Home /News /andhra-pradesh /

JAGAN GOVT GIVES GREEN SIGNAL TO ESTABLISH MEDICAL COLLEGE IN PALNADU REGION GNT

Piduguralla: పిడుగురాళ్ల సమీపంలో మెడికల్ కాలేజ్ ఏర్పాటుకు జగన్ గ్రీన్ సిగ్నల్.. పల్నాడు ప్రాంత దశ మారనుందా..?

ఫేస్‌బుక్ ఖాతాలో ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి పోస్ట్ చేసిన ఫొటో

ఫేస్‌బుక్ ఖాతాలో ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి పోస్ట్ చేసిన ఫొటో

పల్నాడు ప్రాంతం గుంటూరు జిల్లాలోనే వెనుకబడిన ప్రాంతం. సాగునీరు తక్కువుగా ఉన్న రోజుల్లో ఫ్యాక్షనిజం పల్నాడు పల్లెల్లో రాజ్యమేలింది. గత కొంతకాలంగా ఈ ప్రాంతం విద్యావకాశాలను అందిపుచ్చుకుని ముందుకు సాగుతోంది. ఈ సమయంలోనే రాష్ట్ర ప్రభుత్వం వెనుకబడిన పల్నాడు ప్రాంతంలో మెడికల్ కాలేజ్ ఏర్పాటుకు ముందుకొచ్చింది.

ఇంకా చదవండి ...
    మెడికల్ కాలేజ్ రాకతో పల్నాడు దశ మారనుందా... వైద్య సదుపాయాల కల్పనతో పాటు విద్యావకాశాలు పెరగనున్నాయా.. పగ, ప్రతీకారాలతో రగిలిపోయే పల్లెలు విద్యతో అభివృద్ది బాట పట్టనున్నాయా.. ప్రాణం కాపాడుకోవటానికి వందల కిలోమీటర్లు వెళ్లాల్సిన అవసరం లేదా.. అంటే అవుననే సమాధానం వస్తోంది. పిడుగురాళ్ల సమీపంలో ఏర్పాటు చేయనున్న మెడికల్ కాలేజ్‌పై స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

    పల్నాడు ప్రాంతంలో నాలుగు నియోజకవర్గాలున్నాయి. పదమూడు మండలాలున్నాయి. పల్నాడు ప్రాంతం గుంటూరు జిల్లాలోనే వెనుకబడిన ప్రాంతం. సాగునీరు తక్కువుగా ఉన్న రోజుల్లో ఫ్యాక్షనిజం పల్నాడు పల్లెల్లో రాజ్యమేలింది. గత కొంతకాలంగా ఈ ప్రాంతం విద్యావకాశాలను అందిపుచ్చుకుని ముందుకు సాగుతోంది. ఈ సమయంలోనే రాష్ట్ర ప్రభుత్వం వెనుకబడిన పల్నాడు ప్రాంతంలో మెడికల్ కాలేజ్ ఏర్పాటుకు ముందుకొచ్చింది. పిడుగురాళ్ల మండలం బ్రాహ్మణపల్లి వద్ద నలభై ఏడు ఎకరాలను ప్రభుత్వం మెడికల్ కాలేజ్ ఏర్పాటు కోసం సేకరించింది. మాచర్ల నుంచి గుంటూరు వంద కిలోమీటర్ల దూరంలో ఉంది. గురజాల, పిడుగురాళ్ల, దాచేపల్లి వంటి పట్టణాలు కూడా సుమారు 70 నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. పల్నాడు ప్రాంతంలో ఉన్న ప్రైవేటు ఆసుపత్రులను వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు. ఇక ప్రభుత్వ వైద్యశాలల పరిస్థితి చెప్పనవసరం లేదు. పది లక్షల మంది ఉండే ఈ ప్రాంతంలో ప్రభుత్వ రంగంలో కేవలం నూట ఇరవై బెడ్స్ మాత్రమే ఉన్నాయి. రోడ్డు ప్రమాదాలు జరిగినా, అత్యవసర వైద్యం కావాలన్నా దాదాపు గుంటూరు లేదా నర్సరావుపేట వెళ్లాల్సిందే. వంద కిలోమీటర్ల దూరం ప్రయాణించే లోపే ఎన్నో ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఈ క్రమంలో.. పల్నాడులో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని ఎంతోమంది ఎన్నో ఏళ్లుగా అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతూనే ఉన్నారు. అయినా మోక్షం లభించలేదు.

