Jagananna Smart Town: మధ్యతరగతి ప్రజలకు గుడ్ న్యూస్.. ఇళ్లు పొందాలంటే ఏం చేయాలి? కొత్త మార్గదర్శకాలు

జగన్ అన్న స్మార్ట్ టౌన్ కొత్త మార్గదర్శకాలు

ఏపీలో మధ్య తరగతి ప్రజల కళ తీర్చేదిశగా ఏపీ ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. కొత్త మార్గదర్శకాలను విడుదల చేశారు. మరి ఈ ఇళ్లు పొందాలంటే ఏం చేయాలో తెలుసా..?

 • Share this:
  పేద ప్రజలకు వరుస సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న సీఎం జగన్.. మధ్య తరగతి ప్రజలకు గుడ్  న్యూస్ చెప్పారు. సొంతింటి కల నెరవేరే దిశగా.. నగరాలు, పట్టణాల్లో ఇళ్ల స్థలాల ధరలు ఆకాశాన్ని అంటుతున్న తరుణంలో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం మధ్యతరగతి వర్గాలకు ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. నగరాలు, పట్టణాల్లోని మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరల్లో ప్రణాళికా బద్ధంగా ఇళ్ల స్థలాలు సమకూర్చే జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌ల నిర్మాణం, లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి మార్గదర్శకాలు జారీ చేశారు. జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌లలో ప్లాట్‌లకు ఉన్న డిమాండ్‌ను తెలుసుకోవడం కోసం నిర్వహించిన ప్రాథమిక సర్వేకు అపూర్వ స్పందన లభించింది. ఈ పథకం కింద ప్లాట్‌ పొందడానికి 3.79 లక్షల దరఖాస్తులు ఇప్పటి వరకు వచ్చాయి. స్మార్ట్‌ టౌన్‌ షిప్‌ లే ఔట్లు అన్నీ ఒకే విధంగా ఉండేలా నిర్మాణాలు చేపట్టబోతున్నారు. లాభాపేక్ష లేకుండా అన్ని వసతులతో అభివృద్ధి చేసిన లేఔట్లను ప్రభుత్వం లబ్ధిదారులను సరసమైన ధరలకు ప్రభుత్వమే అందించనుంది. లేఔట్‌లకు భూసేకరణ, ప్లాట్‌ల నిర్మాణం, లబ్ధిదారుల ఎంపిక.. ఇలా ప్రతి దశలో పారదర్శకతతో వ్యవహరిస్తుంది. జిల్లా స్థాయి కమిటీల నుంచి వచ్చిన స్థలాల వివరాలు, లేఔట్‌ల ఏర్పాటు, ఇతర ప్రతిపాదనలను రాష్ట్ర స్థాయి కమిటీ స్క్రూటినీ చేసి ఆమోదిస్తుంది. జిల్లాల్లో స్మార్ట్‌ టౌన్లకు అవసరమైన భూమిని అంచనా వేయడం, మార్గదర్శకాల మేరకు భూమిని గుర్తించడం, ప్లాట్‌లను నిర్మించడం జిల్లా కమిటీల బాధ్యత అని పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

  అన్ని సౌకర్యాలతో లే అవుట్లు..
  డిమాండ్‌కు అనుగుణంగా 150, 200, 240 చదరపు గజాల్లో మూడు కేటగిరీల్లో ప్లాట్‌లు నిర్మిస్తారు. లేఔట్‌లలో 60 అడుగులు బీటీ, 40 అడుగులు సీసీ రోడ్లతో పాటు ఫుట్‌పాత్‌ల నిర్మాణం. నీటి నిల్వ, సరఫరాకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తారు. అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ వ్యవస్థ, ఎలక్ట్రికల్, కేబుల్, వీధి లైట్లు, పార్క్‌లు, ఇతర వసతుల కల్పిస్తారు. నగరాలు, పట్టణాల్లోని మార్కెట్‌ విలువ, లేఔట్‌కు చుట్టుపక్కల ఉన్న ఇతర లేఔట్‌ల ధరలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని రాష్ట్ర స్థాయి కమిటీ ధర నిర్ణయిస్తుంది. ఆ తరువాత అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీల నుంచి ధరల్లో మార్పులు చేర్పులు చేస్తూ ప్రతిపాదనలు అందితే రాష్ట్ర స్థాయి కమిటీ ఆమోదిస్తుంది.

  జగనన్న స్మార్ట్ టౌన్ లో ఇంటి పొందాలంటే అర్హతలు ఇవే..
  ఈ పథకం ద్వారా ఒక కుటుంబానికి ఒకే ప్లాట్‌ ఇస్తారు. ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన పథకం మార్గదర్శకాలకు అనుగుణంగా వార్షిక ఆదాయం 18 లక్షల లోపు అయి ఉండాలి. వయసు 18 సంవత్సరాలు పైబడి ఉండాలి. లబ్ధిదారుడు ఏపీలో నివసిస్తూ ఉండాలి. ఆధార్‌ కార్డు తప్పనిసరిగా కలిగి ఉండాలి.
  ఫ్లాట్లు ఎలా కేటాయిస్తారు అంటే...?
  డైరెక్టర్‌ ఆఫ్‌ టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానింగ్‌ రూపొందించిన వెబ్‌సైట్‌లో ప్లాట్‌ల కోసం దరఖాస్తు చేసుకోవాలి. లేదా స్థానిక వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ప్లాట్‌ అమ్మకం ధరపై 10 శాతం మొత్తాన్ని దరఖాస్తు సమయంలో ఆర్టీజీఎస్‌/ఎన్‌ఈఎఫ్‌టీ విధానంలో చెల్లించాల్సి ఉంటుంది. లాటరీ విధానంలో ప్లాట్‌లు కేటాయిస్తారు. దరఖాస్తుదారుడు ప్లాట్‌ పొందలేకపోతే లాటరీ అనంతరం నెల రోజులకు దరఖాస్తు సమయంలో చెల్లించిన 10 శాతం మొత్తాన్ని వెనక్కు ఇస్తారు.

  చెల్లింపులు ఇలా..
  ప్లాట్‌ పొందిన దరఖాస్తుదారులు వాయిదా పద్ధతిలో డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తు సమయంలో చెల్లించిన 10 శాతం మొత్తాన్ని మినహాయించి మిగిలిన మొత్తం చెల్లించాలి. అగ్రిమెంట్‌ కుదుర్చుకున్న నెల రోజులకు 30 శాతం, ఆరు నెలలలోపు మరో 30 శాతం, ఏడాది లోపు మిగతా 30 శాతం చెల్లించాలి. ఒక నెలలోపు ప్లాట్‌ అమ్మకం మొత్తాన్ని చెల్లించిన వారికి 5 శాతం రాయితీ ఇస్తారు. వాయిదా చెల్లించడంలో ఆలస్యం అయితే 0.5 శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం మీరు అర్హులైతే ఇలా చెక్ చేసుకోండి..
  Published by:Nagesh Paina
  First published: