. ఆమె వినయ విధేయతలు నచ్చడంతో సీతమ్మను వివాహం చేసుకున్నారు జోగన్న.

  జోగన్న ఊరు లంకగన్నవరం గోదావరికి మార్గమధ్యంలో ఉన్నందు వల్ల ప్రయాణీకులు అలసిపోయి అక్కడకు చేరేవారు. అలాంటివారికి అన్నపానీయాలు సమకూర్చేవారు సీతమ్మ-జోగన్న దంపతులు. ఆ ఇంటి దంపతుల లక్ష్యం ఒక్కటేగా ఉండేది. ఎవరు ఏ వేళలో వచ్చి భోజనమని అడిగినా..ఆదరించి అన్నంపెట్టేవారు. ఇలా అన్నదానం చేయడం వారికి నిత్యకృత్యంగా మారింది.


  ఆమె నిరంతర అన్నదానం ఖండాంతరాలు దాటి ఖ్యాతి గడించింది. 1903లో తన పట్టాభిషేకానికి రావాల్సిందిగా బ్రిటీష్ ఏడవ ఎడ్వర్డు సీతమ్మను ఆహ్వానించారు. అయితే ఆమె సగౌరవంగా తిరస్కరించారు. కానీ పట్టాభిషేక మహోత్సవం సందర్భంగా చక్రవర్తి సింహాసనం పక్కనే మరో సింహాసనం ఏర్పాటు చేసి ఆమె చిత్రపటాన్ని పెట్టి గౌరవించారు. ఆమె చిత్రపటానికి నమస్కరించి.. ఏడో ఎడ్వర్డ్ పట్టాభిషేకం చేయించుకున్నారు. ఆమె సేవలను ప్రశంసిస్తూ గవర్నర్ జనరల్ ద్వారా బ్రిటీష్ చక్రవర్తి ప్రశంసాపత్రాన్ని పంపారు. కాగా, 1908లో సీతమ్మగారికి 68 ఏళ్ల వయస్సులో చేతిమీద కేన్సర్ వచ్చింది. 1909, ఏప్రిల్ 28న లంకల గన్నవరంలో ప్రాణాలు విడిచారు డొక్కా సీతమ్మ.

  (వికీపీడియా సౌజన్యంతో...)
  Published by:Shiva Kumar Addula
  First published:

  అగ్ర కథనాలు