ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు అన్ని పార్టీల లక్ష్యంగా ఒక్కటే. అదే తిరుపతి ఉప ఎన్నికలు. ఈ ఉప ఎన్నికల్లో సత్తా చాటాలని రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇక ఏపీలో గత ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయిన బీజేపీ సైతం.. ఈసారి ఎలాగైనా తిరుపతి ఉప ఎన్నికల్లో బలం పెంచుకోవాలని యోచిస్తోంది. ఏపీలో ఇటీవల జరుగుతున్న పరిణామాలు తమకు కలిసివస్తాయనే భావనలో ఆ పార్టీ ఉంది. తిరుపతిలో ఏ మేరకు ప్రభావం చూపుతామనే అంశంపైనే ఏపీలో తమ పార్టీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని బీజేపీ యోచిస్తోంది. తెలంగాణ తరహాలోనే ఏపీలోనూ తమ పరిస్థితి మెరుగుపడాలని కోరుకుంటోంది. ఇందుకు జనసేన బలం తమకు కలిసి వస్తుందని ఆ పార్టీ యోచిస్తోంది.
ఇప్పటికే తిరుపతితో జనసేన బలపరిచే బీజేపీ అభ్యర్థి పోటీ చేస్తారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించారు. ఆ తరువాత బీజేపీ ఎంపీ జీవీఎల్ సైతం ఇదే తరహా వ్యాఖ్యలు చేయడంతో.. తిరుపతిలో బీజేపీ, జనసేన కూటమి తరువాత బీజేపీ అభ్యర్థి బరిలో ఉంటారని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం.. తిరుపతి నుంచి పోటీ చేసే అవకాశం తమ పార్టీకి ఇవ్వాలని బీజేపీ నాయకత్వాన్ని కోరుతున్నట్టు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో నేడు పవన్ కళ్యాణ్ తిరుపతికి రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక్కడ జరిగే పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. తిరుపతి అభ్యర్థి ఎంపిక అంశంపై ఈ సమావేశంలో జనసేన కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు గ్రేటర్ హైదరాబాద్లో తాము పోటీ చేయకుండా బీజేపీకి మద్దతు ఇచ్చామనే విషయాన్ని గుర్తు చేస్తున్న జనసేన నేతలు.. తిరుపతి ఉప ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం తమకు ఇవ్వాలని బీజేపీని కోరే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇందుకు సంబంధించి జనసేన సమావేవశంలో తీర్మానం చేస్తారా ? అనే అంశం కూడా తెరపైకి వచ్చింది.
ఏపీలో తమ బలం ఎంతవరకు ఉందనే దానిపై అధికార వైసీపీకి తెలియజేయాలనే యోచనలో ఉన్న జనసేన.. ఇందుకు తిరుపతి ఉప ఎన్నికను ఉపయోగించుకోవాలని యోచిస్తోంది. ఇప్పటికే జనసేన తరపున తిరుపతి ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్న అభ్యర్థుల జాబితాను కూడా ఆ పార్టీ సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి నేడు తిరుపతి చేరుకున్న పవన్ కళ్యాణ్.. తిరుపతిలో పోటీ చేసే అంశంపై జనసేన శ్రేణులకు ఏ రకమైన క్లారిటీ ఇస్తారన్నది ప్రస్తుతానికి సస్పెన్సే.
Published by:Kishore Akkaladevi
First published:January 21, 2021, 17:28 IST