ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 1వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుతున్న విద్యార్థులకు జగనన్న అమ్మఒడి పథకాన్ని అమలు చేస్తోంది. వరుసగా రెండో ఏడాది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యార్థుల ఖాతాల్లో రూ.15వేలు జమ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఐతే రెండో విడత అమ్మఒడి ప్రారంభమై దాదాపు నెల రోజులు గడుస్తున్నా కొంతమందికి ఇంకా నగదు జమకాలేదు. ఇటీవల పాఠశాలలు పునఃప్రారంభం కావడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఉపాధ్యాయులను ప్రశ్నిస్తున్నారు. ఈక్రమంలో తనకు అమ్మఒడి డబ్బులు రాలేదని అడిగిన ఓ విద్యార్థని ప్రధానోపాధ్యాయుడు చెంప చెళ్లుమనిపించాడు. నన్నే అడుగుతావా అంటూ రోడ్డుపైకి ఈడ్చుకెళ్లి కొట్టాడు. విశాఖపట్నం జిల్లా కశింకోట మండలం, ఏనుగుతుని ప్రాథమికోన్నత పాఠశాలలో ఈ ఘటన జరిగింది.
ఏనుగుతుని ప్రాథమికోన్నత పాఠశాలలో గత విద్యా సంవత్సరం 8వ తరగతి చదివిన రుపేష్ కు అమ్మఒడి పథకం కింద నగదు జమకాలేదు. నిరుపేదలైన రుపేష్ తల్లిదండ్రులు అమ్మఒడి పథకం వచ్చేలా చూడాలని పలుమార్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శర్మను కలిసి విజ్ఞప్తి చేశారు. అయితే సాంకేతిక కారణాల వల్ల అమ్మ ఒడి రాలేదని ఉపాధ్యాయుడు చేతులు దులుపుకున్నాడు. ఈ ఏడాది రుపేష్ నర్సింగబిల్లి ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతిలో చేరాడు. ఈ పాఠశాలలో అమ్మఒడి పథకం గురించి అడగ్గా.. ముందు చదివిన పాఠశాలలో ప్రాసెసింగ్ చేశారో? లేదో? తెలుసుకొని రావాలని సూచించారు.
దీంతో ఆఖరి ప్రయత్నంగా రుపేష్ మళ్లీ హెచ్ఎం శర్మను కలిశాడు. అమ్మఒడి గురించి అడగడంతో కోపోద్రిక్తుడైన శర్మ.. విచక్షణ మరచి విద్యార్థి చెంప చెల్లుమనిపించాడు. అంతటితో ఆగకుండా తనను అమ్మఒడి పథకం డబ్బులు అడిగేందుకు ఎంత ధైర్యమంటూ రోడ్డుపైకి తీసుకువచ్చి కొట్టాడు. ఇది గమనించిన స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో.. అది కాస్త వైరల్గా మారింది. దీంతో ప్రధానోపాధ్యాయుడి తీరుపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఐతే ఈ విషయంలో తన తప్పేం లేదని హెచ్ఎం శర్మ తెలిపారు. విద్యార్థి ఇచ్చిన బ్యాంక్ ఎకౌంట్ నెంబర్, అతని తల్లి ఎకౌంట్ నెంబర్ వేర్వేరుగా ఉన్నాయని అందుకే డబ్బులు పడలేదన్నారు. అలాగే రూపేష్ తండ్రి పలుసార్లు తాగొచ్చి తనతో దురుసుగా ప్రవర్తించాడని.. రూపేష్ కూడా అమర్యాదగా మాట్లాడటంతో అతడ్ని మందలించానే తప్ప దాడి చేయలేదని స్పష్టం చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Andhra pradesh news, AP News, Ap welfare schemes, Telugu news, Visakhapatnam, Vizag