    సీఎం జగన్ మోహన్ రెడ్డి పదవి చేపట్టిన వెంటనే పల్నాడుపై ప్రత్యేక దృష్టి సారించడంతో మెడికల్ కాలేజ్‌ ఏర్పాటుకు అడుగులు పడ్డాయి. మెడికల్ కాలేజ్ రాకతో విద్యావకాశాలు పెరిగి తమ ప్రాంతం అభివృద్ది చెందుతుందని స్థానికులు భావిస్తున్నారు. ఇప్పటికే యాభై ఎకరాల భూమిని సేకరించారు. మరో ఇరవై ఎకరాల భూమిని సేకరించేందుకు అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. రూ.475 కోట్లతో నిర్మించనున్న మెడికల్ కాలేజ్ మరియు ఆసుపత్రి ముప్పై నెలల్లో అందుబాటులోకి రానుంది. ప్రముఖ కాంట్రాక్ట్ సంస్థ మేఘా కంపెనీ ఈ టెండర్‌ను దక్కించుకుంది. జూన్ నుంచి పనులు ప్రారంభించి అతి తక్కువ సమయంలోనే ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేయనున్నారు. తమ ప్రాంతంలో వస్తున్న కాలేజ్‌తో అభివృద్ధి సాధ్యమవుతుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఎంతోమంది పేదలకు ఉచితంగా వైద్యం అందుబాటులోకి వస్తుందంటున్నారు. భవిష్యత్తు తరాలకు మెడికల్ కాలేజ్ ఉపయోగం ఉంటుందన్నారు.

    విద్య అభివృద్ది చెందినప్పుడే వెనుకబాటుతనం పూర్తిగా పోతుందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. పల్నాడు ప్రాంత అభివృద్దికి మెడికల్ కాలేజ్ బాటలు వేస్తుందని అంటున్నారు. గత ముప్పై ఏళ్లుగా ఈ ప్రాంతంలో మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయాలని అనేక స్వచ్ఛంద సంస్ధలు, ప్రజా ప్రతినిధులు కృషి చేశారని చెబుతున్నారు. మారుమూల పల్లెలకు వైద్యం అందుబాటులోకి వస్తుందన్నారు.

    ప్రముఖ వైద్యులు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. ప్రైవేటు రంగంలో పెద్ద పెద్ద ఆసుపత్రులను ఏర్పాటు చేసినా వైద్యం తక్కువ ధరకు అందించలేని పరిస్థితి ప్రస్తుతముందని, ప్రభుత్వం వైద్యశాలను ఏర్పాటు చేస్తే పోటీగా ప్రైవేటు రంగం కూడా అభివృద్ది చెందుతుందన్నారు. మెడికల్ కాలేజ్‌తో పాటు నర్సింగ్, ఫిజియోధెరపి, ఫార్మసీ కాలేజ్‌లు కూడా ఈ ప్రాంతానికి వస్తాయన్నారు. దీంతో ఈ ప్రాంతం మొత్తంగా అభివృద్ది చెందుతుందన్నారు. వైద్యుల సంఖ్య పెరగటంతో తక్కువ ధరకే వైద్య సదుపాయాలు అందుతాయన్నారు.

    ఎన్నో ఏళ్లుగా ఆశగా ఎదురు చూస్తున్న ప్రజలకు సీఎం జగన్ మెడికల్ కాలేజ్ ఏర్పాటుకు అనుమతినిచ్చి వారి కలలను నెరవేర్చారని గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి అన్నారు. అతి తక్కువ సమయంలోనే కాలేజ్ నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్నారు. నాగార్జున సాగర్‌తో త్రాగు, సాగు నీరు అందుబాటులోకి వస్తే కాలేజ్‌తో విద్యా రంగం అభివృద్ది చెందుతుందన్నారు. రానున్న ముప్పై నెలల్లోనే వెయ్యి పడకల ఆసుపత్రి ఈ ప్రాంత ప్రజలకు అందుబాటులో ఉంటుందన్నారు.

    విద్యావకాశాలు పెరిగిన చోట అభివృద్ది జరుగుతందనటానికి అనేక ఆనవాళ్లున్నాయని.. పగ, ప్రతీకారాలు పూర్తిగా పోయి పల్లెల్లోనూ వెలుగులు చూడాలంటే పెద్ద ఎత్తున విద్యావకాశాలు పెరగాలని విశ్లేషకులు అంటున్నారు.
    Published by:Sambasiva Reddy
    First published:

    Tags: Guntur, Palnadu

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు