ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి (AP CM YS Jagan Mohan Reddy) తెలంగాణ హైకోర్టులో ఊరట కలిగింది. సీఎం జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ (CBI Cases on YS Jagan), ఈడీ కేసుల విచారణపై కీలక ఆదేశాలు జారీ చేసింది. జగన్‌పై నమోదైన అక్రమాస్తుల కేసుల్లో మొదట సీబీఐ చార్జిషీట్లపైనే తేల్చాలని స్పష్టం చేసింది. సీబీఐ చార్జిషీట్లపై తీర్పు వెల్లడైన తర్వాతే ఈడీ కేసుల విచారణ చేపట్టాలని ఆదేశాలు జారీచేసింది. ఒకవేళ రెండూ సమాంతరంగా విచారణ జరిపితే.. సీబీఐ కేసులు తేలేవరకు.. ఈడీ కేసులపై తీర్పు వెలువరించకూడదని స్పష్టం చేసింది. సీబీఐ, ఈడీ కేసులు (ED Cases on YS Jagan) వేర్వేరు అని.. ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా విచారణ చేపట్టవచ్చని... గతంలో సీబీఐ కోర్టు ఇచ్చిన తీర్పును తెలంగాణ హైకోర్టు ఈ సందర్భంగా కొట్టివేసింది.
ఒకవేళ సీబీఐ కేసులు వీగిపోతే ఈడీ కేసులే ఉండని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ గురువారం తీర్పును వెలువరించారు. ఈ విషయంలో గతంలోనే సుప్రీంకోర్టు క్లారిటీ ఇచ్చిందని.. ఒకవేళ సీబీఐ కేసులను కొట్టివేస్తే.. ఇక నేరపూరిత సొమ్ము అంశమే ఉండదని తెలిపారు. హైకోర్టు తీర్పుతో సీఎం జగన్‌తో పాటు అక్రమాస్తుల కేసులో నిందితులుగా ఉన్న విజయసాయిరెడ్డి, జగతి పబ్లికేషన్స్, భారతి సిమెంట్స్‌కి ఊరట కలిగినట్లయింది.
ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలకు సంబంధించి జగన్‌పై తొలుత సీబీఐ కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే.. ఆ కేసుల ఆధారంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా పలు కేసులు నమోదు చేసింది. ఈ కేసుల్లో ఇప్పటికే చార్జిషీట్లు దాఖలయ్యాయి. 11 సీబీఐ, 3 ఈడీ ఛార్జిషీట్లపై హైదరాబాద్ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో విచారణ జరుగుతోంది. ఐతే సీబీఐ కేసులతో సంబంధం లేకుండా తమ కేసులపై విచారణ ప్రారంభించాలని గతంలో సీబీఐ కోర్టుకు ఈడీ విజ్ఞప్తి చేసింది. ఇందుకు కోర్టు అంగీకరించింది. సీబీఐ కేసులతో సంబంధం లేకుండా.. ఈడీ కేసులను విచారణ చేపట్టాలని నిర్ణయించింది. కానీ సీబీఐ కోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ విజయసాయిరెడ్డి, జగతి పబ్లికేషన్స్, భారతీ సిమెంట్స్ హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్ దాఖలు చేశారు. మొదట సీబీఐ కేసులపైనే విచారణ జరపాలని విజ్ఞప్తి చేశారు. వాటిపై విచారణ జరిపిన హైకోర్టు.. తాజా ఆదేశాలు జారీ చేసింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, AP News, Ys jagan