ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రప్రభుత్వం (AP Government) జగనన్న సంపూర్ణ భూ హక్కు పథకం (Jagananna Sampoorna Bhu hakku Scheme) అమలును వేగవంతం చేస్తోంది. అర్హుల గుర్తింపు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభంకాగా.. దాదాపు 50లక్షల మంది లబ్ధిదారుల వివరాలను గృహనిర్మాణ శాఖ, మున్సిపాలిటీలు, పంచాయతీలకు బదిలీ చేసింది. ఈ పథకం కింద 1983 నుంచి 2011 ఆగస్టు 15 వరకు రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ నుంచి రుణం పొంది లేదా రుణం పొందకుండా నిర్మించిన ఇళ్లపై లబ్ధిదారులను పూర్తి యాజమాన్య హక్కులను రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తోంది. ఇందుకోసం నాలుగు దశల్లో అర్హుల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోంది. రాష్ట్రంలో 12జిల్లాల్లో లబ్ధిదారుల ఎంపిక కొనసాగుతోంది. బద్వేలు ఉపఎన్నిక కారణంగా వైఎస్ఆర్ కడప జిల్లాలో నిలిచిపోయింది. ఇటీవలే ఈ ఎన్నిక పూర్తవడం ఫలితాలు కూడా రావడంతో ఆ జిల్లాలోనూ అర్హులపై సర్వే జరగనుంది.
జగనన్న సంపూర్ణ భూ హక్కు పథకంలో గ్రామ, వార్డు వాలంటీర్లు, వీఆర్వోలు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు క్షేత్రస్థాయిలో పరిశీలన జరుపుతున్నారు. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి ప్రస్తుతం అక్కడ ఉంటున్నది ఎవరు..? స్థల స్వభావం, సరిహద్దులు గుర్తించి, ఇతర వివరాలను సేకరిస్తున్నారు. ఇప్పటివరకు పూర్తైన సర్వే ప్రకారం 12 జిల్లాల్లో 14లక్షల 34వేల 37 మందిని అర్హులుగా తేల్చారు.
వారికి ఊరట...
లబ్ధిదారులు గ్రామీణ ప్రాంతాల్లో ఉంటే వారు రూ.10వేలు, మున్సిపాలిటీల్లో రూ.15వేలు, కార్పొరేషన్లలో రూ.20వేలు చెల్లిస్తే పూర్తి యాజమాన్య హక్కులు కల్పిస్తారు. ఐతే ప్రభుత్వం నిర్దేశించిన మొత్తం కన్నా లబ్ధిదారులు చెల్లించాల్సిన రుణం తక్కువగా ఉంటే ఆ మొత్తం చెల్లిస్తే యాజమాన్య హక్కులు కల్పిస్తారు. అలాగే గతంలో ఇల్లు పొందిన లబ్ధిదారుల నుంచి కొనుగోలు చేసి ప్రస్తుతం నివాసముంటున్న వారు, వారి వారసులు వాస్తవ లబ్ధిదారుల కంటే రెట్టింపు మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. ఈ లెక్కన గ్రామీణ ప్రాంతాల్లో రూ.20వేలు, మున్సిపాలిటీల్లో రూ.15వేలు, కార్పొరేషన్లలో రూ.40వేలు ప్రభుత్వానికి చెల్లించాలి.
సవాల్ గా మారిన వివరాల సేకరణ..
ఇదిలా ఉంటే కొన్నిచోట్ల లబ్ధిదారుల వివరాల సేకరణ సిబ్బందికి కష్టంగా మారుతోంది. గృహరుణం పొందిన వివరాలు సరిగా లేకపోవడం, కుటుంబంలోని వారు చనిపోవడం లేదా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిపోవడం వంటి కారణాలతో గుర్తింపు కష్టతరమవుతోంది. ఇలాంటి వారు దాదాపు 10శాతానికి పైగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక లబ్ధిదారులు ఎంచుకునే ఆప్షన్లలలో నాట్ విల్లింగ్ అనే ఆప్షన్ తొలగింపుపై విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వం బలవంతంగా డబ్బులు వసూలు చేస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. మరోవైపు అక్కడక్కడా పూర్తికానీ కాలనీలు కూడా ఉన్నాయి. వాటికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh